Allari Naresh: ‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్‌ ఏమన్నారంటే?

‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్‌ స్పందించారు.

Published : 29 Apr 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొత్త సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ (aa okkati adakku) ప్రచారంలో బిజీగా ఉన్నారు నటుడు అల్లరి నరేశ్‌ (Allari Naresh). ఈ మూవీ విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారాయన. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’ (Devara) సినిమా గురించి ప్రశ్న ఎదురవగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘దేవర’ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం అల్లరి నరేశ్‌ను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం ఆసక్తి చూపిందని వార్తలొచ్చాయి. దానికి మీరు నో చెప్పారా? ఇంకేదైనా కారణమా?’ అని అడగ్గా.. ఆ సినిమాలో ఛాన్స్‌ గురించి తనకే తెలియదన్నారు. అది రూమర్‌ అని, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. టాలీవుడ్‌ హీరోలందరితో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు. మహేశ్‌ బాబు ‘మహర్షి’, నాగార్జున ‘నా సామిరంగ’లో నరేశ్‌ కీ రోల్స్‌ ప్లే చేసి, అలరించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమే ‘దేవర’. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (saif ali khan) విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో పూర్తిస్థాయి యాక్షన్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్‌ పార్ట్‌ అక్టోబరు 10న విడుదల కానుంది.

కొంతకాలం విరామం అనంతరం నరేశ్‌ నటించిన హాస్య ప్రధానమైన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కథానాయిక. పెళ్లి ఇతివృత్తంగా మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో అభిమానులకు నరేశ్‌ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. తాను గతంలో నటించిన ‘సుడిగాడు’ (sudigaadu) చిత్రానికి సీక్వెల్‌ రానుందని, ఇప్పటికే స్క్రిప్టు పనులు మొదలయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని