Meet Cute Review: రివ్యూ: మీట్‌ క్యూట్‌.. నాని సోదరి డైరెక్షన్‌ ఎలా ఉందంటే?

నటుడు నాని సోదరి దీప్తి దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే..?

Published : 25 Nov 2022 17:05 IST

వెబ్‌ సిరీస్‌: మీట్‌ క్యూట్‌; నటీనటులు: అదా శర్మ, రుహానీ శర్మ, వర్ష బొల్లమ్మ, సత్యరాజ్‌, రాజ్‌ చెంబోలు, రోహిణి, ఆకాంక్ష సింగ్‌, అశ్విని కుమార్‌ లక్ష్మికాంతన్‌, శివ కందుకూరి, సునైన తదితరలు; సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌; ఎడిటింగ్‌: గ్యారీ బి. హెచ్‌; సినిమాటోగ్రఫీ: వసంత్‌కుమార్‌; నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపర్నేని; దర్శకత్వం: దీప్తి; స్ట్రీమింగ్‌: సోనీలివ్‌.

నటుడిగానే కాదు నిర్మాతగానూ కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇస్తుంటారనే పేరుంది నానికి (Nani). ‘అ!’, ‘హిట్‌’వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆ జాబితాలోకి ఇటీవల ‘మీట్‌ క్యూట్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేరింది. ప్రశాంతి త్రిపర్నేనితో కలిసి ఆయన ఆ సిరీస్‌ను నిర్మించారు. తన సోదరి దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేశారు. ఎక్కువమంది ఆర్టిస్టులు ఉండటం, నాని సోదరి డైరెక్షన్‌ చేశారనడంతో ఈ సిరీస్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి, ‘సోనీలివ్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘మీట్‌ క్యూట్‌’ కథేంటి? దర్శకురాలిగా దీప్తి మెప్పించారా? (Meet Cute Review)

ఇదీ కథ (లు): ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇది. దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరోదానికి సంబంధం ఉండదు. స్వాతి (వర్ష బొల్లమ్మ) తన అమ్మ చెప్పిందని పెళ్లి చూపుల్లో భాగంగా అభి (అశ్విని కుమార్‌ లక్ష్మికాంతన్‌)ని కలుస్తుంది. మాటల మధ్యలో అభి.. కావాలనే మ్యాట్రిమోనీ సైట్‌లో వివరాలు తప్పు ఇచ్చానని స్వాతితో చెబుతాడు. అభి అబద్ధం ఎందుకు చెప్పాడు? స్వాతి అతణ్ని క్షమిస్తుందా? అనేది తొలి ఎపిసోడ్‌ ‘మీట్‌ ది బాయ్‌’. సరోజ (రుహానీ శర్మ), మోహన్‌రావు (సత్యరాజ్‌) వీసా ఆఫీసులో కలుసుకుంటారు. ఆ పెద్దాయనకు సాయం చేసిన సరోజ తన కాపురంలో వచ్చిన కలహాల గురించి వివరిస్తుంది. తన అనుభవంతో మోహన్‌రావు.. సరోజ ఆలోచనను మార్చగలిగాడా? అనేది ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ ఎపిసోడ్‌. భర్తకు దూరమై, ఆర్కిటెక్ట్‌గా పనిచేసే పూజ (ఆకాంక్షసింగ్‌).. సిద్ధు (దీక్షిత్‌ శెట్టి) అనే యువకుడికి దగ్గరవుతుంది. వీరి వ్యవహారం గురించి తెలుసుకున్న సిద్ధు తల్లి పద్మ (రోహిణి) ఏం చేసింది? అనేది ‘ఇన్‌ లవ్‌’ ఎపిసోడ్‌ కాన్సెప్ట్‌. అమన్‌ (శివ కందుకూరి) వైద్యుడు. ఓ రాత్రి.. షాలిని (అదాశర్మ) అనే నటికి కారులో లిఫ్ట్‌ ఇచ్చి, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె నటి అని తెలియని అమన్‌ తన ఇష్టాయిష్టాలు చెబుతాడు. మరి, షాలిని యాక్టర్‌ అనే విషయం అమన్‌కు తెలిసిందా, లేదా? అంటే ‘స్టార్‌ స్ట్రక్‌’ ఎపిసోడ్‌ చూడాల్సిందే. అజయ్‌ (గోవింద్‌ పద్మసూర్య) అనే వ్యక్తితో కిరణ్‌ (సునైన)కు బ్రేకప్‌ అవుతుంది. ఆ తర్వాత, అజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న అంజన (సంచిత)ను కలిసి ఏం వివరించింది? అన్నది ‘ఎక్స్‌ గాళ్‌ఫ్రెండ్‌’లో తెలుస్తుంది.

ఇంతకీ ఎలా ఉందంటే..? ‘‘అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే చోటుచేసుకునే పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అంటూ ప్రచార చిత్రాల ద్వారానే ‘మీట్‌ క్యూట్‌’కు అర్థం చెప్పారు దర్శకనిర్మాతలు. దాంతో, ఈ సిరీస్‌ ఏ నేపథ్యంలో రూపొందిందో అప్పుడే అర్థమై ఉంటుంది. తొలి కథలో ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే హీరోహీరోయిన్ల మధ్య సంభాషణలు సాగుతుంటాయి. అమ్మానాన్నల బలవంతంతో అమ్మాయి.. అబ్బాయిని పెళ్లి చూపులు చూడటం.. ఆ అబ్బాయి అమ్మాయికి ఫ్లాట్‌ అవడం.. తదితర సన్నివేశాలు ఎక్కడో చూసినట్టే ఉంటాయి. మాటలూ పెద్దగా ప్రభావం చూపవు. రెండో ఎపిసోడ్‌లో తరంవారు తమ అభిప్రాయాలకే విలువ ఇస్తారేగాని ఇతరులు చెప్పింది వినిపించుకోరని, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే దాన్ని రెండో ఎపిసోడ్‌లో చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఎమోషన్‌ అంతగా పండలేదు.

భర్తను పోగొట్టుకున్న/దూరం చేసుకున్న ఆడవారి మనోభావాలు ఎలా ఉంటాయి? మరో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారా? అనేదాన్ని సీరియస్‌గా చూపిస్తూనే.. తన కొడుకు చేసే చిలిపి పనుల గురించి తెలుసుకున్న తల్లి పాత్రతో హాస్యం పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ ‘ఇన్‌ లవ్‌’ ఎపిసోడ్‌ సిరీస్‌కు ప్రధానబలంగా నిలిచింది. నాలుగో ఎపిసోడ్‌ విషయాకొస్తే.. డాక్టర్‌, యాక్టర్‌ల కాంబోలో వచ్చే సీన్స్‌ను మరింత బలంగా రాసుంటే బాగుండేది. ఇద్దరి మధ్య సాగే సంభాషలు రొటీన్‌గా అనిపిస్తాయి. ఎన్నో విషయాలపై పట్టున్న డాక్టర్‌కు ఫేమస్‌ అయిన యాక్టర్‌ తెలియదా? అనే సందేహం కలగకమానదు. చివరి ఎపిసోడ్‌ ఓ ట్విస్ట్‌ మినహా సాగదీత అనిపిస్తుంది. ‘వాడికేం తెలియదు నాన్న? మీరు బాధపడకండి’ అని కూతురు పాత్ర ఓదారుస్తుంటే.. ‘వాడికే తెలుసమ్మా’ అని తండ్రి పాత్ర చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తుంది. అయితే, ఎలాంటి ద్వందార్థాలు లేకుండా అటు యువతకు, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా కథలను చెప్పడం ప్రస్తుత రోజుల్లో ఓ సాహసమే. 

ఎవరెలా చేశారంటే..? సీనియర్‌ నటులు సత్యరాజ్‌, రోహిణిలు తమ అనుభవంతో పాత్రకు వన్నె తెచ్చారు. వయసు మీద పడిన వ్యక్తిగా సత్యరాజ్‌, తల్లిపాత్రలో రోహిణి ఒదిగిపోయారు. ఆకాంక్ష సింగ్ పాత్రకు స్కోప్‌ ఎక్కువ ఉంది. వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, అదా శర్మ, సునయన ఆకట్టుకుంటారు. శివ కందుకూరి, అశ్విని కుమార్‌ లక్ష్మికాంతన్‌, దీక్షిత్‌ శెట్టి, గోవింద్‌ పద్మసూర్య తదితరులు ఫర్వాలేదనిపిస్తారు. నిర్మాణపరంగా సిరీస్‌ ఓకే అనిపిస్తుంది. కథకో పాట, నేపథ్యానికి తగ్గట్టు విజయ్‌ అందించిన సంగీతం అలరిస్తుంది. వసంత్‌ సినిమాటోగ్రఫీ క్లాసీగా ఉంది. గ్యారీ ఈ కథలను అక్కడక్కడా ‘కట్‌’ చేయాల్సింది. రచనపరంగా దీప్తి ఎలా ఉన్నా.. ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించింది కొత్తవారనే అనుమానం రానేరాదు.

బలాలు: + తారాగణం; + మూడో ఎపిసోడ్‌లో కామెడీ ;  సందర్భానుసారం వచ్చే పాటలు

బలహీనతలు: - తెలిసిన కథలుకావడం; -  సాగదీత సన్నివేశాలు

చివరిగా: ఈ సిరీస్‌లో కొన్ని మాత్రమే ‘క్యూట్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు