G20 Summit : నవంబరులో జీ-20 వర్చువల్ సమావేశం! : మోదీ సూచన

దేశ రాజధాని దిల్లీలో (Delhi) భారత్ రెండు రోజులపాటు నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) ఓ కీలక సూచన చేశారు. 

Updated : 10 Sep 2023 16:18 IST

దిల్లీ : భారత్ (India) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు  (G20 Summit) ఇవాళ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) కీలక సూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్‌ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృంద అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు ఉండటం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు. ‘గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాలను వెల్లడించారు. సూచనలు, అనేక ప్రతిపాదనలు అందించారు. వాటిని నిశితంగా పరిశీలించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని’ మోదీ పేర్కొన్నారు.

ముగిసిన జీ20 సదస్సు.. అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత

జీ-20 మరో సమావేశాన్ని నవంబరులో నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఆ ముగింపు సమావేశంలో శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన అంశాలను సమీక్షించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దానిపై ఎలా ముందుకు వెళ్దామనే విషయాన్ని భారత బృందాలు వివరిస్తాయని చెప్పారు. మీరందరూ ఆ సమావేశంలో పాల్గొంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీనితో జీ-20 శిఖరాగ్ర సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తున్నాని తెలిపారు. ముగింపు సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు చిగురించి, శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ ఆయన ఓ సంస్కృత శ్లోకాన్ని చదివారు. ఆ తరువాత గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని