Aattam Review: రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

వినయ్‌, కళాభవన్‌ షాజాన్‌, జరీన్‌ షిహబ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది?

Updated : 16 Apr 2024 16:36 IST

Aattam movie review; చిత్రం: ఆట్టం; నటీనటులు: వినయ్‌, కళాభవన్‌ షాజాన్‌, జరీన్‌ షిహబ్‌ తదితరులు; సంగీతం: బసిల్‌ సీజే; ఎడిటింగ్‌: మహేశ్‌ భువనేంద్‌; సినిమాటోగ్రఫీ: అనిరుధ్‌ అనీష్‌; నిర్మాత: డాక్టర్‌ అజిత్‌ జాయ్‌; రచన, దర్శకత్వం: ఆనంద్‌ ఎకర్షి; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. అక్కడ అగ్ర కథానాయకులు సైతం ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి కోవలోనే రూపొందిన విభిన్న కథా చిత్రం ‘ఆట్టం’. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం (Aattam movie review) అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ మూవీ కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: కేరళలో ఓ నాటక బృందం అది. అందులో 12మంది నటులు. ఒక్కరే నటీమణి. అందరూ మధ్యతరగతి వారే. ఒక్కొక్కరూ ఒక్కో పని చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా వివిధ వేదికలపై తమ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ బృందం ప్రదర్శించే నాటికలో వినయ్‌ (వినయ్‌ ఫోర్ట్‌), అంజలి (జరీన్‌ షిబాబ్‌),  హరి (కళాభవన్‌ షాజాన్‌)లు కీలక పాత్రధారులు. ముఖ్యంగా సినిమా నటుడు అయిన హరికి ఈ నాటకంలో కాస్త అధిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఇది వినయ్‌కు నచ్చదు. ఒకరోజు ఈ బృందం వేసిన నాటకానికి ముగ్ధులైన ఓ విదేశీ జంట తమ రిసార్ట్‌లో వాళ్లకు ఆతిథ్యం ఇస్తుంది. అందరూ మద్యం పార్టీలో మునిగి తేలుతారు. బాగా పొద్దుపోయాక, ఎవరికి కేటాయించిన గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అంజలి కిటికీ పక్కన నిద్ర పోతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులోనుంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది? చివరకు ఆ చెత్త పని చేసిన వ్యక్తిని గుర్తించారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే:  మానవ జీవితం ఒక వైకుంఠపాళి. కోరికలు, అవసరాలు, ఆశలు అనే నిచ్చెనలను ఎక్కేందుకు ప్రతీ జీవి తహతహలాడిపోతుంది. ‘కాల’ సర్పాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకునేందుకు ఎదుటి వ్యక్తిని బలి పశువును చేయడమే ఎక్కువమందికి తెలుసు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి వ్యక్తులకు ఇచ్చే గౌరవం, విలువలు మారిపోతాయి. ‘బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడే’ వారే ఎక్కువ. అందుకు దృశ్య రూపమే ‘ఆట్టం’. అంజలితో సహా 12మంది నాటకం వేసేందుకు సిద్ధమవుతున్న సన్నివేశంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. విదేశీ జంట వీళ్లందరినీ ఆతిథ్యానికి ఆహ్వానించడం, సరదాగా గడపటం ఇలా కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. 12మందిలో ఒక వ్యక్తి అంజలితో అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం తెలియడంతో అసలు కథ పట్టాలెక్కుతుంది. ఆ చెత్త పని చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అందరూ సహ నటుడు అయిన మదన్‌ ఇంటికి వెళ్లడం, ఈ చర్యకు సినిమా నటుడైన హరిని బాధ్యుడిని చేసే క్రమంలో అతడిని ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడే తీరును దర్శకుడు నేటి వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే, అతడు ఏం చేసినా మంచిగా కనిపించదు. సగటు మానవ స్వభావమే ఇలా ఉంటుందని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

నాటక బృందం నుంచి హరిని బయటకు పంపేందుకు తీర్మానం చేసే క్రమంలో పలువురి వ్యవహారశైలి భిన్నంగా ఉండటంతో వారిపైనా ప్రేక్షకుడికి అనుమానం కలిగేలా ఆసక్తిగా కథనాన్ని నడిపాడు దర్శకుడు. కథ ముందుకు నడిచే కొద్దీ, ఎవరు ఆ పని చేశారో ఊహించడం మరింత కష్టమైపోతుంటుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అనుకోకుండా మదన్‌ ఇంటికి హరి రావడం, తనకున్న పరిచయాలతో నాటక బృందాన్ని ఇంగ్లాండ్‌ తీసుకెళ్తానని చెప్పడంతో అప్పటివరకూ దుర్మార్గుడిగా కనిపించిన అతడు అందరికీ మంచివాడిలా కనిపిస్తాడు.  ఆ బృందంలోని ప్రతీ మనిషిలోనూ విదేశాలకు వెళ్లాలన్న ఆశ పుడుతుంది. అంజలిని పిలిచి సయోధ్య కుదిర్చేందుకు యత్నించే ప్రయత్నాలు చూస్తే మనుషుల్లో ఉండే నిలకడలేనితనం తేటతెల్లం అవుతుంది. అంజలి వచ్చిన తర్వాత తప్పెవరిది అని కనుక్కొనే ప్రయత్నంలో ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తి తప్పులను ఎంచేందుకు ప్రయత్నిస్తాడు తప్ప, అసలు అంజలి పడిన వేదనను ఎవరూ అర్థం చేసుకోరు.  పైగా పార్టీలో మద్యం తాగినందుకు అంజలిది కూడా తప్పేనని తీర్మానించడం మానవ నైజానికి పరాకాష్ట. క్లైమాక్స్‌లో మరొక ట్విస్ట్‌తో ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: ‘ఆట్టం’లో ఒక్కరు కూడా మనకు తెలిసిన నటులు కాదు. కానీ, ఆ పాత్రల్లో వాళ్లను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. ప్రతిఒక్కరూ జీవించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. చాలా సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీశారు. చాలా చిన్న కాన్సెప్ట్‌ను ఎంచుకుని మనిషి నైజాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. కానీ, అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకోవడం, కథాగమనం కాస్త నెమ్మదిగా సాగడం మినహాయిస్తే చివరి వరకూ ఆసక్తిగా మూవీని నడిపించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
కుటుంబంతో కలిసి చూడొచ్చా: ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో కేవలం మలయాళ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ లేవు.

  • బలాలు
  • + కథ
  • + నటీనటులు
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: ఇది నిజ జీవిత ‘ఆట్టం’
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని