Bombay High Court: బాలిక బుగ్గ తాకడం నేరం కాదు: బాంబే హైకోర్టు

కామవాంఛ లేకుండా బాలిక బుగ్గ తాకడం నేరమేమీ కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడైన మహమ్మద్‌ అహ్మద్‌ ఉల్లా (46)కు శనివారం బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంగా జస్టిస్‌ సందీప్‌ శిందే

Published : 30 Aug 2021 07:58 IST

కామవాంఛ లేని స్పర్శను లైంగికదాడి అనలేం

ముంబయి: కామవాంఛ లేకుండా బాలిక బుగ్గ తాకడం నేరమేమీ కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడైన మహమ్మద్‌ అహ్మద్‌ ఉల్లా (46)కు శనివారం బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంగా జస్టిస్‌ సందీప్‌ శిందే ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. ‘‘కామ వాంఛ లేకుండా బుగ్గలు తాకడం లైంగిక దాడి కాదని పోక్సో చట్టంలోని సెక్షన్‌-7 చెబుతోంది. ఆధారాలను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు నిందితుడు లైంగిక వాంఛతో బుగ్గలు తాకినట్టు అనిపించలేదు’’ అని తెలిపింది. ఠాణేలో మాంసం దుకాణం నడుపుతున్న ఉల్లా 2020 జులైలో ఓ ఎనిమిదేళ్ల బాలిక బుగ్గను తాకినట్టు కేసు నమోదయింది. ఆమెను తన దుకాణానికి పిలిచాడని, బుగ్గను తాకి చొక్కా విప్పాడని అభియోగం వచ్చింది. ప్యాంటు కూడా తీయబోయాడని, అప్పుడే అక్కడికి వెళ్లిన మరో మహిళ దీన్ని గమనించి ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. బాలికను దుకాణంలోకి తీసుకెళ్లడాన్ని చూసిన ఆ మహిళ అనుమానంతో అక్కడికి వెళ్లిందని తెలిపారు. వెంటనే ఆయనను అరెస్టు చేయగా, ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. వ్యాపారంలోని ప్రత్యర్థులు కుట్ర పన్ని తనను ఇరికించారని, తానెలాంటి నేరమూ చేయలేదని ఉల్లా వాదించాడు. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. తుదితీర్పుపై తన వ్యాఖ్యల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని