Mental Health: మా అమ్మే లేకపోతే నేను ఏమై ఉండేదాన్నో..: దీపికా పదుకొనె

తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో పేర్కొంది. తాను ఎదుర్కొన్న మానసిక అనారోగ్యం గురించి దీపికా పదుకొనె చెప్పింది.

Updated : 09 Oct 2022 11:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నటీమణుల్లో దీపికా పదుకొనె ఒకరు. రేపు(october 10) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె తమిళనాడులో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. తాను ఎదుర్కొన్న మానసిక అనారోగ్యం గురించి వెల్లడించింది.  ‘‘మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు.. మన కుటుంబ పాత్ర చాలా ముఖ్యమైంది. నా వ్యక్తిగత ప్రయాణంలోనూ మా అమ్మ ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో సంరక్షకులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నా విషయాన్నే ఉదాహరణగా తీసుకోండి. నా మనసుబాగోలేదని మా అమ్మ గుర్తించకపోతే నేను ఏమై ఉండేదాన్నో. ఆమె గుర్తించడం వల్లే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాను. క్రమం తప్పకుండా వాళ్ల సలహాలు పాటించి చికిత్స తీసుకున్నాను’’

‘‘నేను బెంగుళూర్‌లో ఉంటున్న సమయంలో నా తల్లిదండ్రులు  వచ్చినప్పుడల్లా నా పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు చూపించే యత్నం చేసేదాన్ని. కానీ, ఒక రోజు మా అమ్మ నన్ను నిలదీసి అడిగింది. నీకు ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ‘ఏమైంది ఎందుకలా ఉంటున్నావు?’ అని అడిగింది. అప్పుడు నా పరిస్థితి మొత్తం ఆమెకు వివరించాను. నాకు ఆ సమయంలో మా అమ్మను ఆ దేవుడే పంపాడనిపించింది’’ అని  దీపికా తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

2015లో తొలిసారి దీపికా తన మానసిక ఇబ్బంది గురించి బాహ్యప్రపంచానికి వెల్లడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆమె లివ్‌ లవ్‌ లాఫ్‌ కమ్యూనిటీతో కలిసి మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న వారికి సాయం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని