Devil Review: రివ్యూ: డెవిల్‌.. కల్యాణ్‌ రామ్‌ నటించిన స్పై థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే..?

కల్యాణ్‌ రామ్‌-సంయుక్త జంటగా నటించిన సరికొత్త చిత్రం ఎలా ఉందంటే..?

Updated : 29 Dec 2023 15:27 IST

Devil movie review చిత్రం : డెవిల్‌ ; నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, సంయుక్త, మాళవిక నాయర్‌, సీత, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎస్తర్‌ నోరోన్హా, అజయ్‌, షఫి తదితరులు; సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు; సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌; నిర్మాణ సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్‌; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా; నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా; విడుదల: 29-12-2023

ఈ ఏడాది చివరి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిత్రాల్లో ‘డెవిల్‌’ (devil movie review) ఒక‌టి.  క‌ల్యాణ్‌రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ కావ‌డం.. విజ‌యాల‌కి పెట్టింది పేరైన సంయుక్త క‌థానాయిక‌గా న‌టించ‌డం.. ప్ర‌చార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో ‘డెవిల్‌’ ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం (devil movie review).

క‌థేంటంటే: 1940 ద‌శ‌కంలో జ‌రిగే క‌ల్పిత క‌థ ఇది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్‌ని ప‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటుంది నాటి బ్రిటిష్ ప్ర‌భుత్వం. బోస్ రాక గురించి స‌మాచారం వారికి అందుతుంది. ఆ స‌మ‌యంలోనే బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు డెవిల్ (క‌ల్యాణ్‌రామ్‌). ర‌స‌పురంలోని జ‌మిందార్ ఇంట్లో జ‌రిగిన ఓ హ‌త్య కేసుని ఛేదించ‌డానికి ప్ర‌భుత్వం అతడిని పంపుతుంది. హ‌త్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలో న‌డుస్తున్న ఐఎన్ఏ (ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ) ఏజెంట్ల‌ను గుర్తిస్తాడు డెవిల్‌. మరోవైపు, బోస్.. తన కుడి భుజ‌మైన త్రివ‌ర్ణతో టచ్‌లో ఉన్న విష‌యాన్ని డెవిల్‌ ప‌సిగ‌డ‌తాడు (devil movie review). సుభాష్ చంద్ర‌బోస్‌కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేర‌వేసేందుకు త్రివర్ణ, మ‌రికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మ‌రి ఆ కోడ్‌తో జ‌మిందార్ ఇంట్లో హ‌త్య‌కు సంబంధం ఏమిటి? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు? అస‌లు ఈ క‌థ‌లో త్రివ‌ర్ణ ఎవ‌రు? నైష‌ధ (సంయుక్త‌), మ‌ణిమేక‌ల (మాళ‌విక నాయ‌ర్‌)తో ఆమెకు సంబంధం ఏమిటి? బోస్‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం ప‌ట్టుకుందా? త‌దిత‌ర విష‌యాలను తెరపై చూడాల్సిందే (devil movie review).

Year Ender 2023: ఈ ఏడాది వార్తల్లో నిలిచిన సినీ వివాదాలు.. చర్చలు

ఎలా ఉందంటే: దేశ‌భ‌క్తి.. థ్రిల్లింగ్ అంశాల మేళ‌వింపుగా రూపొందిన చిత్ర‌మిది. మిగ‌తా స్పై థ్రిల్ల‌ర్ సినిమాల‌తో పోలిస్తే.. పీరియాడిక్ నేప‌థ్యంలో సాగడ‌మే ‘డెవిల్‌’ ప్ర‌త్యేక‌త‌. థ్రిల్‌ని పెంచే అనూహ్యమైన మ‌లుపులు, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇలాంటి చిత్రాలకు బ‌లం. కానీ, వీటి విష‌యంలోనే లోటు జ‌రిగింది. నేప‌థ్యం ఆక‌ట్టుకున్నా.. అస‌లు క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో దర్శకుడి విఫ‌ల‌య‌త్నం క‌నిపిస్తుంది. ఓ హ‌త్య చుట్టూ సాగే ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌గా సినిమా మొద‌ల‌వుతుంది. పోలీసులు ప్రాథ‌మికంగా ఆ కేసుని ఒక కోణంలో ప‌రిశోధించ‌డం.. డెవిల్ రంగంలోకి దిగాక కొత్త ఆధారాలు, అనుమానాలు, కోణాలతో సినిమా సాగుతుంది. స‌గ‌టు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని చూసిన‌ట్టే అనిపిస్తుంది. మ‌ధ్య‌లో పాట‌లు, ప్రేమ కోణంతో ప్ర‌థ‌మార్ధం దాదాపుగా ముగుస్తుంది. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాల నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. డెవిల్ బ్రిటిష్ సైన్యాన్నే ఎదురించ‌డంతో త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆసక్తి రేకెత్తుతుంది. అయితే, ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు గంద‌ర‌గోళం, నాట‌కీయంగా అనిపించినా దేశ‌భ‌క్తి కోణం కొద్దివ‌ర‌కు క‌ట్టి ప‌డేస్తుంది. త్రివ‌ర్ణ ఎవ‌రనే విష‌యం వెలుగులోకి రావ‌డం, ఐఎన్‌ఏలో బ్రిటిష్ సైన్యం కోసం ప‌నిచేసే కోవ‌ర్ట్‌ని ప‌సిగ‌ట్ట‌డం వంటి స‌న్నివేశాలు చిత్రాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చాయి. ప‌తాక స‌న్నివేశాలు ఓకే. స్పై థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందిన ఈ సినిమా కొంచమే థ్రిల్‌ని పంచుతుంది. దేశ‌భ‌క్తి కోణం, అక్క‌డ‌క్క‌డా పండిన భావోద్వేగాలు సినిమాకి క‌లిసొచ్చే అంశాలు. పీరియాడిక్ క‌థ‌కి త‌గ్గ ప్ర‌మాణాల‌తో ఈ సినిమాని రూపొందించ‌డం బాగుంది (devil movie review).

ఎవ‌రెలా చేశారంటే: క‌ల్యాణ్‌రామ్ త‌న న‌ట‌న‌, లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. పోరాట ఘ‌ట్టాల్లో తనదైన శైలిలో మెప్పించారు. అయితే ‘డెవిల్‌’ పాత్ర‌ని మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దే విష‌యంలోనే లోపాలు క‌నిపిస్తాయి. సంయుక్త, మాళ‌విక నాయ‌ర్ ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో నటించారు. వారి పాత్ర‌లు దేశ‌భ‌క్తి కోణంతో ముడిప‌డి ఉండటంతో సినిమాపై ప్రభావం చూపించాయి. క‌ల్యాణ్‌రామ్‌-సంయుక్త పాత్ర‌ల‌ మ‌ధ్య ప్రేమ కోణం ఉన్నా.. దర్శకుడు దాన్ని బ‌లంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. శాస్త్రి పాత్రలో స‌త్య, కీల‌క‌మైన మ‌లుపునిచ్చే పాత్ర‌లో వ‌శిష్ట సింహా, ష‌ఫి, రంగ‌స్థ‌లం మ‌హేశ్ త‌దిత‌రులు పాత్ర‌ల పరిధి మేరకు ఆక‌ట్టుకున్నారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా విభాగానికే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. సౌంద‌ర్‌రాజ‌న్ త‌న కెమెరాతో పీరియాడిక్ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు బాగుంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. క‌ళా విభాగం పనితీరు ఆక‌ట్టుకుంటుంది. శ్రీకాంత్ విస్సా క‌థ‌, మాట‌లు మెప్పిస్తాయి. క‌థ‌నం ప‌రంగా జరిగిన క‌స‌ర‌త్తు సరిపోలేదు. ద‌ర్శ‌కుడి ప‌ట్టు కొన్ని స‌న్నివేశాల‌పైనే క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ‌లో దేశ‌భ‌క్తి కోణం
  • ద్వితీయార్ధం
  • న‌టీన‌టులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - సాదాసీదాగా ప్ర‌థ‌మార్ధం
  • ఆక‌ట్టుకోని మ‌లుపులు
  • చివ‌రిగా:  డెవిల్‌... అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తాడు
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని