Bollywood: ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం

ప్రసవం తర్వాత అనుష్కశర్మ కొత్త చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది.

Updated : 20 Jun 2022 08:15 IST

ప్రసవం తర్వాత అనుష్కశర్మ కొత్త చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. ఇండియన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శర్మ 2018లో ‘జీరో’ చిత్రంలో చివరగా నటించింది. ఆ తర్వాత తను చేయనున్న చిత్రమిదే కావడం గమనార్హం. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతోంది. దీన్ని సోదరుడు కర్ణేష్‌ శర్మతో కలిసి అనుష్కనే నిర్మిస్తోంది. ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


‘రక్షాబంధన్‌’ ట్రైలర్‌ అప్పుడే!

‘రక్షాబంధన్‌’... బాలీవుడ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూన్‌ 21న  విడుదల చేస్తున్నట్లు కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రకటించారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఓ పట్టణంలో నలుగురు చెల్లెళ్లకు అన్నగా అక్షయ్‌ కనిపించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన పోస్టర్‌ను   బట్టి తెలుస్తోంది. ‘ఎన్నటికీ విడిపోని బంధం... అన్నాచెల్లెళ్లది. ఆ అనుబంధంలోకి మీకందరికీ ఆహ్వానం’ అంటూ అక్షయ్‌కుమార్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కుటుంబ, యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఇదే రోజున ఆమిర్‌ఖాన్‌ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్ధా’ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో స్వాతంత్ర దినోత్సవానికీ పెద్ద కథానాయకుల మధ్య బాక్స్‌ఫీసు పోరు తప్పేట్లు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని