Puri Musings: నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్‌

మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్‌.

Updated : 09 May 2024 17:43 IST

హైదరాబాద్‌: ‘ఎవరైనా నిన్ను అవమానిస్తే, చిరునవ్వుతో వాళ్లకు సమాధానం చెప్పు. అంతేకానీ, వాళ్లతో వాదనకు దిగకు. అలా దిగితే అవతలి వ్యక్తి గెలిచినట్లు’ అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరుతో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఇన్‌సల్ట్‌’ (అవమానం) అనే విషయం గురించి మాట్లాడారు.

‘‘లైఫ్‌లో చాలాసార్లు మనం అవమానానికి గురవుతాం. ఎవరో ఏదోఒక మాట అంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధ పడకూడదు. అప్పుడే హుందాగా ఉండాలి. ఇక్కడ మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

  • నెం.1: ఏ సందర్భంలో అది జరిగిందో అర్థం చేసుకోండి. ఎవరు నిన్ను అవమానించారు? నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తా? నీ మేలు కొరుకునేవాడా? నీ సహోద్యోగా? నీ బాస్‌? నీ శత్రువా? ముక్కూ మొహం తెలియనివాడా? ఒక్కోసారి కన్న తండ్రి కూడా అవమానకరంగా మాట్లాడవచ్చు. ‘నీకు పెట్టే తిండి కూడా దండగ’ అని తిట్టవచ్చు.
  • నెం.2: ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు? ఏదైనా చిన్న విషయానికే అవమానించారా? వ్యక్తిగత జీవితం గురించి చులకనగా మాట్లాడారా? నీ జాతి గురించి కించపరిచేలా ఏమైనా అన్నారా?
  • నెం.3: నిన్ను ఎక్కడ అవమానించారు? మీరు ఇద్దరే ఉన్నప్పుడా? పబ్లిక్‌ గానా? లేక సోషల్‌మీడియా వేదికగా అన్నారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలి.

మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండి. నువ్వు కోప్పడితే ఎదుటివాడు గెలిచినట్టే. నువ్వు రియాక్ట్‌ అయితే, ఆ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని, నిన్ను ఇంకా రెచ్చగొడతాడు. అలాంటప్పుడే మనం హ్యూమర్‌ వాడాలి. అది పవర్‌ఫుల్‌ టూల్‌. ఒక చిరునవ్వు నవ్వండి. వాడిని మనం సీరియస్‌గా తీసుకోలేదని తెలియాలి. ఏదైనా చెప్పాలనిపిస్తే ‘నన్ను అవమానపరిచేలా మాట్లాడినందుకు థ్యాంక్యూ. ఇలా జరిగిన ప్రతిసారీ ఎదిగాను’ అని చెప్పండి. మిమ్మల్ని నిందించిన ప్రతిసారీ వాడిని వదిలేయండి. (Puri Musings) ‘బెస్ట్‌ రెస్పాన్స్‌ ఈజ్‌ నో రెస్పాన్స్‌’. మీరు వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోతే, మిమ్మల్ని అవమానపరిచేవాడు తన ఆసక్తిని కోల్పోతాడు. కొన్నిసార్లు కొన్ని పరాభవాల వల్ల మనం మారతాం. అవి మనకు ఉపయోగపడతాయి. మీ మంచి కోరుకునేవారు మిమ్మల్ని అవమానిస్తే ఎందుకు చేశారో గుర్తించండి. వాళ్లేదో అన్నారు కాబట్టి, పంచ్‌ విసిరి అక్కడే గెలవాలని చూడొద్దు. గెలుపు ముఖ్యం కాదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నామన్నది ముఖ్యం. అవమానం ఎప్పుడూ ఎదుటివాడి కంటే బాగా ఎదగాలన్న కసిని పెంచుతుంది. కించపరిచేలా మాట్లాడినప్పుడు వాదనకు దిగొద్దు. మనకు జరిగిన ప్రతీ అవమానాన్ని సక్సెస్‌ కోసం వాడుకోవాలి. అవమానం చాలా విలువైనది. దాన్ని భద్రంగా దాచుకో వాడుకో..’’ అని పూరి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని