Jawan Movie Review | రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Jawan movie review in telugu: షారుక్‌ఖాన్‌, నయనతార జంటగా, అట్లీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జవాన్‌’ ఎలా ఉందంటే?

Updated : 07 Sep 2023 13:55 IST

Jawan movie review; చిత్రం: జవాన్‌; నటీనటులు: షారుక్‌ ఖాన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు; ఎడిటింగ్‌: రుబెన్‌; నిర్మాతలు: గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ; స్క్రీన్‌ప్లే: రమణ గిరివసన్‌; కథ, దర్శకత్వం: అట్లీ; విడుదల: 07-09-2023

‘ప‌ఠాన్‌’తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన షారుక్‌ ఖాన్ ఈ సారి ‘జ‌వాన్‌’ (Jawan)గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంత ఆత్రుత‌గా ఎదురుచూశారో దాని అడ్వాన్స్ బుకింగ్స్ చాటి చెప్పాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్... ద‌ర్శ‌కుడు అట్లీ క‌లసి చేసిన సినిమా కావ‌డంతో ఉత్త‌రాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలోనూ ఆస‌క్తిని, అంచ‌నాల్ని పెంచింది. మ‌రి సినిమా ఎలా ఉంది?(Jawan movie review) షారుక్‌ తన విజ‌య ప‌రంప‌ర‌ని కొనసాగించాడా?

కథేంటంటే: గుండుతో క‌నిపించే ఓ అజ్ఞాత వ్య‌క్తి (షారుక్‌ ఖాన్‌) త‌న గ్యాంగ్‌లోని ఆరుగురు అమ్మాయిలతో క‌లిసి ముంబైలోని మెట్రో రైల్‌ని హైజాక్ చేస్తాడు. ప్ర‌భుత్వాన్ని రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తాడు. ఆ క్ర‌మంలో ప్ర‌యాణికుల ప్రాణాల్ని తీయ‌డానికి కూడా వెన‌కాడ‌డు. హైజాక‌ర్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం ఐపీఎస్ న‌ర్మ‌ద (Nayanthara)ని రంగంలోకి దింపుతుంది అధికార యంత్రాంగం. అయినా తాను అనుకున్న‌ది సాధించి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటాడు. త‌న‌కి ఇచ్చిన రూ.40 వేల కోట్ల‌ని పేద‌ల ఖాతాల్లో జ‌మ చేస్తాడు. న‌యా రాబిన్‌ హుడ్‌ లాంటి ఆ హైజాక‌ర్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారుతుంది. న‌ర్మ‌ద‌, త‌న బృందం సాగించిన ప‌రిశోధ‌న‌లో హైజాక‌ర్...  ఓ కారాగారంలో విధులు నిర్వ‌ర్తించే జైల‌ర్ ఆజాద్ (షారుక్‌ ఖాన్) పోలిక‌ల‌తో ఉన్న‌ట్టు తేలుతుంది. జైల‌ర్ ఆజాద్ హైజాక‌ర్‌గా మారాడా? ఆయ‌న వెంట ఉన్న ఆరుగురు యువ‌తులు ఎవ‌రు? ఒక‌ప్పుడు ఆర్మీలో ప‌నిచేసిన విక్ర‌మ్ రాథోడ్ (షారుక్‌ ఖాన్‌)కీ, ఆజాద్‌కీ సంబంధం ఏంటి? (Jawan movie review) ప‌్ర‌పంచంలోని ఐదో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజ‌య్ సేతుప‌తి) క‌థేంటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ద‌క్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లోని అగ్ర తార‌ల సినిమాల‌న‌గానే తారాస్థాయి హీరోయిజం... వీరోచిత‌మైన పోరాటాలు, సామాజికాంశాలు, అభిమానుల్ని మెప్పించే ఇత‌ర‌త్రా మాస్ అంశాల మేళవింపుగా రూపొందుతుంటాయి. క‌థ కాస్త ఆస‌క్తిక‌రంగా సాగిందంటే చాలు... ఆ సినిమాల‌కి ఆకాశ‌మే హ‌ద్దు.  అలాంటి ఓ క‌థ‌లోనే బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ (Shah Rukh Khan) ని చూపించారు అట్లీ. ఆయ‌న‌కి షారుక్‌ ఇమేజ్‌, మార్కెట్ మ‌రింత‌గా క‌లిసి రావ‌డంతో సినిమాకు అదనపు హంగులు జోడించి తెర‌కెక్కించారు. దాంతో ప్ర‌తి స‌న్నివేశం లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఇది అట్లీ మార్క్ హిందీ సినిమా.

షారుక్‌ ఖాన్ ఎప్పుడూ క‌నిపించ‌నంత మాస్‌గా... వైవిధ్యమైన గెట‌ప్పుల్లో క‌నిపించ‌డం ఆయ‌న అభిమానుల‌కి మ‌రింత ఉత్సాహాన్నిస్తుంది. (Jawan movie review in telugu) ఎప్ప‌ట్లాగే అట్లీ ప‌లు పార్శ్వాల‌తో క‌థ‌ని రాసుకున్నాడు. దాదాపుగా కీల‌క‌మైన  ప్ర‌తి పాత్ర‌కీ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. వాటిని తెలుసుకోవాల‌నే ఉత్సుక‌త‌ని ప్రేక్ష‌కుల్లో క‌లిగిస్తూ క‌థ‌ని ముందుకు న‌డిపించాడు. ‘నేనెవ‌ర్ని’? అనిపిస్తూ షారుక్‌ని ప‌రిచ‌యం చేసిన అట్లీ, ఆ వెంట‌నే హైజాక్ ఎపిసోడ్‌తో క‌థని మొద‌లుపెట్టాడు. షారుక్‌ మార్క్ వినోదం ఏమాత్రం త‌గ్గ‌కుండా...  ప్ర‌భుత్వాల్ని ప్ర‌శ్నించేలా కొన్ని ఎపిసోడ్స్‌ని తీర్చిదిద్దుతూ బ్యాలెన్సింగ్‌గా క‌థ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు.

వ్య‌వ‌సాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి నేప‌థ్యంలో వ‌చ్చే ఎపిసోడ్స్ ప్ర‌థ‌మార్ధానికి హైలైట్‌. ఒక‌వైపు ఆజాద్‌ని ప‌ట్టుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నాలు.. మ‌రోవైపు ప్రేమ స‌న్నివేశాల నేప‌థ్యం మంచి డ్రామాని పండించింది. విరామ స‌న్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విక్ర‌మ్ రాథోడ్‌గా షారుక్‌ ఖాన్ ప‌రిచ‌యం కావ‌డం, ఆ వెంట‌నే మొద‌ల‌య్యే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి కీల‌కం. (Jawan movie review) షారుక్‌ - దీపికా ప‌దుకొణే మ‌ధ్య స‌న్నివేశాలు త‌క్కువే అయినా సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావం చూపిస్తాయి. దీపికా ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చి, పెంచి పెద్ద చేసే స‌న్నివేశాలు, త‌న‌ని వ‌దిలిపెట్టి వెళ్లే స‌న్నివేశాలు క‌న్నీళ్లు పెట్టిస్తాయి. ఆయుధాల ఎపిసోడ్స్‌కి సంబంధించి షారుక్‌, విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య స‌న్నివేశాలు కూడా అల‌రిస్తాయి. (Jawan movie review in telugu)

సెకండాఫ్‌లో ఈవీఎమ్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు మరొక హైలైట్‌. షారుక్‌ క‌నిపించిన‌ప్పుడంతా అభిమానులు చ‌ప్ప‌ట్లు కొట్టేలా హీరోయిక్‌గా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాలు, పోరాట ఘ‌ట్టాలు పైసా వ‌సూల్. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు లాజిక్‌ల‌ని ప‌ట్టించుకోలేదు. కొన్ని స‌న్నివేశాలు మ‌రీ డ్ర‌మటిక్‌గా అనిపిస్తాయి. కానీ మాస్ మ‌సాలా సినిమాల్లో అలాంటి లెక్క‌ల్ని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్న‌ట్టుగా అట్లీ త‌నదైన శైలిలో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దుతూ వెళ్లాడు. షారుక్‌ అభిమానుల‌కి కావ‌ల్సినంత సంద‌డిని పంచే ఈ సినిమా... మాస్ మ‌సాలా సినిమాల ప్రియుల‌కీ మంచి కాల‌క్షేపాన్నిస్తుంది. హ్యాపీ ఓన‌మ్ అంటూ మాధ‌వ‌న్ నాయ‌ర్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ చేసిన సంద‌డి సినిమాలో కొస‌మెరుపు.

ఎవ‌రెలా చేశారంటే: షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) మాస్ అవ‌తార్ అద‌ర‌హో అనిపిస్తుంది. ఆయ‌న రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. పాట‌లు, పోరాట ఘ‌ట్టాల్లో ఎప్ప‌ట్లాగే అద‌ర‌గొట్టిన షారుక్‌... సామాజికాంశాలు, కుటుంబం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. న‌య‌న‌తార ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ క‌నిపిస్తుంది. కీల‌క‌మైన పాత్రే అయినా... షారుక్‌కీ, ఆమెకీ మ‌ధ్య  కెమిస్ట్రీ అంత‌గా ఎలివేట్‌ కాలేదు. ఆ నేప‌థ్యంలో ఎక్కువ స‌న్నివేశాలు లేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణమేమో. (Jawan movie review) దీపికా ఉన్నంత‌లో త‌న‌దైన ప్ర‌భావం చూపించింది.

కాళీ గైక్వాడ్‌గా విజ‌య్ సేతుప‌తి ద్వితీయార్ధంపై ప్ర‌భావం చూపిస్తారు. ప్రియ‌మ‌ణి, సాన్య మ‌ల్హోత్రా, రిద్ధి, సంజీత త‌దిత‌రులకి కీల‌క‌మైన పాత్ర‌ల‌కి ద‌క్కాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. విష్ణు కెమెరా ప‌నిత‌నం టాప్‌ నాచ్‌ అని చెప్పవచ్చు. అనిరుధ్ పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంతో షారుక్‌ హీరోయిజాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. యాక్ష‌న్‌, ఎడిటింగ్‌, మేక‌ప్, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాలు కూడా స‌త్తా చాటాయి. అట్లీ క‌థ కంటే కూడా క‌థ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ప‌లు పార్శ్వాలతో కూడిన ఈ క‌థ‌ని ఎంతో స్ప‌ష్టంగా చెప్పాడు. క‌థ‌ని మొద‌లుపెట్టిన విధానం, ముగింపు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బ‌లాలు
  • + షారుక్‌ మాస్ అవ‌తార్
  • + క‌థ‌నం, సినిమాటోగ్రఫీ, నేప‌థ్య సంగీతం
  • + మాస్ అంశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా..: జ‌వాన్... పైసా వ‌సూల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ (Jawan movie review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని