Hi Nanna review: రివ్యూ: హాయ్‌ నాన్న.. నాని ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

Hi Nanna review in telugu: నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా?

Updated : 07 Dec 2023 07:53 IST

Hi Nanna review: చిత్రం: హాయ్‌ నాన్న; నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు; సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్ ఆంటోనీ; నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌.; రచన, దర్శకత్వం: శౌర్యువ్; సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌; విడుదల: 07-12-2023

సినిమా సినిమాకీ సంబంధం లేకుండా... ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా క‌థ‌ల్ని ఎంచుకుంటూ ప్ర‌యాణం చేస్తున్న క‌థానాయ‌కుడు నాని (Nani). ద‌స‌రాతో మాస్ అవ‌తారాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ వెంట‌నే అందుకు పూర్తి భిన్న‌మైన ఓ తండ్రీ కూతురు క‌థ‌ని ఎంచుకుని ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చేశారు. కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయడంలో ముందుండే నాని... మ‌రోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో  ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే  నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. (Hi Nanna review in telugu) మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా?

క‌థేంటంటే: విరాజ్ (నాని) ముంబైలో ఓ  ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. పుట్టిన‌ప్ప‌టి నుంచే జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న త‌న కూతురు మ‌హి (కియారా)నే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. కూతురికి స‌ర‌దాగా క‌థ‌లు చెప్ప‌డం విరాజ్‌కి అల‌వాటు. ఆ క‌థ‌ల్లో హీరోగా నాన్న‌ని ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు అమ్మ క‌థ చెప్ప‌మ‌ని అడుగుతుంది మ‌హి. నువ్వు  క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే చెబుతానంటాడు. అమ్మ క‌థ కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివి క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తుంది. అయినా మ‌హికి త‌న అమ్మ క‌థని చెప్ప‌డు విరాజ్‌. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. రోడ్డుపై ప్ర‌మాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది య‌ష్న (మృణాల్ ఠాకూర్‌). ఆ త‌ర్వాత ఇద్ద‌రూ స్నేహితులు అవుతారు. త‌న కూతురుని వెదుకుతూ వ‌చ్చిన విరాజ్‌కి  యష్నతో క‌లిసి ఓ కాఫీ షాప్‌లో క‌నిపిస్తుంది. అక్క‌డే విరాజ్.... మ‌హికి త‌న అమ్మ క‌థ‌ని చెబుతాడు. ఈసారి క‌థ‌లో త‌న అమ్మ వ‌ర్ష పాత్ర‌ని యష్నలో ఊహించుకుంటుంది మ‌హి. ఇంత‌కీ ఆ వ‌ర్ష ఎవ‌రు? కూతురు  మ‌హిని వ‌దిలి దూరంగా ఎందుకు ఉంది?యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి?పెళ్లి నిశ్చ‌య‌మైన యష్న... విరాజ్‌ని ఎలా ప్రేమించింది?ఆ ప్రేమ నిల‌బ‌డిందా?(Hi Nanna review in telugu) చిన్నారి త‌న త‌ల్లి చెంత‌కి చేరిందా లేదా?త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: అమ్మానాన్న‌ల ప్రేమ‌క‌థ ఇది. ఈ నేప‌థ్యంలో సాగే క‌థ‌లు తెలుగు సినిమాకి కొత్తేం కాదు. కానీ, ఇందులోని ప్రేమ‌క‌థ‌లో మ‌లుపులు కొత్త‌గా ఉంటాయి. హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాలు బ‌లంగా నిలుస్తాయి. చిన్నారి త‌న అమ్మ‌గా క‌థానాయిక‌ని ఊహించుకోవ‌డం మొద‌లైన‌ప్ప‌టి నుంచే ఈ క‌థ ఏ దిశ‌గా సాగుతుందో ప్రేక్ష‌కుడు ఓ అంచ‌నాకి వ‌స్తాడు. అయినా స‌రే స‌న్నివేశాలు ఓ ప్రేమ‌క‌థ‌కి కావ‌ల్సిన సంఘ‌ర్ష‌ణ‌ని పండిస్తాయి. మ‌లుపులు, భావోద్వేగాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ‌తాయి. అయితే ఇందులో ఆవిష్క‌రించిన ప్రేమ‌లోనే బ‌లం త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. నిజానికి రెండు ప్రేమ‌క‌థ‌లు ఇందులో ఉంటాయి. విరాజ్ - వ‌ర్ష క‌థ ఒక‌టి, విరాజ్ - యష్న క‌థ మ‌రొక‌టి. ఆ రెండు ప్రేమ‌ల్లో క‌నిపించాల్సిన మేజిక్, జంట మ‌ధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో లేక‌పోవడంతో  ప్ర‌థ‌మార్ధం కాస్త నిదానంగా సాగుతుంది. ప్రేమ‌లో పడ‌టం, విడిపోవ‌డం వంటివి  సాధార‌ణంగానే అనిపిస్తాయి త‌ప్ప పెద్ద‌గా అనుభూతిని పంచ‌వు. వ‌ర్ష క‌థ విని య‌శ్న‌ విరాజ్‌తో ప్రేమ‌లో ప‌డటం, ఆ త‌ర్వాత మ‌హి ఎవ‌రి కూతురు అనే మ‌లుపు సినిమాని ఆస‌క్తిక‌రంగా మార్చాయి. ద్వితీయార్ధంలో పండే  భావోద్వేగాల‌తో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు క‌థ‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు.

తండ్రీ కూతుళ్ల పాత్ర‌లు ఆ ఇద్దరి నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. ప్ర‌థ‌మార్ధంలో ‘ఇక్క‌డ్నుంచి  వెళ్లిపోదాం నాన్న’  అని చిన్నారి చెప్ప‌డం, ద్వితీయార్ధంలో నువ్వు నిజ‌మైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి క‌థానాయిక‌తో చెప్ప‌డం, ‘ఎక్క‌డ త‌ప్పు చేశాను నా ప్రేమ స‌రిపోవ‌డం లేదా’ అని చిన్నారితో విరాజ్‌ చెప్పే సంద‌ర్భాలు ప‌తాక స్థాయి భావోద్వేగాల్ని పండిస్తాయి. చివ‌రిలో జ‌యరామ్ పాత్రతో మ‌రో ప్ర‌ధాన మ‌లుపు కీల‌కం. నాయ‌కానాయిక‌లు ఎలా ఒక్క‌ట‌వుతార‌నే ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు జ‌య‌రామ్ పాత్ర‌తో య‌శ్న‌కి నిజం చెప్పిస్తారా?లేదా అనే అనుమానాలు త‌లెత్తుతాయి. అలా చేసుంటే ఈ సినిమా సాధార‌ణంగా మారిపోయేది. (Hi Nanna review in telugu) ‘వ‌ర్ష డివోర్స్ అడిగిందేమో.. నేను కాదు’ అంటూ యష్న త‌న ప్రేమ‌ని నిల‌బెట్టుకోవ‌డం ఈ సినిమాకి హైలైట్. ఊహ‌కు అందే క‌థ‌, అక్క‌డ‌క్క‌డా నిదానంగా సాగే స‌న్నివేశాలున్నా  కుటుంబ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డే ఈ త‌ర‌హా భావోద్వేగాల‌తో  సినిమాలు ఈమ‌ధ్య కాలంలో  రాలేదు.  టార్గెట్ ప్రేక్ష‌కులకి వినోదం పంచ‌డంలో మాత్రం ఈ సినిమా  విజ‌య‌వంతం అవుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: నాని మ‌రోసారి త‌న న‌ట‌న‌తో హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగున్నా... ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌క‌థ‌కి త‌గ్గ కెమిస్ట్రీ జస్ట్‌ ఒకే. కానీ, ఇద్ద‌రూ మాత్రం చాలా బాగా న‌టించారు. (Hi Nanna review in telugu) మృణాల్ ప్రేమ స‌న్నివేశాల్లోనూ,  ప్రీ క్లైమాక్స్‌లోనూ త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ, కంటత‌డి పెట్టించింది.  ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్  త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ హాయైన స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. సాను జాన్ వ‌ర్గీస్ విజువ‌ల్స్‌, హేష‌మ్ సంగీతం ప్రేక్ష‌కుల్ని వెంటాడుతాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు ప‌ర్‌ఫెక్ట్ అనిపించేలా కుదిరాయి.  ద‌ర్శ‌కుడు శౌర్యువ్‌కి ఇదే తొలి సినిమా అయినా ఎంతో స్ప‌ష్ట‌త‌తో, ప‌రిణ‌తితో  సినిమాని తెరకెక్కించాడు. తెలిసిన క‌థ‌నే  కొత్తగా భావోద్వేగాల్ని మేళ‌వించి చెప్పే  ప్ర‌య‌త్నం చేశాడు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ‌లోని భావోద్వేగాలు, మ‌లుపులు
  • +  నాని, మృణాల్‌, బేబి కియారా న‌ట‌న
  • +  సంగీతం, విజువ‌ల్స్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నిదానంగా సాగే ప్ర‌థ‌మార్ధం
  • ఊహ‌కు అందే క‌థ
  • చివ‌రిగా... హాయ్ నాన్న...  హృద‌యాల్ని హ‌త్తుకుంటాడు.(Hi Nanna review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని