April 28th: టాలీవుడ్‌లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్‌బస్టర్లు విడుదలయ్యాయంటే?

ఏప్రిల్‌ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్‌ చిత్రాలేంటో చూద్దామా..

Published : 28 Apr 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ 28 (April 28th).. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర లిఖించిన రోజు. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే అది సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ తేదీన ఏయే చిత్రాలు విడుదలై, బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయో గుర్తుచేసుకుందాం..

1977లో ప్రారంభం..

‘అడవి రాముడు’ (Adavi Ramudu) సినిమాతో 1977లోనే ఏప్రిల్‌ 28 స్పెషల్‌గా నిలిచింది. నందమూరి తారకరామారావు హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రమిది. అప్పటి వరకు సాంఘిక, పౌరాణిక తదితర నేపథ్యాలే ఎక్కువగా కనిపించిన తెలుగు తెరకు అసలైన కమర్షియల్‌ హంగులు చూపింది ఈ చిత్రమే. అప్పట్లోనే రూ.3 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, విజయవాడలోని అప్సర థియేటర్‌లో 302 రోజులు ప్రదర్శితమైందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

కమెడియన్‌.. హీరోగా..

కమెడియన్‌ అలీ హీరోగా డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం.. ‘యమలీల’ (Yamaleela). 1994 ఏప్రిల్‌ 28న వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు ఫాంటసీ నేపథ్యాన్ని జోడించి కృష్ణారెడ్డి అప్పట్లో ట్రెండ్‌ సెట్‌ చేశారు. ప్రముఖ హీరో కృష్ణ (దివంగత) అతిథిగా మెరిసిన ఈ సినిమా 100 రోజులకుపైగా దిగ్విజయంగా ఆడింది. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శితమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అదిరింది ట్విస్టు.. సినిమా సూపర్‌హిట్‌

‘పోకిరి’ (Pokiri) విడుదలతో ఏప్రిల్‌ 28కు మరింత గుర్తింపు దక్కింది. ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని ప్రభంజనం సృష్టించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.66 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో ఉన్న నాటి రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ఆ స్థాయి వసూళ్లు చేయడం అప్పట్లో సంచలనం. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175రోజులు, 15 సెంటర్లలో 200రోజులు, కర్నూలులోని ఓ థియేటర్‌లో సంవత్సరానికిపైగా ప్రదర్శితమైందనేది సినీ వర్గాల మాట. ‘పోకిరి’కి ముందు.. తర్వాత అని తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.

‘పోకిరి’ గురించి ఆసక్తికర విశేషాల కోసం క్లిక్‌ చేయండి..

ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజే..

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’.. యావత్‌ సినీ అభిమానుల ప్రశ్నకు ‘బాహుబలి 2’ (Baahubali 2) సమాధానమిచ్చింది ఏప్రిల్‌ 28నే. ప్రభాస్‌, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెకెక్కించిన ఈ సీక్వెల్‌ (బాహుబలి 1కి).. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, సుమారు రూ. 1800 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది. 2017లో ఈ చిత్రం విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని