Indian Police Force Review: వెబ్‌సిరీస్‌ రివ్యూ: ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌

Indian Police Force Review; సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి కుంద్రా, వివేక్‌ ఒబెరాయ్ కీలక పాత్రల్లో రోహిత్‌శెట్టి రూపొందించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌’ ఎలా ఉందంటే?

Updated : 19 Jan 2024 17:42 IST

Indian Police Force Review; వెబ్‌సిరీస్‌: ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌; నటీనటులు: సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి కుంద్రా, వివేక్‌ ఒబెరాయ్‌, ఇషా తల్వార్‌, విభూతి ఠాకూర్‌, నిఖితన్‌ ధీర్‌, శ్వేతా తివారీ, శరద్‌ ఖేల్కర్‌ తదితరులు; సంగీతం: లీజో జార్జ్‌-డీజే చేతల్‌; సినిమాటోగ్రఫీ: గిరీష్‌ కాంత్‌, రాజా మెహతా; నిర్మాణం: రోహిత్‌శెట్టి పిక్చర్జ్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌; రచన, దర్శకత్వం: రోహిత్ శెట్టి; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ప్రైమ్‌ వీడియో

భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక పోలీసు కథలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రస్తుత ఓటీటీల కాలం నడుస్తున్న నేపథ్యంలో వెబ్‌సిరీస్‌ల ద్వారా మరింత విస్తృతంగా ఈ కథలు రూపొందుతున్నాయి. బాలీవుడ్‌లో పోలీస్‌ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్‌శెట్టి సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’. (indian police force review) అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది?

కథేంటంటే: దిల్లీ పోలీస్‌ రైజింగ్‌ డే రోజున రాజధాని నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 240 మంది అమాయకులు బలైపోతారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఇండియన్ ముజాహిదీన్‌ ప్రకటిస్తుంది. ఈ కేసును విచారించేందుకు దిల్లీ పోలీసు అధికారులైన సీపీ విక్రమ్‌ బక్షి (వివేక్‌ ఒబెరాయ్‌), డీసీపీ కబీర్‌ మాలిక్‌ (సిద్ధార్థ్‌ మల్హోత్ర), గుజరాత్‌ ఏటీసీ చీఫ్‌ తార (శిల్పాశెట్టి కుంద్రా)లు రంగంలోకి దిగుతారు. ఇంతకీ ఈ పేలుళ్ల వెనక ఉన్నది ఎవరు?అందుకు కారణం ఏంటి? జర్దార్‌ అలియాస్‌ హైదర్‌ (మయాంక్‌)కు జైపూర్‌, గోవాలో జరిగిన పేలుళ్లకూ ఉన్న సంబంధం ఏంటి? దిల్లీ పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సూర్య నటించిన తమిళ ‘సింగమ్‌’ పోలీస్‌ కథను బాలీవుడ్‌ ప్రేక్షకులకు సరికొత్తగా ప్రజెంట్‌ చేసి, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు రోహిత్‌శెట్టి. ఆ పంథాను కొనసాగిస్తూ ‘సింగం రిటర్న్స్‌’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ వంటి పోలీసు కథలను తీసి, తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో వెబ్‌సిరీస్‌ వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే, ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయింది ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’. (Indian police force review in telugu) సిరీస్‌ చూస్తున్నంత సేపు కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు సరికదా..  పాత కథలను తీసుకుని, అటు తిప్పి, ఇటు తిప్పి కొత్త నటులతో చూపిన భావన కలుగుతుంది.

నగరంలో పలు చోట్ల బాంబులు పేలిన సన్నివేశాలతో నేరుగా కథ మొదలవుతుంది. దక్షిణాది చిత్రాల్లో హీరోల పాత్రల బలాన్ని పరిచయం చేసేందుకు వాడుకునే ఫార్ములానే దర్శకుడు వెబ్‌సిరీస్‌లోనూ వాడాడు. అటు విక్రమ్‌ బక్షి, ఇటు కబీర్‌ మాలిక్‌లకు చెరో ఎలివేషన్‌ సీన్‌ ఇచ్చి, వీళ్లు ఎంతకైనా తెగిస్తారన్నట్లు చూపించాడు. అక్కడి నుంచి కథ ఏమైనా కొత్త పంథాలో నడుస్తుందా? అంటే అదీ లేదు. ఒక రొటీన్‌ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ సాగుతూ......... ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించినట్లు నిందితుల స్కెచ్‌లు వేయడం, సీసీటీవీ ఫుటేజ్‌లు, మొబైల్‌ నంబర్‌ ట్రేసింగ్‌ వంటి వాటితో ఉగ్రముఠా దాగి ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టడం తదితర సన్నివేశాలతో సిరీస్‌ నడుస్తుంది. దీనికి తోడు, మధ్యలో ప్రధాన పాత్రల ఫ్యామిలీ లైఫ్‌, హైదర్‌ ప్రేమాయణం చూపిస్తూ అసలు పాయింట్‌ను పక్కదారి పట్టించాడు. పైగా వెబ్‌సిరీస్‌లో మాంటేజ్‌ సాంగ్‌ల ఆలోచన వచ్చినందుకు దర్శకుడికి నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాలి. దిల్లీ తరహాలో జైపూర్‌లోనూ బాంబు పేలుళ్లు జరిగిన తర్వాతే మళ్లీ కథ ట్రాక్‌ ఎక్కుతుంది. అక్కడి నుంచి ఈ దారుణాలకు ఒడిగడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు గోవా వెళ్లడం, ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతాయి. అసలు నిందితుడు ఎవరో తెలిసిన తర్వాత వచ్చే ఒకట్రెండు భావోద్వేగ సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. చివరి ఎపిసోడ్‌లోనైనా ట్విస్ట్‌లు ఉంటాయనుకుంటే అవి కూడా లేకుండానే సిరీస్ ముగుస్తుంది. మరొక విషయం ఈ సిరీస్‌కు కొనసాగింపు కూడా ఉంది.

ఎవరెలా చేశారంటే: తమకు ఇచ్చిన పోలీసు అధికారుల పాత్రలకు సిద్ధార్థ్ మల్హోత్ర, వివేక్‌ ఒబెరాయ్‌, శిల్పాశెట్టి న్యాయం చేశారు. మయాంక్‌కు జరార్‌లాంటి వైవిధ్యమైన పాత్ర దక్కినా, ఆ ముఖంలో క్రూరత్వం ఏమాత్రం కనిపించలేదు. ముఖేష్‌ రుషి, నికితిన్‌ ధీర్‌, వైదేహి తదితరులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ ఓకే. టెక్నికల్‌ టీమ్‌ పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. వివిధ భాషల్లో ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన ఒక రొటీన్‌ పోలీస్‌ డ్రామాను దర్శకుడు రోహిత్‌ శెట్టి మళ్లీ వెబ్‌సిరీస్‌గా ఎందుకు తీయాలనుకున్నారో ఆయనకే తెలియాలి.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. పోలీస్‌ కథలు, వాటిలో యాక్షన్‌ ఇష్టపడే ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’పై లుక్‌ వేయొచ్చు. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + నటీనటులు
  • + యాక్షన్‌ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ, కథనాలు
  • - దర్శకత్వం
  • - నిడివి
  • చివరిగా: బోరింగ్‌ ఫోర్స్‌.. (indian police force review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని