2018 movie telugu review: రివ్యూ: 2018

2018 telugu movie review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘2018’ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?ఇక్కడ వారికీ కనెక్ట్‌ అయిందా?

Published : 26 May 2023 05:56 IST

2018 movie review: చిత్రం: 2018; న‌టీన‌టులు: టోవినో థామస్, కున్‌చ‌కో బొబన్‌, అప‌ర్ణా బాల‌ముర‌ళి, లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు; ఛాయాగ్రహణం: అఖిల్ జార్జ్; సంగీతం: నోబిన్ పాల్; నిర్మాతలు: వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్; రచన, దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్; స‌మ‌ర్ప‌ణ‌: బన్నీ వాస్; విడుదల తేదీ: 26-05-2023

మ‌ల‌యాళంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సినిమా ‘2018’. సాధార‌ణ సినిమాగా మొద‌లై... వంద కోట్ల మైలురాయిని అధిగ‌మించి విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో రూపొంద‌డం..  అక్క‌డి ప్ర‌జ‌లంద‌రికీ క‌నెక్ట్ కావ‌డ‌మే అందుకు కార‌ణం. భాష‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోవ‌డంతో ఏ భాష‌లో మంచి సినిమా వ‌చ్చినా... వెంట‌నే అవి తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అలా విడుద‌లై నెల రోజుల తిరగ‌క‌ముందే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న మ‌రో అనువాద చిత్ర‌మే ఇది. తెలుగులో బ‌న్నీ వాస్ విడుద‌ల చేస్తున్నారు. ఇంత‌కీ ఈ సినిమాలో ఏముంది?(2018 telugu movie review) ఎందుకంతగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంటోంది?

క‌థేంటంటే: ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఓ యువ‌కుడు అనూప్ (టోవినో థామస్). ఓ పెద్ద మోడ‌ల్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్న మ‌త్య్స‌కార కుటుంబానికి చెందిన మ‌రో యువ‌కుడు నిక్స‌న్ (అసిఫ్ అలీ). టూరిస్ట్‌ల‌కి త‌ల‌లో నాలుక‌లా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న టాక్సీ డ్రైవ‌ర్ కోషి (అజు వ‌ర్ఘీస్‌), కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఉండే త‌మిళ‌నాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవ‌ర్ సేతు (క‌లైయార‌స‌న్‌). ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ అధికారి (కుంచ‌కో బొబన్‌).. ఇలా ఎవ‌రి జీవితాలు వారివి, ఎవ‌రి ప‌నులతో వాళ్లు స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే వాళ్ల జీవితాలు అనూహ్య‌మైన ఆటుపోట్ల‌కి గుర‌వుతాయ‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండరు.  భారీ వ‌ర్షాల‌తో కేర‌ళ‌ని వ‌ర‌ద‌లు ముంచెత్తుతాయి. (2018 telugu movie review) అనూహ్య‌మైన ఆ ప‌రిణామంతో ఎవ‌రి జీవితాలు ఎలా మారాయి? ప్రాణాలు నిలుపుకొంటే చాల‌నుకునే ప‌రిస్థితుల్లో ఒక‌రికోసం మ‌రొక‌రు ఎలా నిల‌బ‌డ్డార‌నేది తెర‌పైన చూసి ఆస్వాదించాల్సిందే.

ఎలా ఉందంటే: ‘ఎవ్రీవ‌న్ ఈజ్ ఎ హీరో’ అనేది ఈ సినిమాకి ఉప‌శీర్షిక‌. ఆప‌త్కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఓ హీరోగా మారితే ఎలా ఉంటుంద‌నేదే ఈ చిత్ర క‌థ కూడా. వందేళ్ల కిందట కేర‌ళ‌ని ముంచేసిన వర‌ద‌ల్ని ప‌రిచ‌యం చేస్తూ ప్రేక్ష‌కుడిని క‌థ‌లోకి తీసుకెళుతుందీ చిత్రం. ప్ర‌థ‌మార్ధం మొత్తం ఆయా పాత్ర‌ల్ని, వాటి నేప‌థ్యాల్ని ప‌రిచ‌యం చేస్తూ వాళ్ల ప్ర‌పంచంలోకి తీసుకెళుతుంది. ప్ర‌తి ఒక్క‌పాత్ర‌తో ప్రేక్ష‌కుడికి క‌నెక్ష‌న్ ఏర్ప‌డేలా చేస్తుంది. ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కూ ఇదొక సాధార‌ణ సినిమానే. (2018 telugu movie review) ఓ ద‌శ‌లో వ‌చ్చిపోయే బోలెడ‌న్ని పాత్ర‌లతో ఇంత‌కీ ఇది ఎవ‌రి క‌థ‌?ఇందులో ఏం చూపిస్తున్నారు?అనే సందేహాలు త‌లెత్తుతాయి. ఒక్క‌సారి ఆ పాత్ర‌లు... వాటి ప్ర‌పంచాల్ని ప్రేక్ష‌కుడి మ‌న‌సుకి ద‌గ్గ‌ర చేశాక‌... అస‌లు క‌థ‌కి గేట్లెత్తాడు ద‌ర్శ‌కుడు. అనూహ్యంగా వెల్లువెత్తిన ఆ భావోద్వేగాల సంద్రంలో ఉక్కిరిబిక్కిరి కావ‌డం త‌ప్ప ప్రేక్షకులుగా మ‌నం చేసేదేమీ ఉండ‌దు. వ‌ర‌ద‌ల్లో మ‌న‌మే చిక్కుకుపోయామా అనుకునేంత ప‌క‌డ్బందీగా ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని మ‌లిచాడు.

అప్ప‌టిదాకా ఎక్క‌డెక్క‌డో ఉన్న ఆయా పాత్ర‌ల్ని ఒక‌దానితో మ‌రొక‌టి క‌నెక్ట్ చేస్తూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు.  ఒక్కో పాత్ర వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని నిస్స‌హాయ స్థితిలో ఉండ‌టం చూసి హృద‌యాలు బ‌రువెక్కిపోతాయి.  ప్ర‌కృతి విప‌త్తులు ఎంత అనూహ్యమో, అదే త‌ర‌హాలో స‌న్నివేశాల్ని మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. సాంకేతిక బృందం చ‌క్క‌టి స‌హ‌కారం అందించింది. (2018 telugu movie review) క‌థ‌, క‌థ‌నాల్లో మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా సినిమాలో లీనం చేస్తాయి. తోటి జ‌వాన్లు మ‌ర‌ణిస్తుంటే భ‌య‌ప‌డి ఆర్మీ నుంచి పారిపోయి వ‌చ్చిన క‌థానాయ‌కుడు.. విప‌త్తు స‌మ‌యంలో త‌న ప్రాణాల్ని లెక్క చేయ‌కుండా పోరాడ‌టం వంటి స‌న్నివేశాలు ద‌ర్శ‌కుడి ప‌నిత‌నానికి అద్దం ప‌డ‌తాయి. ఆప‌త్కాలంలో అంద‌రూ స‌మాన‌మే అంటూ మాన‌వ‌త్వం గురించి చెప్పిన  సందేశం బాగుంది. (2018 telugu movie review) వంద‌ల మంది ప్రాణాల్ని హ‌రించిన 2018 వ‌ర‌ద‌ల్ని త‌ల‌చుకుంటే కేర‌ళ ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఉలిక్కిప‌డ‌తారు. వాళ్లంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమా తీయ‌డ‌మే ఈ సినిమా విజయానికి కార‌ణం. వ‌ర‌ద‌లనేవి ఆ ఒక్క రాష్ట్రానికే కాదు, ప్ర‌తి వ‌ర్షాకాలంలోనూ ఏదో ఒక రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ కోణంలో చూసినా ఇది అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే అంశ‌మే.

ఎవ‌రెలా చేశారంటే: పాత్ర‌లు త‌ప్ప న‌టులెవ‌రూ ఇందులో క‌నిపించ‌రు. అంత‌గా ఆయా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు న‌టులు. పైగా లాల్ మిన‌హా మిగిలిన‌వాళ్లంతా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని న‌టులే. ‘ఆకాశ‌మే హ‌ద్దురా’లో క‌నిపించిన అపర్ణా బాల‌ముర‌ళి.. ఇందులో పూర్తి భిన్నంగా ఓ కొత్త న‌టిలాగే  క‌నిపించారు. (2018 telugu movie review) దాంతో  కొన్ని జీవితాల్ని ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభూతే క‌లుగుతుంది. స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. సాంకేతికంగా  సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా విభాగాలు సినిమాకి ప్రాణం పోశాయి. కూర్పు కూడా బాగుంది. వర‌ద‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు కెమెరా ప‌నిత‌నానికి అద్దం ప‌డ‌తాయి. (2018 telugu movie review)  సంగీతం సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చింది. ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాల‌పై మంచి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించారు. ద్వితీయార్ధంలో హృద‌యాల్ని క‌దిలించేలా స‌న్నివేశాల్ని మ‌లచ‌డం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ‌, క‌థ‌నం
  • + ద్వితీయార్ధంలో భావోద్వేగాలు  
  • + కెమెరా.. సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా: 2018.. భావోద్వేగాల వరద ఇది! (2018 telugu movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని