Balagam Review: రివ్యూ: బ‌ల‌గం

Balagam Review: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బలగం’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 03 Mar 2023 06:28 IST

Balagam Review; చిత్రం: బలగం; న‌టీన‌టులు: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు; ఛాయాగ్రహణం: ఆచార్య వేణు; పాటలు: కాసర్ల శ్యామ్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; నిర్మాత‌లు: హర్షిత్ రెడ్డి, హన్షిత‌; ద‌ర్శ‌క‌త్వం: వేణు యెల్దండి; సంస్థ‌: దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌; సమర్పణ: శిరీష్; విడుదల: 03-03-2023

న‌టులు ద‌ర్శ‌కులు కావ‌డం కొత్తేమీ కాదు.  హాస్య న‌టుడిగా సినిమాపైనా... బుల్లితెర‌పైనా త‌న‌దైన ముద్ర వేసిన వేణు టిల్లు కొత్త‌గా ఆ జాబితాలోకి చేరారు. ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌డం ఓ ప్ర‌త్యేక‌త అయితే... ఆయ‌న సినిమా ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో రూపొంద‌డం మ‌రో విశేషం. దిల్‌రాజు కుటుంబానికి చెందిన రెండో త‌రం హ‌న్షిత‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తార‌లు లేక‌పోయినా ఈ సినిమాకి త‌గిన స్థాయిలో ప్ర‌చారం ల‌భించిందంటే దిల్‌రాజు వెన‌క ఉండ‌ట‌మే కార‌ణం. (Balagam Review) విడుద‌ల‌కి ముందే ప‌లు చోట్ల ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు వేసి సినిమాకి మ‌రింత‌గా ప్ర‌చారం చేశారు.  మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఇంతకీ బలగం కథేంటి?

క‌థేంటంటే: తెలంగాణలోని ఓ మారుమూల ప‌ల్లెలో జ‌రిగే క‌థ ఇది. సాయిలు (ప్రియ‌ద‌ర్శి) ఓ నిరుద్యోగి.  ఉపాధి కోస‌మ‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ల‌క్ష‌లు అప్పు చేసి ఊళ్లో ఓ స్నూక‌ర్ బోర్డ్ పెడ‌తాడు. అది అత‌ని క‌ష్టాల్ని ఏమాత్రం గ‌ట్టెక్కించ‌క‌పోగా, అప్పుల ఒత్తిళ్లు అధిక‌మ‌వుతాయి. పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ట్నంతో అప్పులు తీర్చుకోవడ‌మే  త‌న ముందున్న ఏకైక మార్గంగా భావిస్తాడు.  పెళ్లి కూడా కుద‌ర‌డంతో అప్పుల వాళ్ల‌కి అదే విష‌యం చెబుతాడు. ఒక‌ప‌క్క నిశ్చితార్థం ప‌నులు జ‌రుగుతుండ‌గానే, తాత కొముర‌య్య చ‌నిపోతాడు. అది చాల‌ద‌న్న‌ట్టుగా  చావు ఇంట్లో మాటా మాటా పెరిగి కుదిరిన ఆ పెళ్లి కూడా పెటాకుల‌వుతుంది. దాంతో సాయిలు క‌ష్టాలు రెట్టింప‌వుతాయి. తాత మ‌ర‌ణంతో సూర‌త్‌లో ఉన్న బాబాయ్‌,  ఎప్పుడో ఇర‌వ‌య్యేళ్ల కింద‌ట దూర‌మైన మేన‌త్త‌, మేన‌మామ, వాళ్ల కూతురు సంధ్య (కావ్య క‌ళ్యాణ్‌రామ్‌) రావ‌డంతో ఒక‌ప‌క్క వాళ్ల మంచి చెడులు చూసుకుంటూనే తాత అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు సాయిలు. కానీ ఆ త‌ర్వాతే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. (Balagam Review) చిన్న క‌ర్మ రోజున పెట్టిన పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. దాంతో  కొముర‌య్య కొడుకు, అల్లుడు మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌వుతుంది.  ఐదో రోజైనా కాకులొస్తాయ‌నుకుంటే ఆ రోజు కూడా అదే ప‌రిస్థితి.  దాంతో ఇంట్లో గొడ‌వ‌లు మ‌రింత‌గా ముదిరిపోతాయి. తాత మ‌న‌సులో బాధ ఉండ‌టంతోనే కాకులు రావ‌డం లేద‌ని, ఇది ఊరికే అరిష్టం అని పంచాయ‌తీలో పెద్ద‌లు తేలుస్తారు. పెద్ద క‌ర్మ అయిన ప‌ద‌కొండో రోజున  ఏం జ‌రిగింది?  ఆ రోజైనా కాకులొచ్చి పిండాన్ని తిన్నాయా?  కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా?  సాయిలు క‌ష్టాలు తీరాయా ? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: ఓ ఇంటి పెద్ద మ‌ర‌ణం చుట్టూ సాగే ఓ కుటుంబ క‌థ ఇది. మన కుటుంబ అనుబంధాల్లోని బ‌లాన్ని.. న‌మ్మ‌కాల్ని, ఆచారాల్ని అత్యంత స‌హజంగా ఆవిష్క‌రిస్తుంది. మ‌నదైన సంస్కృతి, మూలాల్లోనే మ‌న‌సుల్ని స్పృశించే ఎన్నో క‌థ‌లున్నాయ‌ని ఈ చిత్రం మ‌రోసారి చాటి చెబుతుంది. తెలంగాణ‌లోని చావు చుట్టూ జ‌రిగే తతంగాన్ని ప‌క్కాగా  ఆవిష్క‌రిస్తూనే, ఓ కుటుంబంలోని సంఘ‌ర్ష‌ణ‌ని అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.  తెలంగాణ ప‌ల్లె జీవితాల్ని చూపెడుతూ క‌థ మొద‌ల‌వుతుంది. ఆ జీవితాల్లోని స్వ‌చ్ఛ‌త‌, మ‌నుషుల్లోని అమాయ‌క‌త్వం, వాళ్ల‌లోని భాష‌, యాస, వెట‌కారం... నిమిషాల్లోనే కథా ప్ర‌పంచంలో లీనం చేస్తుంది.  (Balagam Review) చావు ద‌గ్గ‌ర కొద్దిమంది స్పందించే తీరుని చూపెడుతూ న‌వ్వించిన ద‌ర్శ‌కుడు, ఆ త‌ర్వాత భావోద్వేగాల‌పై దృష్టిపెట్టాడు. ఇర‌వ‌య్యేళ్ల కింద‌ట ఏం జ‌రిగిందో, చిన్న చిన్న విష‌యాలే మ‌నుషుల్ని ఎలా దూరం చేశాయో, ఇద్ద‌రి మ‌ధ్య  అహం కుటుంబాల్లో ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి దారితీసిందో ద్వితీయార్ధంలో ఆస‌క్తిక‌రంగా చూపించారు. తెలంగాణ సంస్కృతిలో కీల‌క‌మైన జాన‌ప‌దాల్ని, ఒగ్గు క‌థ‌ల్ని ఈ సినిమాలో వాడిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో అన్నా-చెల్లెళ్ల మ‌ధ్య అనుబంధాన్ని, కుటుంబం నేప‌థ్యంలో  భావోద్వేగాల్ని ఆవిష్క‌రించ‌డంలో ఆ పాట‌లే కీల‌క‌పాత్ర పోషిస్తాయి. నేప‌థ్య‌మే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. (Balagam Review) క‌థ‌, పాత్ర‌, భాష‌ల్లోని స‌హ‌జ‌త్వం ప్ర‌తి స‌న్నివేశానికీ ఓ ప్ర‌త్యేక‌మైన అందాన్ని తీసుకొచ్చింది.  క‌థంతా ఓ ఇల్లు, చావు చుట్టూనే సాగ‌డంతో అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలు పండినా  క‌థ‌, క‌థ‌నాల గ‌మ్యం ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందేలా సాగ‌డం సినిమాకి మైన‌స్‌.  మ‌న ద‌గ్గ‌ర సినిమా అన‌గానే వాణిజ్యాంశాల ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య  కేవ‌లం ఓ చావు చుట్టూ సాగే క‌థ‌ని న‌మ్మి సినిమా చేసిన నిర్మాత‌ల అభిరుచి మెచ్చుకోద‌గ్గ‌ది. 

ఎవ‌రెలా చేశారంటే: సినిమాలో  హీరో హీరోయిన్లంటూ ప్ర‌త్యేకంగా ఎవ్వ‌రూ క‌నిపించ‌రు. ప్ర‌తి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. ర‌చ‌న‌లోని బ‌ల‌మే అది. ప్రియ‌ద‌ర్శి, అత‌ని మిత్ర‌బృందంతో క‌లిసి న‌వ్విస్తాడు. ప‌తాక స‌న్నివేశాల్లో తాత‌ని గుర్తు చేసుకునే స‌న్నివేశంతో భావోద్వేగాల్ని పంచుతాడు. తాత కొముర‌య్య‌, కొడుకు ఐల‌య్య‌, త‌మ్ముడు, చెల్లెలు, బావ నారాయ‌ణ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఆయా పాత్రలకి త‌గ్గ‌ట్టుగా కొత్త న‌టుల్ని ఎంచుకోవ‌డం బాగుంది. సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలుచ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. (Balagam Review) ఆరంభం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ పాట‌లే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. కాస‌ర్ల శ్యామ్ ర‌చించిన గీతాలు సంద‌ర్భోచితంగా వినిపిస్తూ క‌థ‌ని ముందుకు తీసుకెళ్లాయి. భీమ్స్  బాణీల్లో మ‌ట్టిప‌రిమ‌ళం గుభాళిస్తుంది. తెలంగాణ ప‌ల్లెటూరిని కెమెరా అందంగా ఆవిష్క‌రించింది. ద‌ర్శ‌కుడు వేణు నిజాయ‌తీగా ఓ క‌థ రాసుకుని, దాన్ని అంతే  స్ప‌ష్ట‌త‌తో తెర‌పైకి తీసుకొచ్చాడు.  నిర్మాణం బాగుంది. దిల్‌రాజు సంస్థ నుంచి  ఇలాంటి మూలాలున్న క‌థ రావ‌డం చిత్ర‌సీమ‌కి ఓ మంచి సంకేతం.

బ‌లాలు: + క‌థా నేప‌థ్యం;  + హాస్యం.. భావోద్వేగాలు; + పాట‌లు

బ‌ల‌హీన‌త‌లు: - సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు - ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందే క‌థ‌

చివ‌రిగా: విలువ‌లు... భావోద్వేగాలే ఈ సినిమా బ‌లం.. ‘బ‌ల‌గం’ (Balagam Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని