family star review: రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

Family Star Review: విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’ ఎలా ఉందంటే?

Updated : 05 Apr 2024 16:10 IST

Family Star Review; చిత్రం: ఫ్యామిలీస్టార్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌; సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌; నిర్మాత: దిల్‌రాజు, శిరీష్‌; దర్శకత్వం: పరశురామ్‌; విడుదల: 05-04-2024

‘గీత గోవిందం’తో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ  - ప‌ర‌శురామ్ క‌ల‌యిక‌లో రూపొందిన సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’.  అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్  నిర్మించింది. మంచి కాంబినేషన్‌, భారీ అంచ‌నాలు, దీటైన ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విజయ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

క‌థేంటంటే: గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజినీర్‌గా ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యానికి బానిసైన పెద్ద‌న్న‌య్య‌, ఇంకా జీవితంలో స్థిర‌ప‌డే ద‌శ‌లోనే ఉన్న చిన్న‌న్న‌య్య‌. వాళ్ల కుటుంబాల మంచీ చెడుల్ని చూస్తూ చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే అత‌ని కుటుంబాన్నీ అర్థం చేసుకుని వాళ్ల‌తో క‌లిసిపోతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. (Family Star Review) ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ని ఎలా ప్ర‌భావితం చేసింది?అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ జీవితంలోకి ఎలా వ‌చ్చింది? అత‌ను  మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా?  త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: త‌న కుటుంబాన్ని... త‌న జీవితంలోకి వ‌చ్చిన ఓ అమ్మాయినీ ప్రాణంగా ప్రేమించిన ఓ యువ‌కుడి క‌థే ఈ చిత్రం. కుటుంబం కోసం ఎంత దూర‌మైనా వెళ్లే ఆ యువ‌కుడు.. అదే స్థాయిలో త‌న కుటుంబాన్ని, త‌న మ‌న‌స్త‌త్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? మ‌ధ్య‌లో వ‌చ్చిన అపార్థాలు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి కార‌ణ‌మ‌య్యాయ‌న్న‌ది ఈ సినిమాలో కీల‌కం. ‘ఐ ల‌వ్ యూ’ అనే మాట ఓ వ్య‌క్తికి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేది అంటూ మ‌న కుటుంబ వ్య‌వ‌స్థ బ‌లాన్ని ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌తో చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. క‌థప‌రంగా చూస్తే చిన్న అంశ‌మే. ఓ బ‌ల‌మైన సినిమాకి, అంచ‌నాలున్న సినిమాకి కావాల్సిన స‌రకు, సంఘ‌ర్ష‌ణ అందులో క‌నిపించ‌వు. కానీ, కొద్దిమంది ద‌ర్శ‌కులు క‌థ‌నం, మాట‌ల‌తోనే మేజిక్ చేస్తుంటారు. ప‌ర‌శురామ్‌లోనూ అలాంటి ర‌చ‌యిత ఉన్నాడ‌ని ఆయ‌న సినిమాలు చాటి చెప్పాయి. అయితే ఈ సినిమా విష‌యానికొచ్చేస‌రికి  క‌థ‌నం ప‌రంగానూ ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. (Family Star Review telugu) ఘ‌న విజ‌యం సాధించిన ‘గీత గోవిందం’ త‌ర్వాత ఆ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా ఇది. ప్ర‌త్యేక‌మైన  అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కి వ‌స్తాడు. అయితే అటు హాస్యంప‌రంగా కానీ, ఇటు క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా కానీ  ఏ ద‌శ‌లోనూ ఆ అంచ‌నాల్ని అందుకోలేదు ఈ చిత్రం.

మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసే విన్యాసాలతో క‌థ మొద‌ల‌వుతుంది. ఇంట్లోనూ, బ‌య‌టా పొదుపు కోసం క‌థానాయ‌కుడు ప‌డే పాట్ల‌తో స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. అవి సాగుతున్న‌ట్టే ఉంటాయి త‌ప్ప పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. వాస్తు ప్ర‌కారం సాగే ఫైట్ కాస్త కొత్త‌గా ఉంటుంది. ఇందు పాత్ర రాక త‌ర్వాత కూడా స‌న్నివేశాలు పెద్ద‌గా పండ‌లేదు. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలే సినిమాని కాస్త ఆస‌క్తికరంగా మార్చాయి. అక్క‌డ మ‌లుపు ఊహించేదే అయినా, ద్వితీయార్ధంపై అంచ‌నాలు పెంచుతాయి.  అమెరికా నేప‌థ్యంలో సాగే ద్వితీయార్ధంలోని  చాలా స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇందు థీసిస్ ప్ర‌సంగం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపించినా, ప‌తాక స‌న్నివేశాలు  సాధార‌ణంగానే అనిపిస్తాయి. (Family Star Review) అక్క‌డ‌క్క‌డా కొంత సంఘ‌ర్ష‌ణ‌, కొన్ని మాట‌లు,  విజ‌య్ దేవ‌ర‌కొండ - మృణాల్ ఠాకూర్ జోడీ మిన‌హా సినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌రకొండ (Vijay Deverakonda) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడైన గోవ‌ర్ధ‌న్ పాత్ర‌లో ఒదిగిపోయాడు.  పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తూనే,  స్టైలిష్‌గా త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించాడు. మృణాల్ పాత్ర కూడా మెప్పిస్తుంది. ఇందు పాత్ర‌లో ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వుతూ న‌వ్విస్తూ అందంగా క‌నిపించింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర చుట్టూ పండిన భావోద్వేగాలు సినిమాకి కీల‌కం. విజ‌య్‌, మృణాల్  ఇద్ద‌రి జోడీ బాగుంది.  రోహిణి హ‌ట్టంగ‌డి పోషించిన బామ్మ పాత్ర  మిన‌హా మిగిలిన పాత్ర‌లేవీ బ‌లంగా లేవు. జ‌గ‌ప‌తిబాబు, వెన్నెల కిశోర్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులంతా అల‌వాటైన పాత్ర‌ల్లో అక్క‌డ‌క్క‌డా క‌నిపించి వెళ్లిపోతుంటారు. మ‌రో క‌థానాయిక దివ్యాంశ కౌశిక్  కాసేపు క‌నిపించి ఆ త‌ర్వాత ఆ పాత్ర జాడే ఉండ‌దు. ప‌తాక స‌న్నివేశాలతో విల‌న్ వ‌చ్చినా, పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒక‌రిలాగే ఆ పాత్ర మిగిలిపోతుంది త‌ప్ప ప్ర‌భావం చూపించ‌లేదు.

  • బ‌లాలు
  • + విజ‌య్, మృణాల్ జోడీ
  • + విరామానికి ముందు సన్నివేశాలు
  • + కొన్ని సంభాషణలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు, హాస్యం
  • చివ‌రిగా: ఫ్యామిలీ ‘స్టార్‌’.. కొన్ని మెరుపులే..! (Family Star Review telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని