పండ్లు అమ్ముకునే వ్యక్తిగా జీవితం మొదలు పెట్టి..

భారత సినీ ప్రపంచంలో అత్యుత్తమ నటుడు దిలీప్‌కుమార్‌. తనదైన ప్రత్యేకమైన నటనా చాతుర్యం, సంభాషణలతో ప్రేక్షకుల గుండెల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

Updated : 07 Jul 2021 11:48 IST

అత్యున్నత నటనా శిఖరం.. దిలీప్‌కుమార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సినీ ప్రపంచంలో అత్యుత్తమ నటుడు దిలీప్‌కుమార్‌. తనదైన ప్రత్యేకమైన నటనా చాతుర్యం, సంభాషణలతో ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించారు. రాజ్‌కపూర్‌, దేవానంద్‌లతో కలిసి హిందీ సినీ రంగంలో త్రిమూర్తుల్లో ఒకరిగా నిలిచారు. మెథడ్‌ యాక్టర్‌గా పేరొందిన దిలీప్‌కుమార్‌ నటనకు పాఠశాల వంటి వారు. ఏ పాత్ర నటిస్తే, ఆ పాత్ర తానే అయి, అత్యంత సహజమైన నటనను ప్రదర్శించేవారు. అలాంటి దిగ్గజ నటుడు బుధవారం తుది శ్వాస విడిచారు.  నటనలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన దిలీప్‌కుమార్‌ నటనా ప్రస్థానం పరిశీలిస్తే..

దిలీప్‌కుమార్‌గా అలా..

ఒక సందర్భంలో ప్రఖ్యాత నటి, బాంబే టాకీస్‌ యజమాని దేవికా రాణి రోడ్డుపై వెళ్తూ పండ్ల వ్యాపారం చేసే యువకుడిని చూశారు. అతడిని చూడగానే హీరో లక్షణాలు కనిపిస్తున్నాయని గ్రహించారు. వెంటనే తాను తీయబోయే సినిమాలో హీరోగా ఎంపిక చేశారు. ఆ యువకుడి పేరు మహ్మద్‌ యూసఫ్‌ఖాన్‌. అందరికీ సులువుగా ఉండే పేరు అయితే బాగుంటుందని తన చిత్ర బృందంతో చర్చించగా, అక్కడున్న వారిలో ఒకరు  ‘ప్రస్తుతం అశోక్‌కుమార్‌ సూపర్‌స్టార్‌. కొత్త నటుడి పేరు దిలీప్‌ కుమార్‌ అయితే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. అది అందరికీ నచ్చింది కూడా. అలా యూసఫ్‌ఖాన్‌ నుంచి దిలీప్‌కుమార్‌గా మారిన యువకుడు ఆ తర్వాత భారతీయ చలన చిత్ర చరిత్రలో తనదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు.. తన సినీ నట స్వరూపాన్ని సంపూర్ణంగా రూపాంతరమొందించి నటనకు నూతన నిర్వచనం ఇచ్చారు. అతనే భారత చలన చిత్ర దిగ్గజం దిలీప్‌కుమార్‌.

తొలి చిత్రం పరాజయం..!

మహ్మద్‌ యూసఫ్‌ఖాన్‌ డిసెంబరు 11, 1922న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పెషావర్‌లో కిస్కాఖవానీ బజార్‌లో జన్మించారు. అతని తండ్రి లాలా గులామ్‌ సర్వర్‌ పండ్ల వ్యాపారి. మహారాష్ట్రలో భూములు ఉండటంతో వారి కుటుంబం ముంబయికి చేరుకుంది. పుణెలో పండ్ల దుకాణం నడుపుతుండగా యూసఫ్‌ఖాన్‌ను చూసి, అతడు హీరోగా పనికొస్తాడని దేవికారాణి భావించారు. సినిమా పట్ల ఆసక్తి ఉన్నా నటుడు అవుతానని అనుకోలేదట యూసఫ్‌ఖాన్‌. కానీ, దొరికిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. 1944లో ‘జ్వార్‌ భాటా’ దిలీప్‌కుమార్‌ నట జీవితం ఆరంభమైంది. ఆ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. విమర్శకులు దిలీప్‌కుమార్‌ నటనను చీల్చి చెండాడారు.

ఆ హాలీవుడ్‌ నటుడిని స్ఫూర్తిగా తీసుకుని...

తొలి సినిమా పరాజయం పాలవడంతో దిలీప్‌కుమార్‌లో పట్టుదల పెరిగింది. నటన అంతు చూడాలని నిశ్చయించుకున్నారు. సినిమాలు చూడటమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ స్టువర్ట్‌ నటన అతనికి నచ్చింది. స్టువర్ట్‌ సంభాషణలు మామూలు మనుషులు మాట్లాడినట్లు పలుకుతారు. నాటకీయత అస్సలు ఉండదు. వీలైనంత వరకూ హావభావాలతోనే పాత్రను ప్రేక్షకులు అర్థం చేసుకునేలా చేస్తారు. దిలీప్‌కుమార్‌పై ఆ నటనాశైలి తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా తర్వాత సినిమాలు ‘జుగ్ను’, ‘మిలన్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక అప్పటి నుంచి దిలీప్‌ వెనుదిరిగి చూడలేదు. ‘షహీద్‌’, ‘నదియాకే పార్‌’ సినిమాలతో బొంబాయి సినిమా ప్రపంచంపై తనదైన ముద్ర వేయడం ప్రారంభించాడు.

మధురమైన పాటలకు కేరాఫ్‌ అడ్రస్

తాను నటించే సినిమాల్లో మధురమైన పాటలుంటాయని ప్రేక్షకులకు ఓ నమ్మకం కలిగించాడు. ‘జుగ్ను’లో ‘యహ్‌ బద్లా వఫా కా బేవఫాయీ..’ పాట మత విద్వేషాలను అధిగమించి భారత్‌-పాకిస్థాన్‌లలో విశేషంగా అలరించింది. షహీద్‌లో ‘వతన్‌ కా రాహ్‌ మే వతన్‌ కే నో జవాన్‌’ పాట దేశభక్తికి తలమానికంలాంటిది. ‘మేళా’ సినిమాలో ‘గాయేజా గీత్‌ మిలన్‌’ పాట దిలీప్‌కుమార్‌కు గుర్తింపు తెచ్చిన పాటగా నిలిచింది. 1949 ‘అందాజ్‌’ దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌ల జీవితాలను మలుపు తిప్పింది. రాజ్‌కపూర్‌ నాటకీయమైన నటన, ప్రాకృతికమైన దిలీప్‌కుమార్‌ నటన పద్ధతులను స్పష్టంగా చూపిస్తుంది ఈ సినిమా. ఇందులో దిలీప్‌కుమార్‌కు ముఖేష్‌ పాడిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. అయితే, ‘ఆర్జూ’ సినిమాలో తలత్‌ మహమూద్‌ పాడిన పాటతో ఆయన దిలీప్‌కుమార్‌ స్వరం అయ్యారు. కళ్లతో భావాలను ప్రతిబింబించే దిలీప్‌కుమార్‌ నటనకు మెత్తని వెన్నెలవంటి తలత్‌ స్వరం బంగారానికి తావి అద్దినట్లు అయింది. ‘తారానా’, ‘సంగ్‌దిల్‌’, ‘దాగ్‌’, ‘షికస్త్‌’, ‘ఫుట్‌పాత్‌’ వంటి సినిమాలతో దిలీప్‌కుమార్‌ ట్రాజెడీ కింగ్‌గా ఎదిగారు. తలక్‌ మహమూద్‌ ఆయన స్వరంగా నిలిచారు. ‘దాగ్‌’లో మంచివాడిగా మారాలనుకున్న తాగుబోతు శంకర్‌ పాత్రలో దిలీప్‌కుమార్‌ అద్భుతంగా నటించి, తమ ఉత్తమ నటకు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. దిలీప్‌కుమార్‌ది ప్రాకృతికమైన నటనా పద్ధతి కావడంతో ఆ పాత్రలు ఆయన మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. 

ట్రాజెడీల నుంచి కామెడీ వైపు

దిలీప్‌కుమార్‌ నటనా పద్ధతిని మెథడ్‌ యాక్టింగ్‌ అంటారు. ఈ పద్ధతిలో నటులు తానే ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. దాంతో పాత్ర సంవేదనలను తాను అనుభవిస్తాడు. అంటే, నిజ జీవితానికి నట జీవితానికీ తేడాను చెరిపివేసే నటనా పద్ధతి. ఇలాంటి నటన వల్ల ప్రేక్షకులకు నాటకీయమైన సినిమాలు చూస్తున్నట్లు కాకుండా, నిజజీవితాన్ని తెరపై చూస్తున్నామన్న భావన కలుగుతుంది. అందుకే దిలీప్‌కుమార్‌ ట్రాజెడీలు తెరపై అంతగా అలరించాయి. మహిళలతో విపరీతంగా కన్నీళ్లు పెట్టించి మరింతగా ఆకర్షించాయి. ఆ క్రమంలోనే ‘దీదార్‌’లో ప్రేయసి కోసం కళ్లు పొడిచేసుకున్న అమర ప్రేమికుడి పాత్రలో దిలీప్‌కుమార్‌ నటనకు అందరూ నీరజనాలు పట్టారు. దిలీప్‌కుమార్‌ మానసికంగా తీవ్రమైన నిరాశలోకి దిగజారారు. ట్రాజెడీ, వినోదాత్మక సినిమాలకు నడుమ సమతుల్యం సాధించకుండా ట్రాజెడీలే నటిస్తే, దిలీప్‌ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు సూచించారు.  దాంతో దిలీప్‌కుమార్‌ ట్రాజెడీలతో పాటు కామెడీలవైపు దృష్టి పెట్టారు. ‘ఆన్‌’ సినిమాలో రాకుమారికి బుద్ధి చెప్పి ప్రేమించే అల్లరి ప్రేమికుడిగా  ఎలా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ సినిమాలు ఎవర్‌గ్రీన్‌

‘దేవదాస్‌’లో ప్రేయసిని పొందే ధైర్యం లేక, తాగి జీవితాన్ని నాశనం చేసుకున్న పాత్రలో అంతగా జీవించాడు. ‘కోహినూర్‌’లో కొన్ని సన్నివేశాల్లో మరుపురాని హాస్యాన్ని అందించారు. ‘నయా ధౌర్‌’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రాచీన జీవన విధానం నడుమ సమతుల్యం సాధించాలనుకునే శంకర్‌ పాత్రలో అలరించి, అర్థవంతమైన సినిమాకు నిర్వచనంగా నిలిచారు. ‘యహూది’లో రొమన్‌ ప్రేమికుడిగా అద్భుతమైన నటన కనబరిచారు. ‘మధుమతి’ జన్మజన్మల ప్రేమబంధంలోని అలౌకికతను అద్వితీయంగా ప్రదర్శించారు. క్లైమాక్స్‌లో ఆయన నటన సన్నివేశాలకు గాఢతనివ్వడమే కాక, సినీ చరిత్రలో ఓ అపురూప సంఘటనగా నిలిచింది. సినీ వినీలాకాశంలో ఒక అపురూప ఘట్టం ‘మొఘల్‌ ఏ ఆజం’ ఇందులో పృథ్వీరాజ్‌ కపూర్ ఠంగున మోగే కంఠ స్వరానికి నిశ్శబ్దంలోనూ గుసగుసల సంభాషణలతో కాక, దీటుగా నిలిచి, సలీం అంటే ఇలానే ఉంటాడని నిరూపించారు.

‘గంగా జమున’లో మంచి వారు దుష్టమార్గం ఎందుకు పడతారో అద్భుతంగా చూపించి, ఎందరో ఔత్సాహిక నటులకు స్ఫూర్తిగా నిలిచారు. అమాయకుల అణచివేత వారిని ఎలా నేరస్థులుగా మారుస్తుందో చక్కటి హావభావాలతో చూపించారు. ‘దిల్‌ దియా దర్ద్‌ లియా’లో ఓ సేవకుడు యజమానిగా మారి యజమాని ఎలా ఉండాలో నేర్పించే పాత్రలో దిలీప్‌కుమార్‌ ఒదిగిన తీరు నభూతో..! ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ ద్విపాత్రాభినయం చేసి, ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించారు. ‘ఆద్మీ’లో అసూయతో రగిలి నిజం గ్రహించే ప్రేమికుడి పాత్రలో జీవించారు. ‘సగీనా’లో ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా అలరించారు. కార్మిక వర్గాలను ఆకట్టుకున్నారు.

పాట కోసం సితార సాధన

దిలీప్‌కుమార్‌ తాను నటించే సినిమాలను అతి జాగ్రత్తగా ఎంచుకునేవారు. ఏమాత్రం నచ్చకపోయినా సినిమాను వదులుకోవడానికి వెనుకాడేవారు కాదు. పాటలు, సాహిత్యం విషయంలో అస్సలు రాజీపడేవారు కాదు. ‘కోహినూర్’ సినిమాలో ‘మధువనమే రాధికా..’ పాట కోసం సితారం సాధన చేశారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే నటించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో అద్దం ముందు దిలీప్‌కుమార్‌ నటించే సన్నివేశం తర్వాత నటుడి పాపులారిటీకి పరీక్షగా ఎదిగింది. తర్వాతి కాలంలో సూపర్‌స్టార్‌లందరూ ఇలాంటి సన్నివేశాల్లో నటించారు. 1960 దశకం ఆరంభంలో ‘మొఘల్‌ ఏ ఆజం’ తర్వాత దిలీప్‌కుమార్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. షమ్మీకపూర్‌, రాజేంద్రకపూర్‌ వంటి నటులు రావడంతో సినిమా రూపురేఖలు మారాయి. దీంతో దిలీప్‌కుమార్‌ నటనను నిరూపించుకునేందుకు నిర్మాణంలోకి దిగారు. ఫలితంగా భారతీయ సినీ చరిత్రలో అపురూపం అనదగ్గ ‘గంగా జమున’ రూపొందింది. ఈ సినిమాలో దిలీప్‌కుమార్‌ నటనకు ఫిలింఫేర్‌ నామినేషన్‌ లభించింది.

సరికొత్తగా సెకండ్‌ ఇన్నింగ్స్‌

1970వ దశకం మొదలైన తర్వాత తన తోటి నటుల మాదిరిగానే అస్తిత్వ సమస్యను ఎదుర్కొనక తప్పలేదు. ఫలితంగా ఐదేళ్లు సినిమాల్లో నటించలేదు. 1981లో ‘క్రాంతి’ సినిమాతో తెరపైకి వచ్చారు దిలీప్‌కుమార్‌. ప్రత్యేక సంభాషణలతో సినిమా విలువ పెంచారు. అమితాబ్‌ ఉచ్చస్థితిలో ఉండగా, ఆయనకు దీటుగా నిలబడిన నటుడు దిలీప్‌కుమార్‌ ఒక్కడే. తనదైన నటనకు ఆస్కారం ఉన్న స్క్రిప్ట్‌లనే ఎన్నుకునేవారు. సుభాష్‌ఘాయ్‌ తెరకెక్కించిన ‘విధాత’లో షమ్మీకపూర్‌, సంజీవ్‌ కుమార్‌లతో కలిసి నటించారు. ఆ సినిమా విజయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దిలీప్‌కుమార్‌, అమితాబ్‌లతో రమేశ్‌సిప్పీ తెరకెక్కించిన ‘శక్తి’ విడుదలకు అంచనాలను పెంచింది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద వాటిని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో నటనకు గానూ దిలీప్‌కుమార్‌ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నారు. ‘కర్మ’ సినిమాలో దేశం కోసం సర్వం త్యాగం చేసే పోలీస్‌ అధికారిగా ఆయన నటన ఎంత గొప్పగా ఉందంటే.. నసీరుద్దీన్‌ షా వంటి నటుడు దిలీప్‌కుమార్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పారు.

తెలుగు సినిమా ‘బొబ్బలి బ్రహ్మన్న’ హిందీ రీమేక్‌ ‘ధర్మాధికారి’లో దిలీప్‌కుమార్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ‘ఆగ్‌ కా దరియా’, ‘ఇజ్జద్దార్‌’, ‘కానూన్‌ అప్నా అప్నా’ వంటి సినిమాల్లో తనదైన ముద్రవేశారు. దిలీప్‌కుమార్‌కు రిహార్సల్‌ అధికంగా చేసే అలవాటు ఉంది. ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేముందు వీలైనని సార్లు రిహార్సల్‌ చేసేవారు. ఇతరులకు విసుగ్గా అనిపించినా.. తన పద్ధతి తనదే అంటారు. రాజ్‌కుమార్‌ రిహార్సల్‌ చేయరు. స్వతహాగా నటిస్తారు. అలాంటి ఇద్దరి దిగ్గజాలను ఒకే వేదిపైకి తీసుకొచ్చి, ‘సౌధాఘర్‌’ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాడు సుభాష్‌ఘాయ్‌. ‘మషాల్‌’లో భార్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో సహాయం అర్థించే వ్యక్తి పాత్రలో దిలీప్‌కుమార్‌ నటన ఆ సినిమాకే హైలైట్‌. యువ నటులకు పాఠాలు నేర్పుతుంది. చివరి సినిమా ‘ఖిలా’లో ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించకూడదని నిశ్చయించుకున్నారు.

వివాదాలకు ఎప్పుడూ దూరమే..!

దిలీప్‌కుమార్‌ దర్శకత్వం చేయాల్సిన ‘కళింగ’ సినిమా అసంపూర్తిగా మిగిలిపోయింది. నటుడిగా దిలీప్‌కుమార్‌ హిందీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సినీ నిర్మాణ విషయంలో రాజీపడేవారు కాదు. రాజ్‌కపూర్‌, దేవానంద్‌లో చక్కని స్నేహం ఉండేది. నౌషాద్‌, మహ్మద్‌ రఫీ ఒకరు తన ఆత్మ సంగీతం, మరొకరు తన ఆత్మ స్వరం అని ప్రకటించారు. ఇక తనతో కలిసి నటించిన నటీమణులతో కామినీ కౌశల్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ, వారు వివాహం చేసుకోలేదు. మధుబాలతో ప్రణయం జగత్‌ విదితం. అదీ సఫలం కాలేదు. ‘గంగాజమున’, ‘నయా దౌర్‌’, ‘లీడర్‌’ వంటి సినిమాల్లో నాయికగా నటించిన వైజయంతీమాలతో సన్నిహితంగా ఉండేవారు. అదీ సఫలం కాలేదు. దాంతో తన కన్నా 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును 1966లో 44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకి సంతానం లేదు. నటుడు, నిర్మాతగానే కాకుండా రాజ్యసభ సభ్యుడిగానూ నామినేట్‌ అయ్యారు. నిజ జీవితంలో వివాదాలు, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను పెద్దగా పంచుకోరు. ‘ది సబ్‌స్టాన్స్‌ అండ్‌ అది షాడో’ పుస్తకం ద్వారా తన జీవిత చరిత్రను ఆవిష్కరించారు. హిందీ సినిమాను అధ్యయనం చేయాలనుకునేవారికి, దిలీప్‌కుమార్‌ స్వీయ చరిత్ర ఒక పాఠ్య పుస్తకంలాంటిది.

భారత చలన చిత్ర పరిశ్రమకు దిలీప్‌కుమార్‌ అందించిన మరుపురాని సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. దిలీప్‌కుమార్‌ కన్నుమూతతో భారతీయ సినీ పరిశ్రమలో అజరామరమైన ఒక శకం ముగిసింది. ప్రపంచస్థాయి మెథడిక్‌ యాక్టర్‌ను సినీ పరిశ్రమ కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని