Japan Movie Review: రివ్యూ: జపాన్‌. కార్తి కొత్త చిత్రం మెప్పించిందా?

Japan Movie Review: రాజు మురుగ‌న్‌ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా నటించిన 25వ చిత్రం ఎలా ఉంది?

Published : 10 Nov 2023 13:36 IST

Japan Movie Review; రివ్యూ: జ‌పాన్‌; న‌టీన‌టులు: కార్తి, అను ఇమ్మానుయేల్, సునీల్‌, విజ‌య్ మిల్ట‌న్‌, జిత‌న్ ర‌మేశ్ త‌దిత‌రులు; సినిమాటోగ్రఫీ: ఎస్.రవి వర్మన్; సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్; ఎడిటింగ్‌: ఫిలోమిన్ రాజ్; పాట‌లు: భాస్క‌రభ‌ట్ల ర‌వికుమార్‌, రాకేందు మౌళి వెన్నెల‌కంటి; పోరాటాలు: అన‌ల్  అరసు; ప్రొడక్షన్ డిజైన్‌: వినేష్ బంగ్లాన్; నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు, ద‌ర్శ‌క‌త్వం: రాజు మురుగ‌న్‌; సంస్థ‌: డ్రీమ్‌ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌; విడుద‌ల‌: 10-11-2023; విడుద‌ల సంస్థ‌: అన్న‌పూర్ణ స్టూడియోస్‌

క‌థానాయ‌కుడు కార్తి కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి చిత్రం ‘జ‌పాన్‌’(Japan). ఆయ‌నకి ఇది 25వ సినిమా. తెలుగులో బ‌ల‌మైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కార్తి(Karthi) సినిమా అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. ఆ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతూ సంద‌డి చేశాయి ప్ర‌చార చిత్రాలు. డ‌బ్బు దోపిడీ నేప‌థ్యం... త‌మిళ‌నాడులోని ఓ నిజ‌మైన దొంగ క‌థ‌గా ప్ర‌చార‌మైన ఈ సినిమా ఎలా ఉంది? (Japan Movie Review)కార్తి కెరీర్‌లో మైలురాయిలా నిలిచిందా?

కథేంటంటే: జపాన్ ముని (కార్తి) ఓ పేరు మోసిన దొంగ‌. దోపిడీకి వ్యూహం ప‌న్నాడంటే గురి త‌ప్ప‌దంతే. పోలీసుల్ని సైతం ఎదిరించి అనుకున్న‌ది కాజేస్తాడు. ఓ దోపిడీలో పాల్గొన్న‌ప్పుడు పోలీస్ అధికారుల‌కి చెందిన కొన్ని ర‌హ‌స్య‌ వీడియోలు చేతికి దొరుకుతాయి. వాటిని త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న జ‌పాన్ పోలీసుల‌కి టార్గెట్‌గా మార‌తాడు. ఎలాగైనా ఆ వీడియోల్ని సొంతం చేసుకుని జ‌పాన్‌ని మ‌ట్టుబెట్టాల‌ని పోలీస్ అధికారులు శ్రీధ‌ర్ (సునీల్‌), భ‌వాని (విజ‌య్ మిల్ట‌న్‌) రంగంలోకి దిగుతారు. మ‌రోవైపు క‌ర్ణాట‌క పోలీసులు కూడా జ‌పాన్‌ని వెంబ‌డిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఓ నగల దుకాణంలో రూ.200 కోట్లు విలువ చేసే న‌గ‌లు దోపిడీకి గుర‌వుతాయి. ఆ దొంగ‌త‌నం జపాన్ చేశాడ‌ని పోలీసుల‌కి ఆధారాలు దొరుకుతాయి. అయినా స‌రే, ఓ అమాయ‌కుడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎవ‌రు చేశారు? జ‌పాన్ దొరికాడా? ఆ అమాయ‌కుడు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా?(Japan Movie Review in telugu) అస‌లు జపాన్ ఎలా దొంగ‌గా మారాడు?సినీ న‌టి సంజు (అను ఇమ్మానుయేల్‌)తో జ‌పాన్‌కి ఉన్న బంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:  మ‌నీ హెయిస్ట్‌ (దోపిడీ) నేప‌థ్యంలో సాగే సినిమాల‌కి ఉండే క్రేజ్ వేరు. వీటికి అన్ని భాష‌ల్లోనూ ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఉన్నారు. అడుగ‌డుగునా ఆస‌క్తి రేకెత్తించే ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని థ్రిల్‌ని చేస్తుంటాయి. హీరోయిజాన్ని మ‌రోస్థాయిలో ఆవిష్క‌రిస్తుంటాయి. అలా కార్తి చేసిన మ‌నీ హెయిస్ట్‌ సినిమానే... ‘జ‌పాన్‌’. ఇందులో కార్తి మార్క్ హాస్యం, విభిన్న‌మైన నేప‌థ్యం, పాత్ర ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ద‌ర్శ‌కుడు. త‌ల్లి సెంటిమెంట్ అంశాల్నీ జోడించారు. మేళ‌వింపు వ‌ర‌కూ బాగానే ఉంది కానీ... క‌థ‌ని న‌డిపిన విధానంలోనే స‌మ‌స్య‌లున్నాయి. సీరియ‌ల్ సెంటిమెంట్‌, క్రింజ్ అంటూ ఇందులో చాలా చోట్ల క‌థానాయ‌కుడు వ్యంగ్యంగా సంభాష‌ణ‌లు చెబుతాడు. ఆ మాట‌ల‌కి త‌గ్గ‌ట్టే ఇందులో కొన్ని స‌న్నివేశాలు మ‌రీ బ‌ల‌వంత‌పు డ్రామాతోనూ, కొన్ని  స్ప‌ష్ట‌త లేన‌ట్టుగా సాగుతాయి. క్రేజీగా అనిపించే జ‌పాన్ పాత్ర‌, న‌డ‌వ‌డిక అక్క‌డ‌క్క‌డా న‌వ్వించినా చాలా స‌న్నివేశాలు నిరాస‌క్తంగా సాగుతాయి. న‌గ‌ల దుకాణంలో దోపిడీ నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. దోపిడీ జ‌రిగిన చోట ఆధారాలు సేక‌రించ‌డం, ఆ క్ర‌మంలో  న‌గ‌లు త‌యారు చేసే దుకాణాల ద‌గ్గ‌ర డ్రైనేజీలో క‌లిసే వ్య‌ర్థాల నుంచి బంగారం సేక‌రించి పొట్ట పోసుకునే జీవితాల్ని చూపించ‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది.

జ‌పాన్ పాత్ర రాక‌తో క‌థకి మ‌రింత ఊపు వ‌స్తుంది. గోల్డెన్ స్టార్‌గా (Japan Movie Review) జ‌పాన్ సినిమాతో చేసే హంగామా న‌వ్విస్తుంది. జ‌పాన్ జ‌ల్సా జీవితం, హీరోయిన్‌తో ప్రేమ నేప‌థ్యంతో స‌న్నివేశాలు సాగుతాయి. మ‌రోవైపు స‌మాంత‌రంగా కేసులో ఇరుక్కుపోయిన  ఓ అమాయ‌కుడి జీవితాన్ని చూపిస్తూ క‌థ‌ని ముందుకు న‌డిపించారు. విరామ స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. సింహం ముసుగులో న‌క్క ఉందన్న అంశ‌మే ప్ర‌ధానంగా ద్వితీయార్ధం మొద‌ల‌వుతుంది. అయితే ఆ న‌క్క ఎవ‌ర‌నే విష‌యం బ‌హిర్గ‌త‌మ‌య్యే తీరు పేల‌వంగా ఉంటుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధానబ‌లం. మ‌న‌సుల‌కి హ‌త్త‌కునేలా  ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఈ క‌థ‌లో హెచ్‌.ఐ.వి ప్ర‌స్తావ‌న ఎందుకో అర్థం కాదు. ఆ నేప‌థ్యం క‌థపైనా, డ్రామాపైన పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు. (Japan Movie Review) హెచ్‌.ఐ.వి ప్ర‌స్తావ‌న లేక‌పోయుంటే ప‌తాక స‌న్నివేశాల్లో  క‌థానాయ‌కుడి పాత్ర మ‌రింత ప్ర‌భావం చూపించేదేమో. మొత్తంగా అక్క‌డ‌క్క‌డా అల‌రించే కొన్ని స‌న్నివేశాలు, క‌థానాయ‌కుడి పాత్ర చేసే హంగామా మిన‌హా సినిమా పెద్ద‌గా మెప్పించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: జ‌పాన్... మేడ్ ఇన్ ఇండియా అంటూ క‌థానాయ‌కుడు కార్తి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న డైలాగ్ డిక్ష‌న్‌తో చాలా చోట్ల హాస్యం పండుతుంది. జపాన్  గెట‌ప్ కూడా కొత్త‌గా ఉంటుంది.  (Japan Movie Review) కార్తి ఇందులో గ‌త చిత్రాల‌కంటే కొత్త‌గా క‌నిపిస్తారు. అను ఇమ్మానుయేల్ పాత్ర‌లో బ‌లం లేదు. సినిమాలో ఆమె గాలిలో తేలియాడిన‌ట్టుగానే ఉంటుంది ఆ పాత్ర‌.  ఆరంభం, ముగింపు అంటూ లేకుండా అర్ధాంత‌రంగా వ‌చ్చి, ఆ త‌ర్వాత మాయ‌మైపోతుంది. ఇందులోని చాలా పాత్ర‌లు అనుకోకుండా వ‌చ్చి మాయ‌మైపోతుంటాయి. సునీల్ కీల‌కమైన పాత్ర‌లో క‌నిపిస్తారు.  ఆయ‌న గెటప్‌లో మాత్రం స‌హ‌జ‌త్వం లోపించింది. విజ‌య్ మిల్ట‌న్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ర‌వివ‌ర్మ‌న్ విజువ‌ల్స్ సినిమాకి కొత్త క‌ల‌ర్‌ని తీసుకొచ్చింది. జీవీ ప్ర‌కాశ్‌కుమార్ సంగీతం బాగుంది. రాజు మురుగ‌న్ ర‌చ‌న‌లో బ‌లం ఉన్నా... కార్తి ఇమేజ్ ప్ర‌భావం ఆయ‌న‌పై  ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. స‌న్నివేశాల్లో వేగం లేదు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + కార్తి న‌ట‌న
  • + అక్క‌డ‌క్క‌డా హాస్యం
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆస‌క్తి రేకెత్తించని క‌థ‌, క‌థ‌నం
  • - గంద‌ర‌గోళంగా కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా: జ‌పాన్‌... అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తాడంతే!  (Japan Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని