Rahul Gandhi: గ్రనేడ్‌ దాడి జరిగే ప్రమాదం.. అందుకే రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నాం..!

Manipur violence: జాతుల మధ్య వైరంతో నలిగిపోతున్న మణిపుర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడతారు. 

Published : 29 Jun 2023 17:00 IST

ఇంఫాల్‌: దాదాపు రెండు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్(Manipur) ఉద్రిక్తంగా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. రాజధాని నగరం ఇంఫాల్‌ నుంచి ఘర్షణలకు కేంద్రబిందువైన చురాచాంద్‌పుర్‌కు బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. గ్రనేడ్‌ దాడి జరిగే ప్రమాదం ఉందన్న అనుమానంతో తాము కాన్వాయ్‌ను ఆపివేశామని పోలీసులు వెల్లడించారు. (Manipur violence)

‘చురాచాంద్‌పుర్‌ జిల్లాకు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) వెళ్లాలనుకున్న మార్గంలో గ్రనేడ్ల దాడి జరిగే ముప్పు ఉంది. అందుకే మేం ఆయన్ను అడ్డుకున్నాం. హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించాం’ అని బిష్ణుపుర్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఇంఫాల్‌కు చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో ఆ జిల్లాకు బయలుదేరారు. అనంతరం అక్కడ సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడతారు. 

రాహుల్‌ను అడ్డుకోవడంపై కాంగ్రెస్(Congress) విమర్శలు గుప్పించింది. ‘రాహుల్‌ను స్వాగతించేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కానీ బిష్ణుపుర్‌ పోలీసు ఉన్నతాధికారులు, ఇతర పోలీసులు రోడ్లను దిగ్బంధించారు. ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయని నాకు తెలిసింది. వారు రాహుల్ పర్యటనను రాజకీయం చేస్తున్నారు’అని మణిపుర్ కాంగ్రెస్ చీఫ్ కె. మేఘచంద్ర ఆరోపించారు. 

‘రెండు నెలలుగా మణిపుర్ భగ్గుమంటోంది. దానిపై ప్రధాని మోదీ ఏమాత్రం బాధపడటం లేదు. 130 మంది మరణించారు. భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా  రాహుల్‌ మణిపుర్‌ వెళ్లారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, భాజపా ఆయన్ను ఎందుకు అడ్డుకుంటున్నాయి..?’అని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సుప్రియా శ్రినెట్‌ ప్రశ్నించారు. ఈ కష్ట సమయంలో ప్రజల కన్నీరు తుడిచేందుకు, వారికి అండగా నిలబడేందుకు రాహుల్ మణిపుర్ వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ ప్రజలు కొందరు రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేయగా, మరికొందరేమో ఆయన రాకను నిరసించారు. రాహుల్‌-బాధ్యతాయుతమైన ప్రవర్తన ఒకే దగ్గర ఉండవని,  ప్రస్తుత మణిపుర్ పరిస్థితికి కాంగ్రెస్‌ పాలనే కారణమని భాజపా ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని