Haddi Review: రివ్యూ: హడ్డి.. ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నవాజుద్దీన్‌ మెప్పించారా?

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కొత్త చిత్రం ‘హడ్డి’. ఓటీటీ ‘జీ 5’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? 

Published : 07 Sep 2023 16:59 IST

చిత్రం: హడ్డి; తారాగణం: నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అనురాగ్‌ కశ్యప్‌; మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌, ఇళా అరుణ్‌, సౌరభ్‌ సచ్‌దేవ తదితరులు; కూర్పు: తాన్యా ఛబ్రియా; సంగీతం: రోహన్‌ ద్వయం; ఛాయాగ్రహణం: పీయూష్‌, జయ్‌ ఓఝా; రచన: అక్షత్‌ అజయ్‌ శర్మ, అదమ్య భళ్లా; నిర్మాతలు: రాధికా నంద, సంజయ్‌ సాహా, జీ స్టూడియోస్‌; దర్శకత్వం: అక్షత్‌ అజయ్‌ శర్మ; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: జీ 5.

వైవిధ్య పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నటుల్లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) ఒకరు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు ‘హడ్డి’ (Haddi)గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్షత్‌ అజయ్‌ శర్మ (Akshat Ajay Sharma) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీ ‘జీ 5’ (Zee5)లో గురువారం విడుదలైంది. ఈ సినిమా నేపథ్యమేంటి? ఇందులో నవాజుద్దీన్‌ నటన ఎలా ఉంది? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Haddi Review)..

ఇదీ కథ: ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగరాజ్​కు చెందిన హడ్డి (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ)కి మహిళగా మారాలనేది కోరిక. ఈ మేరకు సర్జరీ చేయించుకుని హారికగా మారతాడు. ఇదంతా.. ట్రాన్స్‌జెండర్లకు ఆశ్రయం కల్పించే రేవతి (ఇళా అరుణ్‌) (Ila Arun) ఆధ్వర్యంలో జరుగుతుంది. రేవతితో నివాసం ఉండే హారిక.. ఇర్ఫాన్‌ (మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌) అనే వ్యక్తి ప్రేమలో పడుతుంది. ఓరోజు ‘నిన్ను పెళ్లి చేసుకుంటా’ అని ఇర్ఫాన్‌ హారికకు చెప్తాడు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని హారిక అతడికి కొంత సమయం ఇస్తుంది. మరోవైపు, రాజకీయ నాయకుడిగా చెలామణి అయ్యే గ్యాంగ్‌స్టర్‌ ప్రమోద్‌ అహ్లావత్‌ (అనురాగ్‌ కశ్యప్‌) (Anurag Kashyap) రేవతిని హత్య చేస్తాడు. అన్నీ తానే అని అనుకున్న రేవతి హత్యకు గురికావడంతో ప్రమోద్‌పై హారిక పగ పెంచుకుంటుంది. మరి, తనకు జరిగిన అన్యాయానికి ప్రమోద్‌పై హారిక రివెంజ్‌ ఎలా తీర్చుకుంది? అసలు రేవతి, ప్రమోద్‌కు ఉన్న గొడవేంటి? హారిక- ఇర్ఫాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (Haddi Review).

ఎలా ఉందంటే: ఇదొక రివెంజ్‌ స్టోరీ అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి నేపథ్యం ప్రేక్షకులకు కొత్తేమీకాదుగానీ ట్రాన్స్‌జెండర్‌ బ్యాక్‌డ్రాప్‌ను ముడిపెట్టడం కాస్త ఆసక్తికరం. ప్రారంభ సన్నివేశాలతో దర్శకుడు ప్రేక్షకుడిలో ఉత్సుకత రేకెత్తించినా ముందుకెళ్లే కొద్దీ నిరాశే ఎదురవుతుంది. ప్రయాగరాజ్‌లో మొదలైన కథ.. కొన్ని క్షణాల్లోనే నోయిడాకు చేరుకుంటుంది. ఈ క్రమంలో తన సన్నిహితుడినే హడ్డి మర్డర్‌ చేయడం షాక్‌ కలిగిస్తుంది. హడ్డి ఎందుకు అలా చేశాడు? వారి మధ్య ఏం జరిగి ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే దర్శకుడు కథను మలుపు తిప్పారు. ఓ వ్యక్తికి సాయం చేసి హడ్డి ఊహించని సమస్యల్లో చిక్కుకోవడం టర్నింగ్‌ పాయింట్‌. అక్కడ హడ్డి ఎదుర్కొన్న సవాళ్లు, ప్రమోద్‌ అహ్లావత్‌గా అనురాగ్‌ కశ్యప్‌ ఎంట్రీ, హడ్డి ఫ్లాష్‌బ్యాక్‌ తదితర సీన్లతో ప్రథమార్ధం సాగుతుంది. ప్రస్తుత సన్నివేశాలు, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను ఒకే ట్రాక్‌లో చూపించడంతో ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌కు గురయ్యే పరిస్థితి నెలకొంది (Haddi Review).

హడ్డి.. అమ్మాయిగా మారాలనుకోవడానికి గల కారణం చెప్పకుండా, అతడి కుటుంబ నేపథ్యాన్ని పెద్దగా ప్రస్తావించకుండా అనవసరమైన అంశాలపైనే దర్శక, రచయితలు ఎక్కువగా దృష్టి పెట్టారనిపిస్తుంది. కీలకమైన ప్రమోద్‌ పాత్ర బ్యాక్‌గ్రౌండ్‌నూ పూర్తిగా చూపించలేదు. ద్వితీయార్ధం.. పెళ్లిపై హడ్డి- ఇర్ఫాన్‌ మధ్య సాగే చర్చ ప్రేక్షకుల హృదయాన్ని బరువెక్కిస్తుంది. నేపథ్య సంగీతం ఆ సీక్వెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రమోద్‌.. రేవతిని చంపడం నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఆ పరిణామం అనంతరం హడ్డి రచించే ప్రణాళికలు.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఇంట్రెస్ట్‌ కలిగిస్తాయి. క్లైమాక్స్‌ను ప్రేక్షకుడు తృప్తిపడేలానే తీర్చిద్దిద్దారు. ప్రస్తుతానికి ఈ సినిమా హిందీలోనే స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి (Haddi Review).

ఎవరెలా చేశారంటే: నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ట్రాన్స్‌జెండర్‌గా వేషధారణ, హావభావాల్లో తనదైన మార్క్‌ చూపించారు. ముఖ్యంగా పెళ్లి ప్రస్తావన, క్లైమాక్స్‌లో ఆయన నటన కట్టిపడేస్తుంది. నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ప్రమోద్‌గా అనురాగ్‌ కశ్యప్‌ ఆకట్టుకుంటారు. ఇళా అరుణ్‌, మహ్మద్‌ అయూబ్‌ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు. రోహన్‌ ద్వయం సమకూర్చిన బాణీలు ఫర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం ప్రభావం చూపింది. ఎడిటింగ్‌ విషయంలో తాన్యా ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. విజువల్స్‌ ఓకే. రచయితలు స్క్రీన్‌ప్లేని మరింత స్పష్టంగా రాసుకోవాల్సింది. అక్షత్‌ అజయ్‌ శర్మ టేకింగ్‌ ఫర్వాలేదనిపిస్తుంది (Haddi Review).

  • బ‌లాలు
  • + నవాజుద్దీన్‌ సిద్ధిఖీ
  • + ద్వితీయార్ధం
  • + నేపథ్య సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్రథమార్ధం
  • -  ఫ్లాష్‌బ్యాక్‌ విషయంలో స్పష్టత లోపించడం
  • చివ‌రిగా: ఈ హడ్డి రివెంజ్‌.. అంతంత మాత్రమే (Haddi Review)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని