mem famous movie review: రివ్యూ: మేమ్ ఫేమ‌స్‌

mem famous movie review: సుమంత్‌ ప్రభాస్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్‌ ఫేమస్‌’ ఎలా ఉందంటే?

Updated : 26 May 2023 10:00 IST

చిత్రం: మేమ్‌ ఫేమస్‌; న‌టీన‌టులు: సుమంత్ ప్ర‌భాస్‌, మ‌ణి ఏగుర్ల‌, మౌర్య‌, సార్య, సిరి రాశి, శివ నంద‌న్‌, అంజి మామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, కిర‌ణ్ మ‌చ్చా త‌దిత‌రులు, సంగీతం: క‌ల్యాణ్ నాయ‌క్‌, ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ దూపాటి, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: సుమంత్ ప్ర‌భాస్‌, నిర్మాత‌లు: అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర‌, చంద్రు మ‌నోహ‌ర్‌, విడుద‌ల తేదీ: 26-05-2023

ఇటీవల చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. యువ దర్శకులు సైతం మంచి పాయింట్‌ను తీసుకుని, తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ ఉన్న చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ వారం చిన్న చిత్రాలదే హవా. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘మేమ్‌ ఫేమస్’. మరి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథేంటి? సినిమా ఎలా ఉంది?

క‌థేంటంటే: మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య), దుర్గ (మణి ఏగుర్ల) చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. బండ‌న‌ర్సింప‌ల్లిలో అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ జీవితాన్ని స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు.  వాళ్లు చేసే గొడ‌వ‌లతో ఊరి ర‌చ్చ‌బండ ఎప్పుడూ పంచాయితీల‌తోనే క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. అయితే, ఊరిలో ప్ర‌తి ఒక్క‌రి చేత తిట్టించుకున్న ఈ ముగ్గురూ ఎలాగైనా ఫేమ‌స్ అయ్యి అంద‌రితో శభాష్ అనిపించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. మ‌రి అందుకోసం మ‌యి త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఏం చేశాడు?  ఫేమ‌స్ అయ్యేందుకు వాళ్లు ఎంచుకున్న దారేంటి? ఈ ప్ర‌యాణంలో పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్ మచ్చా), అంజి మామ (అంజి మామ మిల్కూరి) వాళ్ల‌కు ఎలా స‌హాయ‌ప‌డ్డారు. మ‌యి, బాలిల ప్రేమ క‌థ‌లు ఏ గమ్యానికి చేరాయి? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: క‌థ‌గా చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్న లైన్‌. ముగ్గురు ఆవారా కుర్రాళ్లు ఎలాగైనా ఫేమ‌స్ అయ్యి అంద‌రితో శ‌భాష్ అనిపించుకునేందుకు ఏం చేశారు?  దాని కోసం ఎలాంటి దారి ఎంచుకున్నారు? ఈ క్ర‌మంలో వాళ్ల‌కు ఎదురైన స‌వాళ్లు ఏంటి? అన్న‌ది అస‌లు క‌థ‌.  ఈ క‌థ విన‌గానే ప్ర‌తి ఒక్క‌రికీ అనుకోకుండానే జాతిర‌త్నాలు సినిమానే మ‌దిలో మెదులుతుంది. ఎందుకంటే అందులోని మూడు ప్ర‌ధాన పాత్ర‌ల నేప‌థ్యానికి త‌గ్గ‌ట్లుగానే ఇందులోని కీలక పాత్ర‌లు క‌నిపిస్తాయి. అయితే వాళ్ల ప్ర‌యాణంలో పండే న‌వ్వులు.. ఎదుర‌య్యే ట్విస్ట్‌లు.. బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ ఈ క‌థ‌లో మ‌చ్చుకైనా క‌నిపించ‌దు. నిజానికి సినిమా మొత్తం చూశాక తొలుత‌ ట్రైల‌ర్ క‌ట్ చేసిన ఎడిట‌ర్ ప్ర‌తిభ‌ను మెచ్చుకోవాల‌నిపిస్తుంది. విష‌య‌మే లేని సినిమాలో నుంచి  'ఏదో ఉంది. చూడాలి' అని ఆస‌క్తి పుట్టించేలా ప్ర‌చార చిత్రాలు క‌ట్ చేసినందుకు. ఇక చిత్ర విష‌యానికొస్తే ఓ క్రికెట్ ఎపిసోడ్‌తో సినిమా సాదాసీదాగా ప్రారంభ‌మ‌వుతుంది. అక్క‌డి నుంచి మ‌యి, బాలి, దుర్గా జీవితాల‌ను ప‌రిచ‌యం చేస్తూ అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అయితే, వారిలో ఏ ఒక్క‌రి క‌థ‌లోనూ అంత‌గా డెప్త్ క‌నిపించ‌దు. మ‌యీ బ్యాచ్ త‌ర‌చూ ఏదోక గొడ‌వ పెట్టుకోవ‌డం.. ఊరి పెద్ద‌లు ర‌చ్చ‌బండ ద‌గ్గ‌ర పంచాయితీ పెట్ట‌డం.. స‌ర్పంచ్ నాలుగు చీవాట్లు పెట్టి ఆ వెంట‌నే సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులోని వెంక‌టేష్ త‌ర‌హాలో ద‌గ్గ‌ర‌కు తీసుకొని డ‌బ్బు సాయం చేయ‌డం.. ఇదేం సిల్లీ న్యూసెన్స్ అనిపిస్తుంది. ఇక మ‌ధ్య‌లో వ‌చ్చే పెళ్లి బరాత్ సీక్వెన్స్‌, మ‌యి - మౌనీక‌ల ప్రేమ క‌థ.. బాలీ-బ‌బ్బీల ల‌వ్ ట్రాక్.. ఏ ఒక్క‌టీ ఆస‌క్తిరేకెత్తించ‌దు.

ఎప్పుడైతే మ‌యి ఫేమ‌స్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకుంటాడో అప్ప‌టి నుంచి క‌థ‌లో కాస్త క‌ద‌లిక వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అయితే, ఆ త‌ర్వాత ఫేమ‌స్ టెంట్ హౌస్ అనే కాన్సెప్ట్ ఎత్తుకొని ఓ సాగ‌తీత వ్య‌వ‌హారంతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి మ‌రింత ప‌రీక్ష పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఓ ఎమోష‌నల్ సీక్వెన్స్‌లో ప్ర‌థమార్థానికి విరామ‌మిచ్చిన తీరు ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ద్వితీయార్థ‌మంతా మ‌యి బ్యాచ్ ఫేమ‌స్ అయ్యేందుకు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టి ఎలాంటి పాట్లు ప‌డ్డార‌న్న‌ది చూపించారు. అందులోనూ ఏ కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. పైగా ఇందులో బ‌ల‌వంతంగా కొన్ని ఫ్యామిలీ ఎమోష‌న్ ట్రాక్స్ ఇరికించి క‌థ‌ను బ‌రువెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ద్వితీయార్థంలో లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ పాత్ర అక్క‌డ‌క్క‌డా కాస్త‌ నవ్వులు పంచుతుంది. ప‌తాక స‌న్నివేశాలు, సినిమాని ముగించిన తీరు ఏమాత్రం మెప్పించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: హీరోగా మ‌యి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో సుమంత్ ఫ‌ర్వాలేద‌నిపించాడు. న‌ట‌న‌లో ఇంకా ప‌రిణ‌తి సాధించాల్సి ఉంది. అత‌ని స్నేహితుల పాత్ర‌ల్లో మ‌ణి, మౌర్య ప‌రిధి మేర‌కు చేసుకుంటూ వెళ్లారు. క‌థానాయిక‌లిద్ద‌రూ ప‌క్కింటి అమ్మాయిల త‌ర‌హాలో చాలా సింపుల్‌గా క‌నిపించారు. కానీ, న‌ట‌న ప‌రంగా వారికి పెద్ద స్కోప్ దొర‌క‌లేదు. అంజిమామ‌, కిర‌ణ్ మ‌చ్చా, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల పాత్ర‌లు గుర్తుంచుకునేలా ఉంటాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ పాత్ర‌లో న‌టించిన శివ‌నంద‌న్ కామెడీ టైమింగ్ బాగుంది. సుమంత్ రాసుకున్న క‌థ‌లో ఏమాత్రం బ‌లం లేదు. కొత్త‌ద‌న‌మూ క‌నిపించ‌లేదు.  పేప‌ర్‌పై ఉన్న కామెడీని, భావోద్వేగాల్ని అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా తెర‌పైకి తీసుకురాలేక‌పోయాడు.  అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి. అక్క‌డ‌క్క‌డా క‌నిపించే యూత్ ఫుల్ కామెడీతో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే కొన్ని స‌న్నివేశాలున్నాయి.  సింక్ సౌండ్ చాలా చోట్ల తేడా కొట్టిన‌ట్లు అనిపిస్తుంది. పాట‌లేవీ గుర్తుంచుకునేలా లేవు.  నేపథ్య సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

బలాలు

+ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించే యూత్ ఫుల్ కామెడీ

+ విరామ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- కొత్త‌ద‌నం లేని క‌థ‌

- సాగ‌తీత‌గా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా:  మరీ అంత ‘ఫేమ‌స్’ అయితే కాదు(mem famous movie review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని