Article 370 movie review: రివ్యూ: ఆర్టికల్‌ 370.. యామి గౌతమ్‌, ప్రియమణి నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

యామి గౌతమ్‌, ప్రియమణి నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Updated : 23 Apr 2024 16:47 IST

Article 370 movie review; చిత్రం: ఆర్టికల్‌ 370; నటీనటులు: యామి గౌతమ్‌, ప్రియమణి, రాజ్‌ అర్జున్‌, వైభవ్‌ తత్వాడి, అరుణ్‌ గోవిల్‌, రాజ్‌ జుస్టిషి, దివ్యా సేథ్‌, సుమిత్‌ కౌల్‌ తదితరులు; సంగీతం: శాశ్వత్‌ సచ్‌దేవ్‌; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ దీనా వసాని; ఎడిటింగ్‌: శివకుమార్‌ వి. పనికర్‌; నిర్మాత: జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్‌, లోకేష్‌ ధర్‌; దర్శకత్వం: ఆదిత్య సుహాస్‌ జంభాలే; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

గత కొంతకాలంగా భారతీయ బాక్సాఫీస్‌ వద్ద చారిత్రక సంఘటనలు, వాస్తవ పరిస్థితులను కథా వస్తువులుగా తీసుకుని సినిమాలు తీస్తున్నారు దర్శక-నిర్మాతలు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ఆర్టికల్‌ 370’. ఇప్పటికే థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? (Article 370 movie review) అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందా?

కథేంటంటే: జూనీ హస్కర్‌ (యామి గౌతమ్‌) ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌. తన తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలతో ఉగ్రవాది బుర్హన్‌ వానీ ఎక్కడ ఉన్నాడో కనిపెడుతుంది. తన సీనియర్‌ అధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ, సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ యశ్‌ చౌహాన్‌ (వైభవ్‌)తో కలిసి ఆపరేషన్‌ చేపట్టి బుర్హన్‌ వానీని హతమారుస్తుంది. దీంతో ఆమెను దిల్లీకి బదిలీ చేస్తారు.  బుర్హన్‌ వానీ అంతమవడంతో కశ్మీర్‌ నిత్యం ఆందోళనలు, గొడవలతో రగులుతూ ఉంటుంది. మరోవైపు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కశ్మీర్‌ కీలక నేతలను దిల్లీకి ఆహ్వానించిన ప్రధాని చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ చర్చల్లో పీఎంవో జాయింట్‌ సెక్రటరీ రాజేశ్వరి (ప్రియమణి) కీలకంగా వ్యవహరిస్తారు. అయితే, ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే ఎదురయ్యే పరిస్థితులు, అందుకు ఉన్న అడ్డంకులను అధ్యయనం చేయాలని ప్రభుత్వం రాజేశ్వరిని రంగంలోకి దింపుతుంది. కశ్మీర్‌లో పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసిన జూనీ హస్కర్‌ను ఎన్‌ఐఏలోకి తీసుకుని అక్కడికి పంపుతారు. మరి జూనీ కశ్మీర్‌ వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో రాజకీయంగా దిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 గురించి పదో తరగతి వరకూ చదువుకున్న ప్రతీ విద్యార్థికి తెలుసు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? నిబంధనలు ఏంటి?  ఆ ఆర్టికల్‌ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలా చెప్పుకొంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. ఎంతో సున్నిత అంశమైన ఆర్టికల్‌ 370ని రద్దు చేసే సాహసం చేసిన ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్న వాస్తవ పరిస్థితులను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ఆదిత్య మంచి మార్కులే కొట్టేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, బుర్హన్‌వానీని, జూనీ మట్టుబెట్టే సన్నివేశాలతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు, అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఆర్టికల్‌ 370 రద్దుకు చేసే ప్రయత్నాలు, వాటిని కశ్మీర్‌ నాయకులు అడ్డుకోవడం, ప్రతీ దశలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు చెబుతూ వాళ్లు వినిపించే వాదనలు ఇవన్నీ సుదీర్ఘంగా సాగుతాయి. ఆర్టికల్‌ 370 తీసుకురావడానికి ఏర్పడిన పరిస్థితులు, అప్పటి నాయకులు చేసిన తప్పిదాలను సైతం ఈ సందర్భంగా ఎత్తిచూపే సన్నివేశాలతో స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది.

ఒకవైపు ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు చూపిస్తూనే మరోవైపు, కశ్మీర్‌లో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా జూనీ హస్కర్‌ చేసే సాహసాలను సమాంతరంగా చూపించారు. ఈ క్రమంలో ఉగ్ర ముఠాలను మట్టుపెట్టేందుకు జూనీ చేసే ఆపరేషన్‌ను ఉత్కంఠగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆయా యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయి. అయితే, వాటి కోసం కాస్త సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు కేంద్రంతో కశ్మీర్‌ నాయకుల మంతనాలు, ఈ సందర్భంగా చట్టాలు, బిల్లుల గురించి జరిగే చర్చలు విసిగిస్తాయి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అయితే, చివరి వరకూ ఆర్టికల్‌ 370 రద్దు గురించి గోప్యంగా ఉంచుతూ అటు ప్రభుత్వ వ్యవస్థలను, ఇటు మీడియాను వేరే అంశాలవైపు మళ్లించడం వంటి సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపించింది. పతాక సన్నివేశాల్లో జూనీ యాక్షన్‌ ఒకవైపు.. ఆర్టికల్‌ 370 రద్దుకు జరిగే ఓటింగ్‌ మరోవైపు చూపిస్తూ సినిమాను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: ఈ మూవీలో ప్రధానంగా కనిపించేది యామి గౌతమ్‌, ప్రియమణిలే. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. యామి తన కెరీర్‌లో మరో మంచి పాత్రను చేసింది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దర్శకుడు ఆదిత్య తాను చెప్పాలనుకున్న పాయింట్‌ కాస్త సుదీర్ఘంగా చెప్పినా ఎక్కడా అవుట్‌ ఆఫ్ ది కంటెంట్‌ వెళ్లలేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ ఆడియోలో ఉంది. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.

  • బలాలు
  • + యామి గౌతమ్‌, ప్రియమణిల నటన
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - నిడివి
  • - సుదీర్ఘంగా సాగే చర్చల సన్నివేశాలు
  • చివరిగా: ఆర్టికల్‌ 370... జరిగింది చూపించారు.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని