Kannur Squad: రివ్యూ: కన్నూర్‌ స్క్వాడ్‌.. మమ్ముట్టి మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

మమ్ముట్టి నటించిన మలయాళ హిట్‌ చిత్రం ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ తెలుగులో ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ వేదికగా అందుబాటులో ఉంది. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే?

Published : 17 Nov 2023 17:02 IST

Kannur Squad telugu review | చిత్రం: కన్నూర్‌ స్క్వాడ్‌; తారాగణం: మమ్ముట్టి, రోనీ డేవిడ్‌ రాజ్‌, కిశోర్‌, విజయ రాఘవన్‌ తదితరులు; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ ప్రభాకర్‌; మ్యూజిక్‌: సుశిన్‌ శ్యామ్‌; సినిమాటోగ్రఫీ: మహ్మద్‌ రహీల్‌; నిర్మాణం: మమ్ముట్టి కంపెనీ; కథ, కథనం: మహ్మద్‌ షఫీ; దర్శకత్వం: రోబీ వర్గీస్‌ రాజ్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

మ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad). బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. మరి, అక్కడ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా కథేంటి? ఇక్కడి వారిని మెప్పించగలిగిందా? (Kannur Squad review in telugu)..

కథేంటంటే: కేరళలోని కన్నూర్‌ జిల్లా నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి క్రైమ్‌ రేట్‌ని తగ్గించాలనే ఉద్దేశంతో ఓ ఎస్పీ.. రెండు స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి, ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తాడు. ఏఎస్సై జార్జ్‌ మార్టిన్‌ (మమ్ముట్టి) నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం అందులో ఒకటి. ఈ స్క్వాడ్‌పై ఉన్న నమ్మకంతో మరో ఎస్పీ చోళన్‌ (కిశోర్‌) రాజకీయ ప్రముఖుడి హత్య కేసును ఛేదించే బాధ్యతను అప్పగిస్తాడు. పైఅధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని పది రోజుల్లోగా కేసును పరిష్కరించాలని ఆదేశిస్తాడు. అయితే, ఈ క్రమంలో ఆ స్క్వాడ్‌లోని ఓ సభ్యుడు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. మరి, ఆరోపణలు వచ్చినా ఆ స్క్వాడ్‌నే ఎందుకు రంగంలోకి దించారు? హత్యకు గురైన వ్యక్తి నేపథ్యమేంటి? అతడిని చంపిందెవరు? నిర్ణీత సమయంలో జార్జ్‌ టీమ్‌ హంతకులను పట్టుకుందా? ఆ దర్యాప్తులో భాగంగా వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది (Kannur Squad review in telugu).

ఎలా ఉందంటే: నిర్దేశించిన సమయంలో నేరస్థులను పట్టుకోవాలనే సవాలును స్వీకరించిన నలుగురు పోలీసుల కథే ఈ ‘కన్నూర్‌ స్క్వాడ్‌’. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అసలు కథలోకి వెళ్లేందుకు దర్శకుడు దాదాపు 15 నిమిషాలు తీసుకున్నారు. అప్పటి వరకు ఈ టీమ్‌ ఏంటో? ఇందుకిలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారో? అన్న సందేహాలు ప్రేక్షకుడికి కలుగుతాయి. ఓ జర్నలిస్ట్‌ చేసే ఇంటర్వ్యూలో భాగంగా వారు ఆ స్క్వాడ్‌లో ఎలా భాగమయ్యారో జార్జ్‌ చెప్పే సన్నివేశంతో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత, ఈ టీమ్‌ ప్రతిభ గురించి తెలుసుకున్న ఎస్పీ చోళన్‌ (కిశోర్‌) వారికి పది రోజుల టైమ్‌ ఇచ్చి కేసును ఛేదించమనడం, వెంటనే వారు రంగంలోకి దిగడం.. ఇలా అక్కడి నుంచి కథ పరుగులు పెడుతుంది. కేరళలో మొదలైన స్క్వాడ్‌ జర్నీ ముంబయి (మహారాష్ట్ర), ఫైజాబాద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)సహా నేపాల్‌ బోర్డర్‌ వరకూ సాగుతుంది. అయితే, ఇలాంటి నేపథ్య కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. కార్తి హీరోగా తెరకెక్కిన ‘ఖాకీ’ ఈ తరహాలో సాగేదే. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఎదురైన సవాళ్లను జార్జ్‌ అధిగమించే తీరు మెప్పిస్తుంది. టీమ్‌ సభ్యులకు వ్యక్తిగతంగా మనస్పర్థలు వచ్చి.. ఇన్వెస్టిగేషన్‌ ఆపేయాలనుకున్న సమయంలో జార్జ్‌ ఇచ్చే సందేశం ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది (Kannur Squad review in telugu).

పోలీసు డిపార్ట్‌మెంట్‌కు రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? లంచం తీసుకున్నారనే ఆరోపణలు వస్తే పోలీసులకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? ఇతర రాష్ట్రాలకు ఇన్వెస్టిగేషన్‌కు వెళ్తే స్థానికంగా ఉండే పోలీసు అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? తదితర అంశాలను చక్కగా చూపించారు. కథ ఫైజాబాద్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత మరింత రసవత్తరంగా ఉంటుంది. సీసీ ఫుటేజ్‌లు, కాల్‌ డేటా ఆధారంగా నిందితులకు సాయం చేసిన వారిని కలిసినప్పుడు జార్జ్‌ టీమ్‌కు ఊహించని షాక్‌ ఎదురవుతుంది. అప్పుడే కథ మరో మలుపు తిరుగుతుంది. విలన్ల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ జార్జ్‌ టీమ్‌ చివరకు వారిని పట్టుకోబోయే క్షణంలో.. ఊహించని ట్విస్ట్‌ ఎదురవుతుంది. క్లైమాక్స్‌ను సంతృప్తికరంగా మలిచారు.

ఎవరెలా చేశారంటే: జార్జ్‌ మార్టిన్‌గా మమ్ముట్టి సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. కష్టకాలంలో సమయస్ఫూర్తితో మెలిగే ఆ పాత్ర ఆకట్టుకుంటుంది. టీమ్‌లీడ్‌ ఎలా ఉండాలో చాటి చెబుతుంది. ఎస్పీ మను చోళన్‌ పాత్రలో కిశోర్‌ ఒదిగిపోయారు. ఈయన తెలుగు వారికి సుపరిచితమే. ‘హ్యాపీ’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ తదితర చిత్రాల్లో వైవిధ్య భరిత పాత్రలతో అలరించారు. వీరిద్దరు మినహా మిలిగిన వారంతా పెద్దగా పరిచయం లేనివారే. స్క్వాడ్‌ సభ్యులైన రోనీ డేవిడ్‌ రాజ్‌, అజీస్‌, షబరీశ్‌ వర్మ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌ రోల్స్‌ ప్లే చేసిన వారు ఓకే అనిపిస్తారు (Kannur Squad review in telugu).

సాంకేతికంగా ఎలా ఉందంటే: టెక్నిషియన్ల పని తీరు బాగుంది. సుశిన్‌ శ్యామ్‌ అందించిన నేపథ్య సంగీతం పలు సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే, కథాగమనంలో వచ్చే ర్యాప్‌ సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోవు. కొన్ని సీక్వెన్సెస్‌లోని మహ్మద్‌ రహీల్‌ సినిమాటోగ్రఫీకి వావ్‌ అనాల్సిందే. ప్రారంభ సన్నివేశాలను ఎడిటర్‌ ప్రవీణ్‌ ప్రభాకర్‌ ఇంకాస్త కట్‌ చేయాల్సింది. మహ్మద్‌ షఫీ రాసిన కథ కొత్తగా లేకపోయినా కథనం ఆసక్తికరం. గతంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ ‘కన్నూర్‌ స్క్వాడ్‌’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించగలిగారు (Kannur Squad review in telugu).

కుటుంబంతో కలిసి చూడొచ్చా: ఇందులో ఓ అభ్యంతరకర సన్నివేశం ఉంది (హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యురాలికి సంబంధించింది). అయితే, దాన్ని ‘బ్లర్‌’గానే చూపించారు. ఫ్యామిలీతో కలిసి చూసే సమయంలో సెకన్ల నిడివి కలిగిన ఆ సీన్‌ను స్కిప్‌ చేసుకుంటే బెటర్‌ (Kannur Squad review in telugu).

  • బలాలు
  • + మమ్ముట్టి 
  • + కథనం
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్రారంభ సన్నివేశాలు
  • -  తెలిసిన కథకావడం
  • చివ‌రిగా: జార్జ్‌ టీమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరం (Kannur Squad review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని