Love Me Review: రివ్యూ: లవ్‌ మి.. ఆశిష్‌, వైష్ణవి చైతన్య నటించిన మూవీ మెప్పించిందా?

Love Me Review Telugu: ఆశిష్‌, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో అరుణ్‌ భీమవరపు రూపొందించిన హారర్‌, రొమాంటిక్‌ మూవీ ఎలా ఉంది.

Published : 25 May 2024 14:20 IST

Love Me Review Telugu: చిత్రం: లవ్‌ మీ.. ఇఫ్‌ యు డేర్‌; నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రవికృష్ణ, సంయుక్త తదితరులు; ఛాయాగ్రహణం: పిసి శ్రీరామ్‌; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; రచన, దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు; నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి; విడుదల తేదీ: 25-05-2024

దిల్‌రాజు కుటుంబం నుంచి వచ్చి హీరోగా తెరకు పరిచయమయ్యారు ఆశిష్‌. తొలి ప్రయత్నంలో ‘రౌడీ బాయ్స్‌’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు రెండో ప్రయత్నంలో ‘లవ్‌ మీ’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘బేబీ’తో మెప్పించిన వైష్ణవి చైతన్య నాయికగా నటించడం.. టీజర్, ట్రైలర్లకు ఆదరణ దక్కడం.. ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (Love Me Review Telugu) మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా?

కథేంటంటే: అర్జున్‌ (ఆశిష్‌)కు దేవుడు, దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాలున్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి.. అవి లేవని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంటాడు. ఆ వీడియోలన్నింటినీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ విషయంలో అతనికి తన సోదరుడు ప్రతాప్‌ (రవికృష్ణ) కూడా సహాయ పడుతుంటాడు. ఈ క్రమంలో ఓసారి అర్జున్‌కు ప్రతాప్‌ ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ ఊరిలోని పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌లో ఆ దెయ్యం తిరుగుతోందని.. ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన చాలా మందిని హతమార్చిందని తెలుసుకుంటాడు. (Love Me Review Telugu) ఆ కథ విన్నాక అర్జున్‌ ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాడు. మరి ఆ తర్వాత తనెలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నాడు? దివ్యవతి కథేంటి? ఆమెకు గతంలో కనిపించకుండా పోయిన పల్లవి, నూర్, ఛరిష్మాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు దివ్యవతి కథను అర్జున్‌ దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కిన రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌. ఓ యువకుడు దెయ్యాన్ని ప్రేమలో దింపాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలెదురయ్యాయన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. పేపర్‌పై వినూత్నంగా అనిపించే ఈ కథను తెరపై అంతే కొత్తగా చూపించడం తేలికేం కాదు. దెయ్యాన్ని మనిషి ప్రేమించడమన్నది కన్విన్సింగ్‌గా చెప్పడం ఓ సవాల్‌. అయితే.. ఆ ప్రేమకథను కొత్తగా చూపించడమన్నది ఇంకో సవాల్‌. దానికి తోడు ఈ కథ కొంతమేర ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కోణంలో సాగుతుంది. (Love Me Review Telugu)  ఇలా రెండు జానర్లను మిళితం చేసి ఎలాంటి గందరగోళం లేకుండా ఓ కథను అనుకున్నట్లుగా చెప్పగలగడం కత్తి మీద సామే. ఈ విషయంలో కొత్త దర్శకుడు అరుణ్‌ భీమవరపు అనుభవం సరిపోలేదనిపిస్తుంది. తాను రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని లాజికల్‌గా ప్రేక్షకులు కన్విన్స్‌ అయ్యేలా చెప్పడంలో తడబడ్డారు. దీనికి తోడు సినిమాలో ట్విస్ట్‌లా సెట్‌ చేసి పెట్టుకున్న అమ్మాయిల మిస్సింగ్‌ పాయింట్‌ కథను, ప్రేక్షకుల్ని పూర్తిగా గందరగోళానికి గురి చేసింది.

అర్జున్‌ చిన్నతనంలో తన ఊరిలో జరిగిన ఓ అసాధారణమైన మిస్టరీని చూపిస్తూ కథను ఆరంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇక ఆ తర్వాత దెయ్యాలు లేవని నిరూపించడంలో అర్జున్‌ శక్తిసామర్థ్యాల్ని పరిచయం చేస్తూ ఓ హారర్‌ ఎపిసోడ్‌ తెరపైకి వస్తుంది. కానీ, అదంత థ్రిల్లింగ్‌గా అనిపించదు. అర్జున్‌ ప్రపంచం.. ప్రతాప్‌తో కలిసి చేసే ప్రయాణం.. ప్రియ పరిచయ సన్నివేశాలు.. అన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. ప్రియ.. దివ్యవతి కథను అర్జున్‌కు పరిచయం చేసినప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ దెయ్యాన్ని ప్రేమిస్తానంటూ అర్జున్‌ ఆమె అపార్టుమెంట్‌కు వెళ్లడం.. ఆరంభంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు.. అక్కడి ప్రపంచం.. అన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. (Love Me Review Telugu)  దీనికి తగ్గట్లుగానే ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా విరామ సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు బాగుంది. దివ్యవతి దెయ్యం కాదు బతికే ఉందని నిరూపించడం కోసం అర్జున్‌ చేసే అన్వేషణతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ముగ్గురు అమ్మాయిల ఎపిసోడ్‌ తెరపైకి వస్తుంది. ఆరంభంలో ఈ ముగ్గురికి.. దివ్యవతికి ఉన్న లింకేంటన్నది ప్రేక్షకుల్లోనూ ఆసక్తిరేకెత్తించినా.. ఆ తర్వాత దాని చుట్టూ నడిపిన డ్రామా బాగా గందరగోళానికి గురి చేసింది. ఇక ప్రియ పాత్రలోని ట్విస్ట్‌ ఊహలకు అందేదే అయినా అర్జున్‌ పాత్ర వెనకున్న చిన్న మిస్టరీ కాస్త సర్‌ప్రైజ్‌కు గురి చేస్తుంది. రెండో భాగానికి లీడ్‌ ఇస్తూ క్లైమాక్స్‌లో సెట్‌ చేసిన ట్విస్ట్‌ థ్రిల్లింగ్‌గానే ఉంది.

ఎవరెలా చేశారంటే: అర్జున్‌ పాత్రలో ఆశిష్‌ ఆద్యంతం సీరియస్‌గా ఒకే మూడ్‌లో కనిపించారు. నటన పరంగా అతనికి సవాల్‌ విసిరే అంశాలు దీంట్లో అంతగా ఏమీ లేవు. తన పాత్రకున్న సంభాషణలు కూడా చాలా తక్కువే. ప్రియ పాత్రలో వైష్ణవి తెరపై అందంగా కనిపించింది. ప్రథమార్ధంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేకున్నా.. ద్వితీయార్ధంలో కథ ఎక్కువగా తన చుట్టూనే తిరుగుతుంది. కొన్ని సీన్స్‌లో ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు చూసినప్పుడు ‘బేబీ’ ఛాయలు కనిపిస్తాయి. ప్రతాప్‌గా రవికృష్ణ పాత్ర పరిధి మేర ఉంటుంది. దర్శకుడు అరుణ్‌ రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొంత వరకు కథ అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది. సెకండాఫ్‌లో బాగా కంగాళిగా తయారైంది. ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ. పాటలు మరీ గుర్తుంచుకునేలా లేవు. ఈ కథకు తగ్గట్లుగా పిసి శ్రీరామ్‌ డార్క్‌ టోన్డ్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + కొన్ని ట్విస్టులు.. హారర్‌ అంశాలు
  • + విరామ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - ఆసక్తిరేకెత్తించని స్క్రీన్‌ప్లే
  • - గందరగోళపరిచే ద్వితీయార్ధం
  • చివరిగా: లవ్‌ మీ.. వాచ్‌ ఇఫ్‌ యు డేర్‌! (Love Me Review Telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు