Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్‌ నారాయణ.. థ్రిల్‌ పంచాడా?

Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్‌ పంచిందా?

Updated : 01 Mar 2024 14:36 IST

Bhoothaddam Bhaskar Narayana Review; చిత్రం: భూతద్దం భాస్కర్‌ నారాయణ; నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌, షఫీ, శివన్నారాయణ తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌; సినిమాటోగ్రఫీ: గౌతమ్‌ జి; ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌; నిర్మాత: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశీ, కార్తిక్‌ ముడుంబై; రచన, దర్శకత్వం: పురుషోత్తమ్‌ రాజ్‌; విడుదల: 01-03-2024

డిటెక్టివ్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త కాదు కానీ, అరుదుగా రూపొందుతుంటాయి. ‘చంట‌బ్బాయ్’ నుంచి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ త‌ర‌చూ వచ్చిన ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచి, విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ‘భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ‌’ తెర‌కెక్కించారు పురుషోత్తం రాజ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? కొత్త డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పిస్తాడు?

క‌థేంటంటే: పోలీసు యంత్రాంగానికి స‌వాల్‌గా మారతాయి దిష్టి బొమ్మ హ‌త్య‌లు. దారుణంగా మ‌హిళ‌ల్ని హ‌త్య చేయ‌డం, త‌ల స్థానంలో దిష్టిబొమ్మ‌ని పెట్టి అడ‌వుల్లో మృత‌దేహాన్ని వ‌దిలి వెళ్లిపోవ‌డం. అలా 18 ఏళ్ల కాలంలో 17 హ‌త్య‌లు చోటు చేసుకుంటాయి. క‌ర్ణాట‌క‌, ఆంధ్రా స‌రిహ‌ద్దులో జరిగే ఈ హ‌త్యలు ఓ సైకో కిల్ల‌ర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ, ఎంత ప‌రిశోధించినా ఒక్క ఆధారమూ దొర‌క‌దు. ఈ కేస్‌ని పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్‌ భాస్క‌ర్ నారాయ‌ణ (శివ కందుకూరి). ఎలాంటి ఆధారాలు దొర‌క్కుండా చేస్తున్న ఆ హ‌త్య‌లు అత‌నికీ స‌వాల్‌గా మార‌తాయి. కానీ, చివ‌రికి అవి హ‌త్య‌లు కాదు, నర బ‌లులు అనే విషయాన్ని ప‌సిగ‌డ‌తాడు. ఇంత‌కీ అలా మ‌హిళ‌ల్ని బ‌లి ఇస్తున్న‌ది ఎవ‌రు?త‌ల స్థానంలో దిష్టి బొమ్మ‌లు పెట్ట‌డానికి కారణమేంటి? (Bhoothaddam Bhaskar Narayana Review in telugu) ఈ కేస్‌ని భాస్క‌ర్ నారాయ‌ణ ఎలా క్లోజ్ చేశాడు?డిటెక్టివ్ కావాలన్న అతడి కల నిజమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: చిక్కుముడులెన్నో ఉన్న ఓ కేసు... దాన్ని ప‌రిశోధిస్తూ ఒక్కొక్క దాన్ని విప్పుతూ అస‌లు నిజాన్ని వెలుగులోకి తీసుకురావ‌డం... డిటెక్టివ్ క‌థ‌లు ఇంచు మించు ఇలాగే ఉంటాయి. కేసు ప‌రిశోధ‌నతో కూడిన ప్ర‌యాణం ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంది? తెర‌పై దాన్ని ఎలా ఆవిష్కరించారు? ఎంత వైవిధ్యంగా ఉందనే విషయంపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ విష‌యంలో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు చేసిన క‌స‌ర‌త్తులు మెచ్చుకోద‌గ్గ‌వే. ఓ డిటెక్టివ్ క‌థ‌ని పురాణాల‌తో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. డిటెక్టివ్ భాస్క‌ర్ నారాయ‌ణ ప్ర‌పంచం కూడా గ‌త చిత్రాల‌కి భిన్నంగా ఉంటుంది. ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా ఆ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది.

క‌థానాయ‌కుడి నేప‌థ్యంతో సినిమా స‌ర‌దాగా మొద‌ల‌వుతుంది. నాయిక‌తో క‌లిసి చేసే సంద‌డీ వినోదాన్ని పంచుతుంది. సీరియ‌ల్ కిల్ల‌ర్ కేస్ మొద‌ల‌య్యాకే అస‌లు క‌థ మొద‌లవుతుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి క‌థానాయ‌కుడి ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని రేకెత్తిస్తాయి. ఈ క‌థ‌లోని పురాణ నేప‌థ్యం సినిమాకి హైలైట్‌. మిగ‌తా డిటెక్టివ్ సినిమాల‌కి ఇది ఎంత భిన్న‌మో ఆ ఎపిసోడ్ చాటి చెబుతుంది. (Bhoothaddam Bhaskar Narayana Review in telugu) ప‌తాక స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  ఆక‌ట్టుకుంటాయి.  ప్ర‌థ‌మార్ధంలో ఫ‌న్‌, ద్వితీయార్ధంలో బిగితో కూడిన క‌థ‌నం ప్రేక్ష‌కుడికి మంచి సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది.  అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు నాట‌కీయంగా అనిపించినా సింహ‌భాగం సినిమా ఓ మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ చూసిన అనుభూతిని పంచుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన ఆయ‌న‌, సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించారు. క‌థానాయిక రాశిసింగ్  అందంగా క‌నిపించారు. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లోనే ప్ర‌భావం చూపించారు. (Bhoothaddam Bhaskar Narayana Review in telugu) సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర  విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి.  నేప‌థ్య సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచింది.  ద‌ర్శ‌కుడిగా పురుషోత్తం రాజ్ నిజాయ‌తీగా క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.  బిగువైన క‌థ‌నంతో మెప్పించాడు. నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది.

  • బ‌లాలు
  • + క‌థ‌లో పురాణ నేప‌థ్యం
  • + డిటెక్టివ్‌గా శివ కందుకూరి నటన
  • + థ్రిల్‌ని పంచే ద్వితీయార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్ర‌థ‌మార్థంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా: భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ‌... థ్రిల్‌ని పంచుతాడు (Bhoothaddam Bhaskar Narayana Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని