Chiranjeevi: చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రదానం

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

Updated : 09 May 2024 22:58 IST

దిల్లీ: నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

భారత గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల (Padma awards 2024) ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకోగా..  సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీ,  హోర్ముస్జీ ఎన్‌.కామా పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్నారు. 

ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి.. మిగతా వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని