12th Fail: ఉత్తమ చిత్రం సహా ఐదు అవార్డులు 12th ఫెయిల్‌కే.. ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలంటే?

12th Fail Review: విక్రాంత్‌ మాస్సే, విధు వినోద్‌ చోప్రాల 12th Failలో ఏయే అంశాలను చూపించారు.

Updated : 29 Jan 2024 18:00 IST

భారతీయ చిత్ర పరిశ్రమలో ఏటా కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి. యాక్షన్‌, థ్రిల్లర్‌, హారర్‌, కామెడీ, బయోగ్రాఫికల్‌, పీరియాడికల్‌, మైథలాజికల్‌. జానర్‌ వేరైనా అంతిమంగా ప్రేక్షకుడిని అలరించడమే వాటి లక్ష్యం. కల్పిత కథలను తెరపై చూపించేటప్పుడు లాజిక్‌లతో పనిలేదు. మ్యాజిక్‌ చేస్తే చాలు. కానీ, బయోగ్రాఫికల్‌ మూవీల విషయంలో అది కుదరదు. ఎందుకంటే సమాజంపై ప్రభావం చూపిన వ్యక్తులు, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వాళ్ల జీవితాలే కథా వస్తువులు. అలాంటి గాథల విషయంలో వాస్తవాలను వక్రీకరించకుండా తీయాలి. పాత్రలు, వాటి ఔచిత్యం దెబ్బ తీయకుండా ప్రజెంట్‌ చేయాలి. అంతకుమించి భావితరాలకు స్ఫూర్తి పంచాలి. అలాంటి ఒక కథే ‘12th ఫెయిల్‌’. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్‌ చోప్రా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విక్రాంత్‌ మాస్సే. ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది.

ఇంతకీ ‘12th ఫెయిల్‌ కథేంటంటే..

ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్‌ పాఠక్‌ రాసిన పుస్తకాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినడానికి సరిగా తిండి లేని పరిస్థితి. మనోజ్‌ తండ్రి పనిలో నిజాయతీగా ఉన్నాడన్న కారణంతో సస్పెండ్‌ అవుతాడు. చదువులో మనోజ్‌ టాపర్‌ ఏమీ కాదు. పైగా పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపల్‌ స్వయంగా ప్రోత్సహిస్తాడు. ఈ విషయం డీఎస్పీ దుష్యంత్‌ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతాడు. సగటు విద్యార్థి అయిన మనోజ్‌ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్‌ ఏం చేశాడు? 12th ఫెయిల్‌ అయినా సివిల్స్‌ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల సమాహారమే ఈ చిత్రం.

ఎందుకు చూడాలంటే?

జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ‘12th ఫెయిల్‌’ ఒకటి. మనిషి వికాసానికి చదువు ఎంతో ముఖ్యం. ఇప్పటికీ ఎంతోమంది బాలలు ప్రాథమిక విద్యతోనే పాఠశాలకు స్వస్తి పలుకుతుంటే, పదో తరగతికి వచ్చినా కనీసం మాతృభాషలో వాక్యాలు కూడా రాయలేని వారు ఎందరో. అందుకు కారణం మన ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే. ఉపాధ్యాయులే పిల్లల్ని బట్టీపట్టి చదివిస్తారు. గైడ్‌లు, టెస్ట్‌ పుస్తకాలు ఇచ్చి పరీక్షలు రాయిస్తారు. ఇలాంటి చర్యలను వేలెత్తి చూపే సినిమా ఇది. మనిషి మేధో వికాసానికి చదువు ఎంతో ముఖ్యం. ముఖ్యంగా బాల్యంలో దేనికైతే అలవాటుపడతారో అదే తర్వాత దశలో మార్గ నిర్దేశం చేస్తుంది. అందుకే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్‌ ‘చదువు.. సమీకరించు.. పోరాడు’ అన్నారు. కానీ, ప్రభుత్వాల అలసత్వం, అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి, తల్లిదండ్రుల అమాయకత్వం, పేదరికం వెరసి విద్యా కుసుమాలు మొగ్గలోనే ఎలా గిడసబారిపోతున్నాయో కళ్లకు కట్టిన చిత్రమిది. ఈ మూవీ క్లైమాక్స్‌లో మనోజ్‌ సివిల్స్‌ ఇంటర్వ్యూకు వెళ్తాడు. అప్పటికే మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన అతడికి ఆఖరి ఛాన్స్‌ అది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడి సభ్యులకూ మనోజ్‌కు మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.

  • ఇంటర్వ్యూవర్‌: 12వ తరగతి ఫెయిల్‌ అయిన నీకంటే ఐఐటీ, ఐఐఎం టాపర్స్‌ సివిల్స్‌లో పోటీ పడుతున్నారు. వాళ్లని కాదని నిన్ను ఎందుకు సెలక్ట్‌ చేయాలి?
  • మనోజ్‌: వాళ్లు కచ్చితంగా టాపర్స్‌. కానీ, నేను ఎదుర్కొన్న అనుభవాలను వాళ్లు ఎదుర్కోలేదు. గ్రామాల్లోని పాఠశాలల్లో మోసాలు వాళ్లకు తెలియవు. నాకు అవకాశం ఇస్తే, ఇలాంటివి జరగకుండా చూస్తా. వాళ్ల కన్నా బాగా  చేసి చూపిస్తా.
  • ఇంటర్వ్యూవర్‌: ఐఐటీ టాపర్‌ కన్నా, నువ్వు బెటర్‌ అనుకుంటున్నావా?
  •  మనోజ్‌:  బహుశా కాకపోవచ్చు. కానీ, నేను ఈ ఉద్యోగానికి అర్హుడిని అని భావిస్తున్నా.
  • ఇంటర్వ్యూవర్‌: ఇది ఎన్నోసారి నువ్వు సివిల్స్‌కు హాజరుకావడం?
  • మనోజ్‌: చివరి అవకాశం.
  • ఇంటర్వ్యూవర్‌: ఒకవేళ ఎంపిక కాకపోతే?
  • మనోజ్‌: ఏమీ కాదు. అయితే, నేను ఓటమిని అంగీకరించను. అలాగే నా లక్ష్యాన్ని వీడను.
  • ఇంటర్వ్యూవర్‌: ఆఖరి అవకాశం అంటున్నావు.. లక్ష్యం ఎలా సాధిస్తావు?
  • మనోజ్‌:  ఐపీఎస్‌ కావడమే నా లక్ష్యం కాదు. దేశంలో సంస్కరణలు తీసుకురావడం. సెలక్ట్‌ కాకపోతే గ్రామానికి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పుకొంటా. జీవితంలో చీటింగ్‌ చేయకుండా ఎలా బతకాలో చెబుతా. అలాంటి వాళ్ల జీవితం ఎంత గొప్పగా ఉంటుందో వివరిస్తా ‘నేను భూమికి వెలుగునిచ్చేటంత సూర్యుడిని కాలేకపోతే, కనీసం నా వీధిలో వెలుగునిచ్చే దీపాన్ని అవుతా’.

ఇది చాలు కదా.. ప్రతి ఒక్కరిలోనూ ‘12th ఫెయిల్‌’ స్పూర్తినింపడానికి.  సినిమా మొత్తం ఒక ఎత్తయితే, సివిల్స్‌ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాక జరిగే 20 నిమిషాల సినిమా మరో ఎత్తు. ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరయ్యేలా కథ, కథనాలను తీర్చిదిద్దారు విధు వినోద్‌ చోప్రా. మనోజ్‌ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయిపోతుంది. కాదు, అతడిలో మనల్ని మనం చూసుకుంటాం. ఎందుకంటే, తాము సాధించలేకపోయిన వాటిని వేరొకరు కష్టపడి సాధిస్తే, వాటిని తెలుసుకుని సంతోషిస్తుంటారు జనం. ఒక వ్యక్తి  కష్టాల్లో ఉన్నపుడు రాళ్లు వేసిన వాళ్లే విజయం సాధించిన తర్వాత చప్పట్లు కొడుతూ ఉంటారు. వీటన్నింటిని దర్శకుడు విధు వినోద్‌ చోప్రా తెరపై అంతే భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు.

అందుకే ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అయ్యారు

‘12th ఫెయిల్‌’ కేవలం ఒక సినిమా కాదు. ఇదొక పాఠ్య పుస్తకం. ప్రతిఒక్కరూ చదవాల్సింది కాదు.. చూడాల్సింది. మనోజ్‌ శర్మ పాత్రలో విక్రాంత్‌ మాస్సే జీవించాడు. నిజ జీవిత పాత్రను ఆయన అనుభూతి చెందాడు. మనల్ని అనుభూతి చెందేలా చేశాడు. ఐపీఎస్‌ టాపర్‌గా ర్యాంకు చూసుకుని నేలపై పడి భావోద్వేగంతో కన్నీరు పెట్టే సీన్‌లో మనం ఉంటే, మనోజ్‌ను గట్టిగా హత్తుకుంటాం. ఇక దర్శకుడు విధు వినోద్‌ చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవిత కథను ఇంత భావోద్వేగభరితంగా తీయొచ్చా? అనిపించేలా ఆయన తన దర్శకత్వంతో మెస్మరైజ్‌ చేశారు. అందుకే విక్రాంత్‌ ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌)గా, విధు వినోద్‌ చోప్రా ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. అన్నట్లు ఎడిటింగ్‌లోనూ వినోద్‌ మెరుపులు కనిపిస్తాయి.

చివరిగా: ఏటా ఎన్నో సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి.  అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్‌ ఒకటి.  డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్‌ కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని