రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా?

Published : 11 Apr 2024 16:32 IST

Bade Miyan Chote Miyan Review; చిత్రం: బడే మియా ఛోటే మియా; న‌టీన‌టులు: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్; సినిమాటోగ్రఫీ: మార్సిన్ లాస్కావిక్; ఎడిటింగ్‌: స్టీవెన్ హెచ్. బెర్నార్డ్; సంగీతం: జూలియస్ ప్యాకియం; పాటలు: విశాల్ మిశ్రా; ర‌చ‌న‌: అలీ అబ్బాస్ జాఫ‌ర్‌, ఆదిత్య బ‌సు, సూర‌జ్ జ్ఞాని; నిర్మాత‌లు: జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్సికా  దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా; నిర్మాణ సంస్థ‌లు: పూజా ఎంటర్‌టైన్‌మెంట్, AAZ ఫిల్మ్స్; ద‌ర్శ‌క‌త్వం: అలీ అబ్బాస్ జాఫ‌ర్‌; విడుద‌ల‌: 11 ఏప్రిల్ 2024

ఈద్ సంద‌ర్భంగా బాలీవుడ్ నుంచి అగ్ర తార‌ల సినిమాలు ఏదో ఒక‌టి ఖాయంగా సంద‌డి చేయ‌డం రివాజు. ఈసారి ‘బ‌డే మియా ఛోటే మియా’ అంటూ అక్ష‌య్ కుమార్‌, టైగ‌ర్ ష్రాఫ్  దూసుకొచ్చారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో... రూ: 350కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. భారీ అంచ‌నాలు, అదే స్థాయి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? (Bade Miyan Chote Miyan Review) యాక్షన్‌ ప్రియులను మెప్పించిందా?

కథేంటంటే: ఫ్రెడ్డీ అలియాస్ ఫిరోజ్ (అక్ష‌య్ కుమార్‌), రాకేష్ అలియాస్ రాకీ ఇండియ‌న్ ఆర్మీలో సైనికులు. అఫ్గాన్‌లో ఓ ఆప‌రేష‌న్ కోసం వెళ్లి, విజ‌య‌వంతంగా పూర్తి చేసుకొచ్చాక వీళ్లిద్ద‌రూ బ‌డే మియా, ఛోటే మియాగా ప్రాచుర్యం పొందుతారు. ఉత్త‌మ సైనికులుగా గుర్తింపు పొందిన ఇద్ద‌రినీ కొన్నాళ్ల త‌ర్వాత ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొల‌గిస్తారు. ఎవ‌రి ప్ర‌పంచంలో వాళ్లు గ‌డుపుతుండ‌గా, ఎనిమిదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇండియ‌న్ ఆర్మీ నుంచి పిలుపొస్తుంది. ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ శ‌క్తిమంత‌మైన ఆయుధాన్ని మ‌రో చోటుకు త‌ర‌లిస్తుండ‌గా, శ‌త్రువు దాడి చేసి లండ‌న్ తీసుకెళ్లిపోతాడు. దాన్ని తిరిగి తీసుకురావ‌డం కోసం కెప్టెన్ మిషా (మానుషి చిల్ల‌ర్‌)తో క‌లిసి బ‌డేమియా, ఛోటే మియా రంగంలోకి దిగుతారు. ఇంత‌కీ ఆ ఆయుధం వెన‌క క‌థేమిటి?దాన్ని తీసుకెళ్లిపోయిన క‌బీర్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఎవ‌రు?భార‌తీయ సైన్యంపై అత‌ను ప‌గ పెంచుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి?(Bade Miyan Chote Miyan Review in telugu) ఆ ఆయుధాన్ని తిరిగి తీసుకొచ్చారా లేదా?త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే సినిమాల‌కి పెట్టింది పేరు బాలీవుడ్‌. కానీ, ఈ మ‌ధ్య వ‌స్తున్న సినిమాలన్నింటిలోనూ ఇంచుమించు ఒకే త‌ర‌హా క‌థ‌లే ఉంటున్నాయి. పాత మిత్రుడే కొత్త శ‌త్రువుగా అవ‌త‌రించి క‌థానాయ‌కుల‌కు స‌వాల్ విసురుతుంటాడు. ఈ టెంప్లేట్ క‌థ‌లు ఏ మాత్రం ఆస‌క్తిని రేకెత్తించ‌క‌పోగా, భావోద్వేగాల ప‌రంగానూ ప్ర‌భావం చూపించ‌డం లేదు. ఈ సినిమాలోనూ భారీ తారాగ‌ణం, సాంకేతిక హంగులు, మంచి లొకేష‌న్లు, గ‌న్నులు, ట్యాంక‌ర్లు, హెలికాఫ్ట‌ర్లు, అడుగ‌డుగునా భీక‌ర పోరాటాలు... ఇలా కావల్సినంత హంగామా ఉంది. కానీ, స‌రైన క‌థ‌, క‌థ‌నాలే లేవు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి ఏ కోశానా క‌ల‌గ‌దంటే ర‌చ‌న ఎంత బ‌ల‌హీన‌మో అర్థం చేసుకోవ‌చ్చు. విరామానికి ముందు, ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు  క‌థ‌లో కొన్ని మ‌లుపులున్నా అవి కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. అక్ష‌య్ కుమార్‌, టైగ‌ర్ ష్రాఫ్ మ‌ధ్య వచ్చే సన్నివేశాలే కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నం. (Bade Miyan Chote Miyan Review) ప్ర‌థ‌మార్ధంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగుతాయి. ద్వితీయార్ధానికి వ‌చ్చేస‌రికి ఆ త‌ర‌హా స‌న్నివేశాలూ క‌రవ‌య్యాయి. ఒక‌దానివెంట మ‌రొక‌టి యాక్ష‌న్ ఘ‌ట్టాలు వ‌చ్చి ప‌డిపోతూ, సినిమా అలా సాగిపోతూ ఉంటుంది త‌ప్ప వాటి నుంచి ప్ర‌యోజ‌నం శూన్యం. క‌ర‌ణ్ క‌వచ్‌, సోల్జ‌ర్ ఎక్స్ అంటూ కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌తో హంగామాని సృష్టించి తెర‌పై చూపించారు కానీ, అదంతా గంద‌ర‌గోళం. ఔరా అనిపించేలా ఒక్క స‌న్నివేశం లేదు. గ‌తంలో వ‌చ్చిన  రోబో, ప‌ఠాన్‌, వార్ త‌దిత‌ర సినిమాల్లోని పాత్ర‌ల్ని, స‌న్నివేశాల్ని గుర్తు చేస్తుందీ చిత్రం. విల‌న్ బ్యాక్ స్టోరీ మొద‌లుకొని ప్ర‌తిదీ  ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది.

ఎవ‌రెలా చేశారంటే: అక్ష‌య్ కుమార్‌, టైగ‌ర్ ష్రాఫ్ బ‌డే మియా, ఛోటే మియాగా చేసిన సంద‌డి సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఒక‌రిపై మ‌రొక‌రు వ్యంగాస్త్రాలు విసురుకోవ‌డం ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వుల్ని పంచుతుంది.  ఇద్ద‌రూ యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తోనూ, డ్యాన్సుల‌తోనూ అద‌ర‌గొట్టారు. మానుషి చిల్ల‌ర్ కథానాయ‌కుల‌తోపాటే సినిమా అంతా క‌నిపిస్తుంది కానీ, ఆ పాత్ర‌లోనూ పెద్ద‌గా బ‌లం లేదు.  అల‌య‌.ఎఫ్, సోనాక్షి సిన్హా పాత్ర‌లు ద్వితీయార్ధంలో కీల‌కం. (Bade Miyan Chote Miyan Review) సోనాక్షి సిన్హా కేవ‌లం ఓ అతిథి పాత్ర‌లా క‌నిపిస్తుందంతే. పృథ్వీరాజ్ సుకుమారన్‌లోని న‌టుడిని ఏమాత్రం ఉప‌యోగించుకోలేదు ద‌ర్శ‌కుడు. క‌బీర్ పాత్ర‌లో కాసేపు ముసుగు వీరుడిగా, కాసేపు ముసుగు లేకుండా క‌నిపిస్తూ ఉంటాడంతే. మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ రచ‌న‌లోనూ, మేకింగ్‌లోనూ మెరుపులు క‌నిపించ‌లేదు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + అక్ష‌య్ కుమార్‌, టైగ‌ర్ ష్రాఫ్ జోడీ
  • + యాక్ష‌న్ ఘ‌ట్టాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆస‌క్తి లేని క‌థ‌, క‌థ‌నాలు
  • - సాగదీత‌గా స‌న్నివేశాలు
  • చివ‌రిగా: బ‌డే మియా ఛోటే మియా...యాక్షన్‌ హంగామా తప్ప ఏమీ లేదు (Bade Miyan Chote Miyan Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని