citadel review: రిచర్డ్‌ మ్యాడెన్‌.. ప్రియాంక చోప్రా నటించిన సిటడెల్‌ (వెబ్‌ సిరీస్‌) రివ్యూ!

citadel web series review: రిచర్డ్‌ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రా జోన్స్‌ కీలక పాత్రల్లో రుస్సో బ్రదర్స్‌నిర్మించిన ‘సిటడెల్‌’ ఎలా ఉందంటే?

Updated : 28 Apr 2023 12:17 IST

citadel review: వెబ్‌సిరీస్‌: సిటడెల్‌ (రెండు ఎపిసోడ్స్‌ మాత్రమే); నటీనటులు: రిచర్డ్‌ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రాజోన్స్‌, స్టాన్లీ టుక్కీ, లెస్లీ మ్యాన్‌విల్లే తదితరులు; సినిమాటోగ్రఫీ: న్యూటర్‌ థామస్‌ సెగెల్‌, మైఖేల్‌ ఉడ్‌; నిర్మాతలు: ఆంటోనీ రుస్సో, జోసెఫ్‌ రుస్సో, మైక్‌ లారెకో తదితరులు; దర్శకులు: జోష్‌ అపెల్బమ్‌, బ్రెయాన్‌ ఓహ్‌, డేవిడ్‌ వీల్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అటు వెండితెరపైనా, ఇటు బుల్లితెరపైనా, ఇప్పుడు ప్రజలకు వినోదాన్ని పంచుతున్న ఓటీటీలో స్పై థ్రిల్లర్‌లకు కొదవలేదు. జేమ్స్‌ బాండ్‌ నుంచి మిషన్‌ ఇంపాజిబుల్‌ వరకూ ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఆ జానర్‌లోనే వచ్చిన మరో వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’. (citadel review) ‘అవెంజర్స్‌:ది ఎండ్‌గేమ్‌’ తెరకెక్కించిన రుస్సో బ్రదర్స్‌ నిర్మాతలుగా వ్యవహరించడం, బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వెళ్లి అక్కడ సెటిల్‌ అయిన అందాల కథానాయిక ప్రియాంక చోప్రా నటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి కలిగింది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌కు గానూ రెండింటిని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చారు. వారానికొకటి చొప్పున మిగిలిన నాలుగు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి తొలి రెండు ఎపిసోడ్స్‌లో ఏం చూపించారు? సిరీస్‌పై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయా?

కథేంటంటే: ఎఫ్‌బీఐ, ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటడెల్‌ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్‌ వేదికగా దీనిని స్థాపిస్తారు. ఏ ఒక్క దేశానికో కాకుండా ప్రజలందరి సంరక్షణ బాధ్యతే ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. ‘సిటడెల్‌’ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు సంపన్నులు కలిసి ‘మాంటికోర్‌’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. (citadel web series review)సిటడెల్‌లో టాప్‌ స్పై ఏజెంట్లు అయిన మేసన్‌ కేన్‌ (రిచర్డ్‌ మ్యాడెన్‌), నాదియా సిన్హ్‌ (ప్రియాంక చోప్రా)లను తప్పుదోవ పట్టించి వాళ్లను అంతం చేసేందుకు మాంటికోర్‌ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి మేసన్‌, నాదియా ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటడెల్‌ను పునరుద్ధరించి, మాంటికోర్‌ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి?తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇతర జానర్‌లతో పోలిస్తే, స్పై థ్రిల్లర్లు భలే సరదాగా ఉంటాయి. ప్రపంచాన్ని శాసించేలా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు విలన్‌ గ్యాంగ్‌ ప్రయత్నించడం, వాటిని అడ్డుకునేందుకు ఏజెంట్‌ అయిన మన కథానాయకుడు/నాయిక రంగంలోకి దిగి ఒక్కొక్క అడ్డంకి ఛేదించుకుంటూ వెళ్లడం. ఈ క్రమంలో తుపాకీ గుళ్ల వర్షం, బాంబుల మోత, ఊపిరిబిగబట్టి చూసేలా ఛేజింగ్‌లు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు. వీటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ‘సిటడెల్‌’ను తీర్చిదిద్దారు. స్ట్రీమింగ్‌ అయ్యింది రెండు ఎపిసోడ్స్‌ అయినా, జరిగేది అదేనని అర్థమమవుతోంది. అన్నం ఉడికిందని చెప్పడానికి రెండు మెతుకులు పట్టుకుంటే చాలు కదా! అయితే మన ఏజెంట్లు విలన్‌గ్యాంగ్‌ను ఎలా మట్టుబెడతారన్నదే ఆసక్తికరం. కథా నేపథ్యం పాతదే అయినా, పాత్రల చిత్రీకరణ, కథనాన్ని నడిపిన తీరు కాస్త కొత్తగా ఉంది.

ఒక మిషన్‌ కోసం రంగంలోకి దిగిన సిటడెల్‌ ఏజెంట్లు మేసన్‌, నాదియా ప్రమాదం కారణంగా గతం మర్చిపోవడం, తిరిగి వాళ్లు ఎలా మళ్లీ ‘సిటడెల్‌’ ఏజెంట్లుగా మారారని తొలి రెండు ఎపిసోడ్స్‌లో పరిచయం చేశారు. ఆయా సన్నివేశాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. (citadel web series review) నాదియాకు గతం ఎలా గుర్తుకు వచ్చింది. మేసన్‌కు రాకపోవడానికి కారణం ఏంటి అన్న విషయాలను తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటాయి. ఇక తొలి రెండు ఎపిసోడ్స్‌లో యాక్షన్‌ సన్నివేశాలకు కొదవలేదు. ట్రైన్‌లో సుదీర్ఘంగా సాగే యాక్షన్‌ సీన్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతుంది. ‘సిటడెల్‌’ ఎక్స్‌బాక్స్‌కోసం ప్రయత్నిస్తున్న ‘మాంటికోర్‌’ను మేసన్‌, నాదియా ఎలా అడ్డుకున్నారన్నది తర్వాతి ఎపిసోడ్స్‌లో చూడాల్సి ఉంది.

ఎవరెలా చేశారంటే: స్పై ఏజెంట్‌లు మేసన్‌ కేన్‌, నాదియాలుగా రిచర్డ్‌ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రా జోన్స్‌ సరిగ్గా సూటయ్యారు. తొలి ఎపిసోడ్స్‌లోనే తమ యాక్షన్‌తో అదరగొట్టారు. దర్శక-రచయితలు ఎంచుకున్న స్క్రీన్‌ప్లే కారణంగా తర్వాత ఎపిసోడ్స్‌లో మేసన్‌కు దీటుగా ప్రియాంక కీలక పాత్ర పోషించనుంది. ఒకరకంగా కాస్త ఆమెదే పైచేయిలా ఉంది. మిగిలిన పాత్రల ప్రభావం తక్కువ. తర్వాతి ఎపిసోడ్స్‌లో కొత్త పాత్రలు వస్తాయేమో చూడాలి. (citadel web series review) సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సంగీతం మెప్పించాయి. ఒక రొటీన్‌ స్పై కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక-నిర్మాతలు. ఈ జానర్‌లో సినిమాలు చూసేవారికి కొత్తదనం ఏమీ అనిపించదు. అయితే, స్క్రీన్‌ప్లే మాత్రం వేగంగా ఉంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు. తర్వాతి ఎపిసోడ్స్‌పై ఆసక్తికలిగేలా తొలి రెండు ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. వారానికి ఒక ఎపిసోడ్‌ ఇవ్వడం కన్నా మొత్తం అన్ని ఎపిసోడ్స్‌ స్ట్రీమింగ్‌ చేసి ఉంటే మరింత బాగుండేది. ప్రస్తుతానికి స్ట్రీమింగ్‌ అయ్యింది రెండు ఎపిసోడ్స్‌ మాత్రమే. పాత్రల పరిచయం, వారి మిషన్‌ ఏంటనేది చర్చించడానికి ఇవి సరిపోయాయి. కాబట్టి, ప్లస్‌లు, మైనస్‌లు చర్చించడం కాస్త కష్టం.

చివరిగా: సిటడెల్‌.. కథ ఇప్పుడే మొదలైంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని