Kushi Movie Review: రివ్యూ: ఖుషి.. విజయ్‌ దేవరకొండ, సమంత జోడీ మెప్పించిందా?

Kushi Movie Review; విజయ్‌ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ ఎలా ఉంది?

Updated : 01 Sep 2023 14:04 IST

Kushi Movie Review; చిత్రం: ఖుషి; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, సచిన్‌ ఖేడ్కర్‌, శరణ్య పొన్నవణ్ణన్‌, మురళీశర్మ, రోహిణి, వెన్నెల కిషోర్‌, జయరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు; సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; సినిమాటోగ్రఫీ: మురళి జి; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌; రచన, దర్శకత్వం: శివ నిర్వాణ; విడుదల: 01-09-2023

సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకుని, అతి త‌క్కువ కాలంలోనే బ‌ల‌మైన అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌రకొండ. ‘లైగ‌ర్‌’తో జాతీయ స్థాయిలో ప్ర‌భావం చూపించాల‌ని ప్ర‌య‌త్నించినా, అది ఫ‌లితాన్నివ్వ‌లేదు. కొంత‌కాలంగా ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విజ‌య్ ఈసారి ప్రేమ‌క‌థ‌ని ఎంచుకుని ‘ఖుషి’తో ముందుకు వచ్చారు. స‌మంత (Samanth) క‌థానాయిక‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్‌కి ఉన్న గుర్తింపు, ఆయ‌న మార్కెట్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుద‌లైంది. (Kushi Movie Review) మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది? న్యూ ఏజ్‌ డ్రామాగా మెప్పించిందా?

క‌థేంటంటే: విప్ల‌వ్ దేవ‌ర‌కొండ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ప్ర‌భుత్వ ఉద్యోగంపై ఇష్టంతో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో జేటీవోగా విధుల్లో చేరతాడు. ఏరికోరి క‌శ్మీర్‌లో పోస్ట్ వేయించుకుంటాడు. అక్క‌డే ఆరా బేగం (స‌మంత‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌మ్ముడిని వెదుక్కుంటూ తాను పాకిస్థాన్‌ నుంచి వ‌చ్చాన‌ని చెప్పినా, త‌న కోసం పాకిస్థాన్‌ వెళ్ల‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు విప్ల‌వ్‌. అంత‌గా త‌న‌ని ఇష్ట‌ప‌డ‌టం చూసి... ఆ ప్రేమ‌కి ఆరా కూడా ఫిదా అయిపోతుంది. కానీ, వీళ్ల ప్రేమ‌కి పెద్ద‌లు అడ్డు చెబుతారు. (Kushi Movie Review in telugu) భిన్న కుటుంబ నేప‌థ్యాలకి చెందిన ఈ జంట విడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఇరు కుటుంబాలూ న‌మ్ముతాయి. మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... పెద్ద‌లు చెప్పిన‌ట్టే విడిపోయిందా?  ఇంత‌కీ వీళ్ల కుటుంబాల క‌థేమిటి?పెళ్లయిన తర్వాత ఈ జంట మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి?

ఎలా ఉందంటే: ఒక జంట ప్రేమ‌... పెళ్లి జీవితం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రేమ‌క‌థ‌ల్లో ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణకి ధ‌నిక‌, పేద‌, ప‌రువు, ప్ర‌తిష్ట‌, కులం, మ‌తం వంటి విష‌యాలే ఎక్కువ‌గా కార‌ణ‌మ‌వుతుంటాయి. ఈ క‌థ కూడా ఇంచుమించు అలాంటిదే. కాక‌పోతే ఇందులో ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల న‌మ్మ‌కాల నుంచి ఆ సంఘ‌ర్ష‌ణ‌ని సృష్టించి క‌థ‌ని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. తొలి భాగం ప్రేమ‌క‌థ‌తో సాగితే, మ‌లిభాగం వైవాహిక జీవితం చుట్టూ సాగుతుంది. కొత్త నేప‌థ్య‌మే ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం.  ప్ర‌ధాన పాత్ర‌లు ప‌రిచ‌యం కాగానే... క‌థ క‌శ్మీర్‌కి చేరుతుంది. (Kushi Movie Review telugu) అక్క‌డ హీరో-హీరోయిన్లు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌టం...  ఆ త‌ర్వాత ప్రేమ, విన‌సొంపైన పాట‌లు, క‌నువిందు చేసే క‌శ్మీర్ అందాల‌తో సినిమా హాయిగా సాగిపోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay devarakonda), - వెన్నెల కిశోర్ నేప‌థ్యంలో హాస్య స‌న్నివేశాలు కూడా ప్ర‌థ‌మార్ధానికి ప్ర‌ధాన బ‌లం. ద్వితీయార్ధంలోనే అస‌లు సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మ‌ధ్య ఎలాంటి విష‌యాలు అపార్థాల‌కి కార‌ణ‌మ‌వుతుంటాయి? ఇక ఆ జంట భిన్న సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లతో మెలిగే కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ప్పుడు ఆ అపార్థాలు ఇంకెంత‌గా ప్ర‌భావం చూపిస్తాయో సెకండాఫ్‌లో చూపించారు.

చాలా సినిమాల్లో చూసిన ప్రేమ‌క‌థే అయినా  కొత్తర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాల్ని పండించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈ క‌థ‌లో పండిన సంఘ‌ర్ష‌ణ మోతాదే స‌రిపోలేదు. అటు ప్రేమికుల‌కు, ఇటు భార్యాభ‌ర్త‌ల‌కీ క‌నెక్ట్ అయ్యే స‌న్నివేశాలు త‌క్కువ‌.  ప్ర‌థ‌మార్ధం హాయిగా సాగినా... ద్వితీయార్ధంలో చాలా చోట్ల స‌న్నివేశాలు సాగ‌దీత‌లా అనిపిస్తాయి. ఫెర్టిలిటీ సెంట‌ర్‌లో హ‌డావుడి, కేర‌ళలో స‌న్నివేశాలు వృథా అనిపిస్తాయి. హీరోయిన్‌కి మిస్ క్యారేజ్ అయ్యాక కూడా హీరోకి టెస్టుల పేరుతో తెర‌పై హ‌డావుడిని చూపించ‌డం అంత‌గా అత‌క‌లేదు. (Kushi Movie Review) హీరో-హీరోయిన్ల మ‌ధ్య అపార్థాలు కూడా ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. ప‌తాక స‌న్నివేశాలతో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. కుటుంబంతో క‌లిసి చూసే క‌థే అయినా...  విజ‌య్ దేవ‌ర‌కొండ మార్క్ రొమాంటిక్ స‌న్నివేశాలకీ లోటులేకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా...  ఆరాధ్య పాట‌లో విజ‌య్‌, స‌మంత మ‌ధ్య కెమిస్ట్రీ ప్ర‌భావం చూపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సమంత (Samantha) జోడీ ప్రతి సన్నివేశంలోనూ ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌కి త‌గ్గ ఎంపిక.  ప్రేమలో ప‌డిన జంట‌గా ప్ర‌థ‌మార్ధంలో ఎంత అందంగా క‌నిపించారో,  ద్వితీయార్ధంలో భార్యాభ‌ర్త‌లుగా సహ‌జంగా ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  ప‌తాక స‌న్నివేశాల్లోనూ, అంత‌కుముందు వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌టి భావోద్వేగాల్ని పండించారు. స‌చిన్ ఖేడేక‌ర్‌, ముర‌ళీశ‌ర్మ పాత్ర‌లు సినిమాకి కీల‌కం. ఒక‌రు నాస్తికుడిగా, మ‌రొక‌రు ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌గా పాత్ర‌ల్లో నటించారు. జ‌య‌రాం, రోహిణి, శ‌ర‌ణ్య పొన్‌వ‌ణ్ణ‌న్‌, ల‌క్ష్మీ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించారు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కొన్ని న‌వ్వులు పంచితే, ద్వితీయార్ధంలో రాహుల్ రామ‌కృష్ణ సందడి చేస్తారు. అలీ, బ్ర‌హ్మానందం, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌ర న‌టులున్నా ఆశించిన స్థాయిలో హాస్యం పండ‌లేదు. (Kushi Movie Review) ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే శ‌త్రుకి ఇందులో విభిన్న‌మైన పాత్ర దొరికింది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌ బ‌లం. హీష‌మ్ పాట‌లు ఎంత బాగున్నాయో, చిత్రీక‌ర‌ణ కూడా అంతే బాగుంది. ముర‌ళీ కెమెరా క‌శ్మీర్ అందాల్ని, ప్ర‌ధాన జోడీ మ‌ధ్య కెమిస్ట్రీని ఆక‌ట్టుకునేలా చూపించింది. ద్వితీయార్ధంలో ఎడిటింగ్ విభాగం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తాను న‌మ్మిన ఓ స‌గ‌టు క‌థ‌ని స్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌ల‌న్నీ రాసిన ఆయ‌న, క‌థ‌, స్క్రీన్‌ప్లే ర‌చ‌న‌పైన కూడా ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.  నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌
  • + విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జోడీ
  • + పాట‌లు... కుటుంబ నేప‌థ్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్థంలో కొన్ని  స‌న్నివేశాలు
  • - కొర‌వ‌డిన సంఘ‌ర్ష‌ణ‌
  • చివ‌రిగా: ఖుషి... విజ‌య్‌, స‌మంత జోడీ షో!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని