Aquaman and the Lost Kingdom Review: రివ్యూ: ఆక్వామెన్‌2

Aquaman 2 Review: జాసన్‌ మోమోయ్‌, అంబర్‌ హియర్డ్‌ కలిసి నటించిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘ఆక్వామెన్‌2’ ఎలా ఉందంటే?

Updated : 21 Dec 2023 17:44 IST

Aquaman and the Lost Kingdom Movie review; చిత్రం: ఆక్వామెన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌డమ్‌; నటీనటులు: జాసన్‌ మోమోయ్‌, పాట్రిక్‌ విల్సన్‌, అంబర్‌ హెర్డ్‌, యహ్యా అబ్దుల్‌ మటీన్‌-2, రాండల్‌ పార్క్‌, నికోల్‌ కిడ్‌ మ్యాన్‌ తదితరులు; సంగీతం: రూపర్ట్‌ గ్రేసన్‌ విలియమ్స్‌; సినిమాటోగ్రఫీ: డాన్‌ బర్గెస్‌; ఎడిటింగ్‌: కిరిక్‌ మోరీ; కథ: జేమ్స్‌ వాన్‌, డేవిడ్‌ జాన్సన్‌ మెక్‌గోల్‌డ్రిక్‌, జాసన్‌ మోమోయ్‌, థామస్‌ పా సిబ్బెట్‌; దర్శకత్వం: జేమ్స్‌ వాన్‌; విడుదల: డిసెంబరు: 21-12-2023

ప్రతి క్రిస్మస్‌కు హాలీవుడ్‌ నుంచి ఓ భారీ బడ్జెట్‌ మూవీ భారతీయులను పలకరిస్తూ వస్తోంది. 2018లో వచ్చిన ‘ఆక్వామెన్‌’ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మరో సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘ఆక్వామెన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌డమ్‌’. అమెరికా కన్నా  ఒక రోజు ముందే భారత్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? (aquaman2 Review) ఆక్వామెన్‌గా జాసన్‌ మోమోయ్‌ చేసిన సాహసం ఏంటి?

కథేంటంటే: ఆర్థర్‌ కర్రీ (జాసన్‌ మోమోయ్‌) ట్రైడెంట్‌ను సొంతం చేసుకోవడమే కాదు, తన సోదరుడు ఓరమ్‌ మారియస్‌ (పాట్రిక్‌ విల్సన్‌)తో పోరాడి అతడి పైనా విజయం సాధిస్తాడు. తల్లి సూచన మేరకు ఓరమ్‌ని బందీని చేస్తాడు. అనంతరం మెరా (అంబర్‌ హెర్డ్‌)ను వివాహం చేసుకుని, అట్లాంటిస్‌ రాజు అవుతాడు. ఆర్థర్‌, మెరాలకు ఓ బాబు పుడతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌తో పాటు, అతడి కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని కొత్తదారులు వెతుకుతుంటాడు సముద్రపు దొంగ డేవిడ్‌ కేన్‌ (యాహ్యా అబ్దుల్‌ మటీన్‌). ఆ అన్వేషణలో ఓ గుహలోకి వెళ్లిన డేవిడ్‌కు బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరుకుతుంది. దానిని చేతిలోకి తీసుకున్న తర్వాత అతడు ఎలా మారిపోయాడు? అతడికి లభించిన శక్తులు ఏంటి? (aquaman2 Review) సముద్రం అడుగున ఉన్న అట్లాంటిస్‌తో పాటు, భూమ్మీద ఉన్న మానవ జాతికి డేవిడ్‌ వల్ల వచ్చిన ముప్పు ఏంటి? డేవిడ్‌ దుశ్చర్యలను తన సోదరుడు ఓరమ్‌తో కలిసి ఆర్థర్‌ కర్రీ అలియాస్‌ ఆక్వామెన్‌ ఎలా ఎదుర్కొన్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కామిక్స్‌ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్‌ హీరో ‘ఆక్వామెన్‌’. ఇప్పటికే పలువురు సూపర్‌హీరోలను అందించిన హాలీవుడ్‌.. ఇటు సముద్రం, అటు భూమ్మీద చెడుపై పోరాటం చేసే యోధుడిగా ఆక్వామెన్‌ను తీర్చిదిద్దింది. 2018లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. మొదటి చిత్రం అందించిన విజువల్‌ ఫీస్ట్‌ను ‘ఆక్వామెన్‌2’ కూడా అందించడంలో విజయం సాధించింది. అయితే, తొలి భాగంలో ఉన్న ట్విస్ట్‌లు, మెరుపులు ఇందులో లేవు. (Aquaman and the Lost Kingdom Movie review) ఒక రొటీన్‌ రివెంజ్‌ డ్రామాగా జేమ్స్‌ వాన్‌ దీన్ని తీర్చిదిద్దారు. అట్లాంటిస్‌ రాజుగా ఆర్థర్‌ కర్రీ బాధ్యతలు చేపట్టడం, మెరాకు బిడ్డ పుట్టడంతో ఆక్వామెన్‌ కాస్తా ఫ్యామిలీమెన్‌ అయిపోతాడు. అట్లాంటిస్‌ కౌన్సిల్‌తో చర్చలు, తండ్రితో కలిసి సమయాన్ని గడపడం ఇలా ఆర్థర్‌ ఫ్యామిలీ లైఫ్‌తో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. (aquaman2 Review telugu)  ఆర్థర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పరిశోధనలు చేస్తున్న డేవిడ్‌ కేన్‌కు బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరకడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. తన శక్తి ఏంటో చూపించడానికి అట్లాంటిస్‌కు వెళ్లి మరీ దాడి చేస్తాడు డేవిడ్‌. ఈ సందర్భంగా  సముద్రంలో వాళ్లు ఉపయోగించే వాహనాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌ అలరిస్తాయి. డేవిడ్‌కు వచ్చిన శక్తి గురించి తెలుసుకోవాలంటే సముద్రం గురించి పూర్తిగా తెలిసిన ఓరమ్‌లాంటి వ్యక్తి అవసరమని తల్లి చెప్పడంతో జైలులో ఉన్న అతడిని విడిపించడానికి అతడు చేసే ప్రయత్నాలు, అక్కడ వచ్చే యాక్షన్‌ సీక్వెన్‌ ఒళ్లు గగుర్పొడవడంతో పాటు, చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఆర్థర్‌తో కలిసి అట్లాంటిస్‌ వచ్చిన ఓరమ్‌ బ్లాక్‌ ట్రైడెంట్‌ గురించి తెలుసుకుని, దాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏంటో చెబుతాడు.

మరోవైపు వేగంగా మంచు కొండలు కరగడం, సముద్ర జలాలు పెరగడంతో పాటు, కలుషితమవడం గుర్తించిన ఆర్థర్‌ అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడానికి సోదరుడితో కలిసి చేసే ప్రయాణం నవ్వులు పంచుతూనే ఉత్కంఠతో సాగుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెంచి,  మంచు కొండలను కరిగిస్తున్న డేవిడ్‌ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌. అయితే, తన వద్ద ఉన్న శక్తిమంతమైన బ్లాక్‌ట్రైడెంట్‌తో డేవిడ్‌ అన్నదమ్ములిద్దరినీ మట్టికరిపించడంతో కథ విషమ పరిస్థితికి చేరుకుంటుంది. ఇక్కడేదో అద్భుతం జరుగుతుందని ప్రేక్షకుడు ఊహిస్తుండగా, మెరా వచ్చి వీరిని రక్షిస్తుంది. ఆ తర్వాత వీళ్లంతా కలిసి డేవిడ్‌ చర్యలకు అడ్డుకట్ట వేస్తారనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. (aquaman2 Review) దుష్టశక్తి అయిన కొడెక్స్‌ను విడిపించి దానిని వశం చేసుకోవడానికి అట్లాంటిస్‌ రాజవంశీకుల రక్తం అవసరమవడంతో ఆర్థర్‌ కొడుకుని డేవిడ్‌ కిడ్నాప్‌ చేయడం వంటి సన్నివేశాలు రొటీన్ తెలుగు సినిమాను తలపిస్తాయి. పతాక సన్నివేశాల్లో హైఓల్టేజ్‌తో సాగాల్సిన యాక్షన్‌ సన్నివేశాలు విజువల్స్‌ పరంగా బాగున్నా ఒక కమర్షియల్‌ మూవీ మాదిరిగా సాదాసీదాగా ముగిసినట్లు అనిపిస్తాయి. మొదటి భాగంలో ఒక అనామకుడైన ఆర్థర్‌ ట్రైడెంట్‌ కోసం చేసే సాహసాలు.. దాన్ని దక్కించుకున్న తర్వాత అట్లాంటిస్‌ రాజు పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం ఆద్యంతం భావోద్వేగాల మిళితంగా సాగుతుంది. కానీ, ఈ సినిమాలో ఆ ఎలిమెంట్‌ లోపించింది.

ఎవరెలా చేశారంటే: ఆక్వామెన్‌గా జాసన్‌ మోమోయ్‌ని తప్ప మరొకరని ఊహించలేం. మొదటి భాగంలో మాదిరిగానే తన ఆహార్యం, పంచ్‌ డైలాగ్‌లతో పాటు, యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ జాసన్‌ అదరగొట్టాడు.  ఆర్థర్‌ సోదరుడు ఓరమ్‌ పాత్రలో పాట్రిక్‌ విల్సన్‌ మెప్పించాడు. (Aquaman and the Lost Kingdom Movie review) మెరాగా అంబర్‌ హెర్డ్‌ అందంగా కనిపించింది. ఇక తొలి భాగంగా కొద్దిసేపే కనిపించిన సముద్రపు దొంగ డేవిడ్‌ కేన్‌గా యాహ్యా అబ్దుల్‌కు ఇందులో మంచి స్క్రీన్‌ స్పేస్‌ లభించింది. తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌ను అంతం చేసేందుకు ప్రతికారేచ్ఛతో రగిలిపోయే వ్యక్తిగా ఒదిగిపోయాడు. (aquaman2 Review)  మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా టాప్‌ ఆఫ్ ది టాప్‌. టెక్నికల్‌ టీమ్‌ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్నీ విజువల్‌ ఫీస్ట్‌గా మార్చాయి. ఈ క్రిస్మస్‌ హాలీడేస్‌తో మీ పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లాలంటే ‘ఆక్వామెన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌డమ్‌’ మంచి ఛాయిస్‌. తెలుగులో కూడా విడుదల చేస్తామని ప్రకటించినా ఒకట్రెండు థియేటర్లలో మాత్రమే సినిమాను, అదీ తక్కువ షోలకు పరిమితం చేశారు. బహుశా ఇతర సినిమాల పోటీ వల్ల కావచ్చు.

  • బలాలు
  • + ప్రధాన పాత్రలు
  • + విజువల్‌ ఎఫెక్ట్స్‌
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - రొటీన్‌ కథ
  • - పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం
  • చివరిగా: ఆక్వామెన్‌2.. మరో విజువల్‌ వండర్‌ (Aquaman2 Review telugu)
  • గమనిక: ఈ సమీక్ష  సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని