king of kotha review: రివ్యూ: కింగ్‌ ఆఫ్ కొత్త.. దుల్కర్‌ గ్యాంగ్‌స్టర్‌ మూవీ మెప్పించిందా?

king of kotha review in telugu: దుల్కర్‌సల్మాన్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ మూవీ ఎలా ఉందంటే?

Updated : 25 Jun 2024 16:04 IST

king of kotha review in telugu: చిత్రం: కింగ్‌ ఆఫ్‌ కొత్త; నటీనటులు: దుల్కర్‌ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ, షబీర్‌ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్‌ శక్తి, చెంబన్‌ వినోద్‌ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు; ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి; సంగీతం: జేక్స్‌ బిజోయ్, షాన్‌ రెహ్మాన్‌; రచన: అభిలాష్‌ ఎన్‌.చంద్రన్‌; దర్శకత్వం: అభిలాష్‌ జోషి; నిర్మాతలు: దుల్కర్‌ సల్మాన్, జీ స్టూడియోస్‌; విడుదల తేదీ: 24-08-2023

‘మహానటి’, ‘కనులు కనులు దోచాయంటే’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు దుల్కర్‌ సల్మాన్‌. అందుకే ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే తెలుగు వారు ఆ వైపు ఓ కన్నేస్తుంటారు. ఇప్పుడాయన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్థం) అంటూ బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. దుల్కర్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమిది. మరి టీజర్, ట్రైలర్లతో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమా తెరపై ఎలాంటి అనుభూతి అందించింది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫలితాన్ని అందుకుంది?

కథేంటంటే: స్వాతంత్య్రానికి పూర్వం ఎలాంటి విచారణ లేకుండా నేరస్థుల్ని శిక్షించడానికి బ్రిటిషర్లు ఎంచుకున్న ఊరు కోతా. ఆ ఊరు తర్వాతి కాలంలో అన్యాయాలకు.. అక్రమాలకు నిలయంగా మారుతుంది. ఆ నేర సామ్రాజ్యాన్ని మకుటం లేని చక్రవర్తిలా ఏలుతుంటాడు రాజు (దుల్కర్‌ సల్మాన్‌). తనకు స్నేహితుడు కన్నా (షబీర్‌) అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే తల్లిదండ్రులు రాజును దూరం పెడితే.. అండగా నిలిచింది కన్నానే. అలాగే రాజుకు తార (ఐశ్వర్య లక్ష్మీ) అంటే ప్రేమ. ఆమె ప్రేమ కోసం కోతాలో గంజాయి, డ్రగ్స్‌ లేకుండా చేస్తాడు రాజు. అయితే వీళ్లిద్దరి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడంతో వీరి ప్రేమలో సమస్యలు మొదలవుతాయి. తార వల్ల మోసపోయానన్న బాధతో రాజు మద్యానికి బానిసవుతాడు. అదే సమయంలో కోతాను హస్తగతం చేసుకోవడానికి ప్రత్యర్థి రంజిత్‌ (చెంబన్‌ వినోద్‌ జోస్‌)తో కలిసి కుట్ర పన్నుతాడు కన్నా. ఓవైపు ప్రేయసి చేతిలో.. మరోవైపు స్నేహితుడి చేతిలో మోసపోయిన రాజు అకస్మాత్తుగా కోతాను వదిలి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కోతాను కన్నా తన చేతుల్లోకి తీసుకొని రావణ కాష్ఠంలా మార్చేస్తాడు. (king of kotha review in telugu) అయితే కొన్నాళ్లకు ఆ ఊరిలోకి అడుగు పెట్టిన సీఐ షాహుల్‌ (ప్రసన్న).. కన్నా ఆట కట్టించేందుకు మళ్లీ రాజును కోతాకు తిరిగి రప్పిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజు తిరిగి వచ్చాక కన్నాకు ఎలా బుద్ధి చెప్పాడు? తన చెల్లి (అనికా సురేంద్రన్‌)ని ప్రేమ పేరుతో మోసం చేయాలనుకున్న కన్నా బావమరిది జీనూ (శరణ్‌ శక్తి)ని రాజు ఏం చేశాడు? తారతో అతని ప్రేమ కథ ఏమైంది? కోతాలో తన జెండా పాతాలనుకున్న రంజిత్‌ ఏమయ్యాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే: 1980ల నేపథ్యంలో సాగే రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ సినిమా ఇది. కోతా అనే ఓ కల్పిత పట్టణంలో కథ జరుగుతుంటుంది. తండ్రిలా రౌడీ అవ్వాలనుకున్న రాజు అనే కుర్రాడు తన కల నెరవేర్చుకునేందుకు ఏం చేశాడు? కోతాను ఏలే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ప్రేమ, స్నేహం విషయాల్లో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాడు? ఆఖరికి తన లక్ష్యం సాధించాడా? లేదా? అన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. పైకి ఇదొక గ్యాంగ్‌స్టర్‌ సినిమాలా కనిపించినా.. ఇందులో చాలా కోణాలు కనిపిస్తాయి. ప్రేమ, స్నేహం, చెల్లి సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌.. ఇలా బోలెడన్ని అంశాల్ని దీంట్లో మేళవించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. (king of kotha review) అయితే వీటన్నింటినీ చక్కగా ముడిపెట్టి రుచికరమైన వంటకం సిద్ధం చేయడంలో తడబడ్డాడు. కోతా ప్రపంచాన్ని.. అందులోని కన్నా భాయ్‌ అకృత్యాల్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. (king of kotha review in telugu) అక్కడి నుంచి ఈ కథలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. షాహుల్‌ సీఐగా కోతాకు రావడం... వచ్చీ రాగానే కన్నాకు వార్నింగ్‌ ఇవ్వాలని ప్రయత్నించి భంగపడటం.. కన్నాను దెబ్బ కొట్టాలన్న ప్రయత్నంలో అతను రాజు గురించి తెలుసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే సినిమా ఆరంభమైన 20నిమిషాలకు హీరో ఎంట్రీ ఇచ్చినా కథ ఏమాత్రం ముందుకు వెళ్తున్నట్లు అనిపించదు. ప్రతి అంశాన్నీ డిటైల్డ్‌గా చెప్పాలన్న ప్రయత్నంలో దర్శకుడు ప్రథమార్ధం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడేసుకున్నాడు. దుల్కర్‌ పరిచయ సన్నివేశాలతో పాటు రంజిత్‌కు తను వార్నింగ్‌ ఇచ్చే ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి.

ఐశ్వర్యతో ప్రేమకథలో ఏమాత్రం ఫీల్‌ కనిపించదు. మధ్యలో ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలోనూ.. చెల్లి అనుబంధాల నేపథ్యంలోనూ కొన్ని సన్నివేశాలు అల్లుకున్నాడు దర్శకుడు. కానీ, ఏవీ భావోద్వేగభరితంగా అనిపించవు. రాజు - తారల ప్రేమకథలోకి మూడో వ్యక్తి ప్రవేశించాక కథ మలుపు తిరుగుతుంది. అదే సమయంలో కన్నా కూడా రాజును వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలో విరామానికి ముందొచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. (king of kotha review) అయితే ప్రథమార్ధం ఆకట్టుకున్న కథ ద్వితీయార్ధంలో పూర్తిగా గాడి తప్పింది. యాక్షన్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత కథకు ఇవ్వకపోవడంతో ఏ దశలోనూ ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్‌ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. (king of kotha review in telugu) నిజానికి ద్వితీయార్ధం ఆరంభమైన కాసేపటికే కథ ముగించే అవకాశం ఉంది. కానీ, దర్శకుడు అనవసరమైన ఎపిసోడ్లతో మరో గంట పాటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. హీరో.. విలన్‌కు మధ్య వచ్చే సుదీర్ఘ పోరాటాలు ఓ దశ దాటాక విసుగు తెప్పిస్తాయి. శుభం కార్డు కోసం వేచి చూసేలా చేస్తాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగా ఉంటాయి. ఈ కథలో చాలా పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకుండానే సినిమాని ముగించారు.

ఎవరెలా చేశారంటే: రాజు పాత్రలో మాస్‌ గెటప్పులో దుల్కర్‌ సల్మాన్‌ చాలా కొత్తగా కనిపించారు. తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టిపడేశారు. యాక్షన్, ఎమోషనల్‌ సన్నివేశాల్ని తన అనుభవంతో రక్తి కట్టించారు. కథలో కీలకమైన కన్నా పాత్రలో షబీర్‌ ఆకట్టుకునేలా నటించాడు. ఈ పాత్రను దర్శకుడు సరైన స్పష్టత లేకుండా తీర్చిదిద్దుకున్నట్లు అనిపిస్తుంది. ఐశ్వర్య లక్ష్మీ, అనికా సురేంద్రన్, ప్రసన్న తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. (king of kotha review in telugu)  స్పోకెన్‌ ఇంగ్లిష్‌ మాట్లాడుతూ రంజిత్‌ పాత్రలో చెంబన్‌ వినోద్‌ పంచిన హాస్యం అక్కడక్కడా నవ్వించింది. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథలోని ఏ ఒక్క ఎమోషన్‌ను పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకు రాలేకపోయారు. ఓ దశ దాటాక యాక్షన్‌ ఎపిసోడ్లు బోర్‌ కొట్టించేశాయి. నిడివిని అరగంటకు పైగా తగ్గించే అవకాశముంది. జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్‌ సన్నివేశాల్లో తన సంగీతంతో హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్‌ చేశారాయన. 80ల వాతావరణాన్ని చూపించేలా ప్రొడక్షన్‌ డిజైనర్, సినిమాటోగ్రాఫర్‌ చూపించిన పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + దుల్కర్‌ నటన
  • + నేపథ్య సంగీతం
  • + యాక్షన్‌ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - కథా నేపథ్యం, స్క్రీన్‌ప్లే
  • - ద్వితీయార్ధం, ముగింపు
  • చివరిగా: పేరులో ఉన్న ‘కొత్త’దనం.. కథలో కనిపించలేదు!  (king of kotha review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు