Berlin Web Series Review: రివ్యూ: బెర్లిన్‌.. మనీ హైస్ట్‌ స్పిన్‌ ఆఫ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

‘మనీ హైస్ట్‌’ సిరీస్‌కు ముందు బెర్లిన్‌ ఏం చేశాడో చెప్పే ఆసక్తికర కథాంశంతో రూపొందిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

Published : 02 Jan 2024 16:42 IST

Berlin Web Series Review; వెబ్‌సిరీస్‌: బెర్లిన్‌; నటీనటులు: పెడ్రో అలోన్సో, సమంత సిక్వోరోస్‌, ట్రిస్టన్‌ ఉల్లోవా, మిచెల్‌ జెన్నర్‌, బెగోనా వర్గాస్‌, జూలియో పెనా ఫెర్నోండోజ్‌, జోయెల్‌ శాంఛెజ్‌; క్రియేటర్స్: ఎస్తేర్‌ మార్టినెట్‌ లోబాటో; దర్శకత్వం:  డేవిడ్‌ బారోకల్‌, ఆల్బర్ట్‌ పింటో, జాఫ్రీ కౌపర్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని స్పానిష్‌ వెబ్‌సిరీస్‌ ‘మనీహైస్ట్‌’. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్‌ అనేక భాషల్లో అనువాదమై అలరించింది. ఇందులోని ఏ పాత్రనూ ప్రేక్షకుడు మర్చిపోలేడు. ముఖ్యంగా బెర్లిన్‌. ప్రొఫెసర్‌కు సోదరుడు అయిన అతడికి గతం ఉన్నట్లు ఆ సిరీస్‌లో చూపించారు. (Berlin Web Series Review) ఆ పాత్రను పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తూ తీసుకొచ్చిన సిరీస్‌ ‘బెర్లిన్‌’. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలాంది? ‘మనీ హైస్ట్‌’ కన్నా ముందు బెర్లిన్‌ చేసిన దోపిడీ ఏంటి? దాన్ని అతడు ఎలా అమలు పరిచాడు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

కథేంటంటే: పారిస్‌ ఆక్షన్‌ హౌస్‌లో ఉన్న 44 మిలియన్‌ యూరోల విలువైన ఆభరణాలను దోపిడీ చేయాలని ప్రణాళిక రచిస్తాడు బెర్లిన్‌ (పెడ్రో అలోన్సో). అందుకు దామియన్‌, కైలా, కామెరూన్‌, రాయ్‌, బ్రూస్‌లను సహాయకులుగా నియమించుకుంటాడు. ఒక్కొక్కరూ ఒక్కో అంశంలో మెరికలు. మరి బెర్లిన్‌ అనుకున్నట్లు ఆక్షన్‌ హౌస్‌ నుంచి ఆభరణాలను ఎలా దోపిడీ చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కమిలి (సమంత సిక్వోరోస్‌) ప్రేమలో పడిన బెర్లిన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు?(Berlin Web Series Review) తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్‌లలో ‘మనీ హైస్ట్‌’ ఒకటి. స్పానిష్‌లో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌ చూసి, నిర్వాహకులు అనేక భాషల్లోకి అనువదించారు. ఆ సిరీస్‌ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర ‘బెర్లిన్‌’. ప్రొఫెసర్‌ సోదరుడిగా ఎన్ని సవాళ్లు ఎదురైనా దోపిడీని ముందుకు నడిపే అతడి తెగింపు, చివరకు ప్రాణత్యాగం ప్రేక్షకులను అలరించాయి. అయితే, ‘మనీ హైస్ట్‌’కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో రూపొందిన సిరీస్‌ ‘బెర్లిన్‌’. (Berlin Web Series Review)  తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే, ‘జస్ట్‌ ఓకే’ అని చెప్పాలి. ‘మనీ హైస్ట్‌’ సిరీస్‌ల్లో ఉన్న ఉత్కంఠ, పాత్రల మధ్య సంఘర్షణ, బలమైన భావోద్వేగాలు ఇందులో లేవు. ఆక్షన్‌ హౌస్‌లో ఉన్న ఆభరణాలను దోపిడీ చేసే ప్లాన్‌ను బెర్లిన్‌ తన టీమ్‌కు వివరిస్తూ వచ్చే సన్నివేశాలతో నేరుగా కథ మొదలవుతుంది. అంతే వేగంగా ఆభరణాల దోపిడీవైపు కథ నడుస్తుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఆక్షన్‌ హౌస్‌ను ఎలా ఛేదిస్తారు.. ఇందుకు వాళ్లు వాడే టెక్నాలజీ.. లోపలికి వెళ్లే తీరు ఇలా ప్రతి సీన్‌ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఆయా సన్నివేశాలు సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడికి భలే కిక్‌ ఇస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్‌ అభిమానులు ఇంకా బాగా కనెక్ట్‌ అవుతారు.

మొదటి నాలుగు ఎపిసోడ్స్‌ పూర్తి ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దారు. ఒక్కొక్కటీ 45 నిమిషాలకు పైనే ఉన్నా, ఎక్కడా బోర్‌ కొట్టదు. కానీ, ఒకసారి ఆభరణాలను దోచుకుని బయటకు వచ్చాక, కథ ఏమాత్రం ముందుకు కదలదు. ఆక్షన్‌ హౌస్‌ నిర్వాహకుడి భార్య కమిలితో బెర్లిన్‌ సాగించే ప్రేమాయణం విసుగు తెప్పిస్తుంది. దోచుకున్న నగలను తప్పించే మార్గం గురించి ఆలోచించకుండా, కమిలి చుట్టూ బెర్లిన్‌ తిరుగుతూ ఉండే సీన్స్‌ చికాకు పెట్టిస్తాయి. దానికి తోడు ఇతర పాత్రల మధ్య కూడా అలాంటి సీన్స్‌ను క్రియేట్‌ చేసి, ఆద్యంతం సాగదీత వ్యవహారంలా సిరీస్‌ను నడిపించారు. మళ్లీ చివరి ఎపిసోడ్‌కు కానీ, కథలో వేగం పుంజుకోదు. దోపిడీ ముఠాను అన్వేషించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా, బెర్లిన్‌ అండ్‌ టీమ్‌ ఈజీగా తప్పించుకోవడం మరీ సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: బెర్లిన్‌ పాత్రలో నటించిన పెడ్రో అలోన్సో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్‌లో ఆ పాత్రకు మరింత హాస్యం, ప్రేమ జోడించి అలోన్సో రక్తికట్టించాడు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ ఓకే. సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. దాదాపు ఏడు గంటల నిడివి అతి పెద్ద సమస్య. దాన్ని తగ్గించి ఉంటే బాగుండేది.

ఫ్యామిలీతో చూడొచ్చా: కష్టమే. అసభ్య పదజాలం, ఇంటిమేట్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి. తెలుగు ఆడియో అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + మొదటి నాలుగు ఎపిసోడ్స్‌
  • + దోపిడీ చేసే సీన్స్‌
  • + చివరి ఎపిసోడ్‌
  • బలహీనతలు
  • - బెర్లిన్‌ ప్రేమాయణం
  • - ట్విస్ట్‌లు, బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం,
  • చివరిగా: ‘బెర్లిన్‌’ ‘మనీహైస్ట్‌’ అభిమానులకు మాత్రమే!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని