Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: జయరామ్‌, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్‌’ ఎలా ఉందంటే?

Updated : 20 Mar 2024 17:14 IST

Abraham Ozler review; చిత్రం: అబ్రహాం ఓజ్లర్‌; నటీనటులు: జయరామ్‌, మమ్ముట్టి, అనస్వర రాజన్‌, అర్జున్‌ అశోకన్‌, అర్జున్‌ కురియన్‌, అనీష్‌ గోపాల్‌, శ్రీరామ్‌ రామచంద్రన్‌, అనూప్‌ మేనన్‌ తదితరులు; సంగీతం: మిథున్‌ ముకుందన్‌; ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌; సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్‌; రచన: రణధీర్‌ కృష్ణన్‌; నిర్మాత: ఇర్షద్‌ ఎం.హసన్‌, మిథున్‌ మాన్యువల్‌ థామస్‌; దర్శకత్వం: మిథున్‌ మాన్యువల్‌ థామస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

క్కువ బడ్జెట్‌, ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే పాయింట్‌తో సినిమాలు తీస్తూ అలరిస్తుంటారు మలయాళ దర్శకులు. ఇక అక్కడ వచ్చే క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ ఏడాది జనవరిలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం ‘అబ్రహాం ఓజ్లర్‌’. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఇంతకీ ఈ సినిమా కథేంటి?సీరియల్‌ కిల్లర్‌ ఎవరు?

కథేంటంటే: అబ్ర‌హం ఓజ్ల‌ర్ (జ‌య‌రాం) ఐపీఎస్‌ ఆఫీసర్‌. అతని భార్యాపిల్ల‌లు కనిపించకుండా పోతారు. దీంతో మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో త్రిస్సూర్‌లో వరుస హ‌త్య‌లు జరుగుతాయి. కొందరు వ్యక్తులను ఆపరేషన్‌ చేసే కత్తితో కోసి చంపుతూ ఉంటారు. అంతేకాదు, ఆ మృతదేహాల వద్ద హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ ర‌క్తంతో రాసి ఉన్న కాగితాలు ఉంచుతారు. ఇంతకీ ఆ హ‌త్య‌ల వెన‌క ఉన్నది ఎవరు? అతడిని ఓజ్ల‌ర్, అతడి టీమ్‌ ఎలా పట్టుకుంది? అలెక్స్ (మ‌మ్ముట్టి) ఎవరు? (Abraham Ozler review) అతనికి ఈ హత్యలకూ ఏదైనా సంబంధం ఉందా?

ఎలా ఉందంటే: ఇతర చిత్రాలతో పోలిస్తే క్రైమ్‌, ఇన్వెస్టిగేటివ్‌ మూవీస్‌ ప్రేక్షకుడిని అలరించడంలో ఎప్పుడూ ముందుంటాయి. చివరి వరకూ ఉత్కంఠగా సాగే ఈ జానర్‌ మూవీలను భాషతో సంబంధం లేకుండా చూసేవారూ ఉన్నారు. అందు కోసమే దర్శక-రచయితలు కూడా చిన్న ఎలిమెంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌ ఉన్న పాయింట్‌ను తీసుకుని, దానికి సినిమాటిక్‌ లిబర్టీ జోడించి కథగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అలాంటి కోవకు చెందినదే ‘అబ్రహాం ఓజ్లర్‌’. దీన్నొక క్రైమ్‌ థ్రిల్లర్‌గా అందించడంలో దర్శకుడు మిథున్‌ మాన్యువల్‌ పాసయ్యారు. భార్య, కూతురు కనిపించకపోవడంతో తీవ్ర మానసిక వేదన పడుతున్న అబ్రహాం జీవితాన్ని పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టాడు దర్శకుడు. (Abraham Ozler review in telugu) ఆ వెంటనే రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ ఐటీ ఉద్యోగి తొడ నరం కోసి చంపడంతో అసలు కథ మొదలవుతుంది. ఘటనా స్థలంలో హంతకుడు వదిలిన కొన్ని ఆధారాలతో అబ్రహాం టీమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెడుతుంది.

అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి హత్యలు జరుగుతూ ఉండటం, అన్నీ ఒకే తరహాలో ఉండటంతో హంతకుడు ఎవరా? అన్న ప్రశ్న అటు పోలీస్‌లకు ఇటు సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంది. ఒక హత్యకు మరో హత్యకూ దగ్గర సంబంధం ఉండటం, హంతకుడు ఒకే రకమైన ఆధారాలు వదిలి వెళ్లడం ఆ దిశగా ఓజ్లర్‌ విచారణ చేయడంతో కథనం పరుగులు పెడుతుంది. ప్రేక్షకుడిని కథకు ఎంగేజ్‌ చేస్తూ ఈ రేసీ స్క్రీన్‌ప్లేను దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. విరామ సమయానికి కేసు దాదాపు పరిష్కరించడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే, హంతకుడు దొరికేసిన తర్వాత పోలీసులకు ఏం చెబుతాడో సగటు ప్రేక్షకుడు ఊహించగలడు. (Abraham Ozler review in telugu) తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా సాగించిన యజ్ఞం అంటూ హంతకుడు సమర్థించుకోవడం పరిపాటి. ఇందుకు ఈ మూవీ ఏమీ మినహాయింపు కాదు. ఆ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఎంత భావోద్వేగభరితంగా సాగిందన్న దాన్ని బట్టి హంతకుడిపై ప్రేక్షకుడికి సానుభూతి లభిస్తుంది. కానీ, ఓజ్లర్‌లో ఆ బలమైన ఎమోషనల్ డ్రామాను ఆసాంతం కొనసాగించలేకపోయారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి అహం అడ్డువస్తే, ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతున్నది మాత్రం భావోద్వేగభరితంగా చూపించారు. కనిపించకుండాపోయిన ఓజ్లర్‌ భార్య, కుమార్తెకు సంబంధించి పతాక సన్నివేశాల్లో ఓ ట్విస్ట్‌ ఇచ్చి, సినిమాకు కొనసాగింపు ఉండేలా దర్శకుడు కథను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి సుపరిచితులైన జయరామ్‌ ఏసీపీ అబ్రహాం ఓజ్లర్‌గా జీవించారు. భార్యాబిడ్డలు కనిపించక మనో వేదనకు గురయ్యే వ్యక్తిగా, అదే సమయంలో హత్యల వెనుక ఉన్న వారిని కనిపెట్టే ఆఫీసర్‌గా వైవిధ్యమైన నటన కనబరిచారు. మమ్ముట్టిది అతిథి పాత్ర. (Abraham Ozler review in telugu) ఇలాంటివి చేయడం ఆయనకు మంచినీళ్ల ప్రాయం. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. రణధీర్‌ కృష్ణన్‌ కథను ఎంగేజింగ్‌గా చూపించడంలో దర్శకుడు మిథున్‌ మాన్యువల్‌ థామస్‌ మంచి ప్రయత్నమే చేశారు. అయితే, దీన్ని రివెంజ్‌ డ్రామాగా మలచడంతో ప్రథమార్ధంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్ధానికి వచ్చే సరికి సడలిపోయింది. అయితే, కథాపరంగా ఎక్కడా అవుట్‌ ఆఫ్‌ ది కంటెంట్‌ మాత్రం వెళ్లలేదు.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + కథనం
  • + జయరామ్‌ నటన
  • + ప్రథమార్ధం
  • బలహీనతలు
  • - రొటీన్‌ రివెంజ్‌ డ్రామా
  • - ద్వితీయార్ధం
  • చివరిగా: అబ్రహాం ఓజ్లర్‌.. జస్ట్‌ ఏ క్రైమ్‌ థ్రిల్లర్‌. (Abraham Ozler review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని