ooru peru bhairavakona review: రివ్యూ: ఊరు పేరు భైరవకోన.. సందీప్‌ నటించిన ఫాంటసీ డ్రామా మెప్పించిందా?

ooru peru bhairavakona review: సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎలా ఉంది?

Updated : 16 Feb 2024 16:23 IST

ooru peru bhairavakona movie review; చిత్రం: ఊరు పేరు భైరవకోన; నటీనటులు: సందీప్‌ కిషన్‌, కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్‌, హర్ష, పి.రవిశంకర్‌ తదితరులు; సంగీతం: శేఖర్‌ చంద్ర; సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట; ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌; సంభాషణలు: నందు సవిరిగణ; కథ: భాను భోగవరపు; నిర్మాత: రాజేష్‌ దండ, బాలాజీ గుట్ట, అనిల్‌ సుంకర; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌; విడుదల: 15-02-2024

సందీప్‌కిషన్‌కు సరైన విజయం దక్కి చాలా కాలమైంది. అలాగని ప్రయోగాలు చేయడంలో తనేం వెనకడుగేయడం లేదు. కాకపోతే ఇంత వరకూ ఏదీ మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి విజయమే లక్ష్యంగా ‘ఊరి పేరు భైరవకోన’ అనే సోషియో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలు అందరి దృష్టినీ ఆకర్షించడంతో ఈ సినిమాపై చక్కటి అంచనాలేర్పడ్డాయి. మరి ఈ ‘భైరవ కోన..’ కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిచ్చింది?(ooru peru bhairavakona review in telugu) సందీప్‌కు విజయాన్ని అందించిందా?

కథేంటంటే: భైరవకోన ఓ మార్మిక ప్రపంచం. ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలో రాత్రి వేళ మాత్రమే ఆ ఊరి తలుపులు తెరచుకుంటుంటాయి. అందులోకి ప్రవేశించిన వాళ్లే తప్ప.. ప్రాణాలతో బయటకొచ్చిన వాళ్లు ఎవరూ ఉండరు. ఓరోజు రాత్రి పెళ్లిలో దొంగతనం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ అలియాస్‌ బసవ లింగం (సందీప్‌ కిషన్‌).. తన ఫ్రెండ్‌ జాన్‌ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్‌)తో పాటుగా ఆ ఊరిలోకి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? భైరవకోనలో బసవకు ఎలాంటి పరిస్థితులెదురయ్యాయి? అసలు ఆ కోన కథేంటి? దానికి గరుడపురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు ఉన్న లింకేంటి? స్టంట్‌మ్యాన్‌ బసవ తనకు అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ) కోసం దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? భైరవకోన నుంచి బసవ గ్యాంగ్‌ ప్రాణాలతో బయటపడిందా?(ooru peru bhairavakona review in telugu) లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే: ప్రేమించిన అమ్మాయి లక్ష్యాన్ని నేరవేర్చడం కోసం కథానాయకుడు చేసిన ఓ సాహసోపేతమైన ప్రయాణమే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దీన్ని భైరవకోన అనే ఓ ఊహా ప్రపంచంలో సెట్‌ చేసి.. దానికి గరుడ పురాణంతో ముడిపెట్టి ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ తీర్చిదిద్దాలనుకున్నా తెరపై ఆ స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు. భైరవకోన పరిచయ సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే ఆరంభమవుతుంది. బసవ పెళ్లి ఇంట్లో నగలు దొంగతనం చేసి.. ఒంటికి నిప్పంటించుకొని ఆ ఇంటి నుంచి బయటపడటం.. ఈ క్రమంలో పోలీసులు అతన్ని వెంబడించడం.. ఇలా కథ కాస్త వేగంగానే ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. (ooru peru bhairavakona review in telugu) కాకపోతే ఆ వేగానికి బ్రేకులు వేసినట్లుగా అకస్మాత్తుగా బసవ గతం తెరపైకి వస్తుంది. భూమి బ్యాగ్‌ను ఓ బ్యాచ్‌ కొట్టేయడం.. వాళ్లను వెంబడిస్తున్న క్రమంలో ఆమెకు బసవ తారసపడటం.. ఆమెతో కలిసి తను ఆ దొంగల వెంటపడటం.. అదే సమయంలో ఓ పాట.. ఇలా సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఈ ఎపిసోడ్‌ ముగిసి కథ మళ్లీ వర్తమానంలోకి వచ్చాకే సినిమాలో కదలిక కనిపిస్తుంది. బసవ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన కారుతో పాటుగా భైరవకోనలోకి ప్రవేేశించడం.. ఈ క్రమంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు మొదట్లో కాస్త ఉత్సుకతను కలిగించేలాగే ఉంటాయి. కానీ, కథలో ముందుకెళ్లే కొద్దీ ఏదో థ్రిల్‌ను రుచి చూడనున్నామని అనుకున్న ప్రతిసారీ ఆశాభంగమే కలుగుతుంది. ఇక విరామానికి ముందు రాజప్ప కోటలో బసవకు ఎదురయ్యే భయానక అనుభవం.. అదే సమయంలో భైరవకోన వెనకున్న ట్విస్ట్‌ను బయటపెట్టిన తీరు థ్రిల్‌ చేస్తాయి.

గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు భైరవకోనకూ ఉన్న లింకేంటన్నది చూపిస్తూ ద్వితీయార్ధం మొదలవుతుంది. కానీ, అది ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోదు. బసవ - భూమిల లవ్‌ట్రాక్‌లో పెద్దగా బలం కనిపించదు. ఇక దెయ్యాల దగ్గరున్న తన నగల్ని తిరిగి కొట్టేయడం కోసం బసవ ఆడే డ్రామా మరీ ఆసక్తిరేకెత్తించకున్నా కాసేపు నవ్వులు పంచుతుంది. ఇక భూమి చావుకు వెనకున్న కారణం.. దాన్ని బయట పెట్టిన తీరు బాగున్నాయి. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: బసవ పాత్రలో సందీప్‌ చక్కగా ఒదిగిపోయాడు. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించేంత స్కోప్‌ దీంట్లో ఏమీ లేదు. యాక్షన్, ఎమోషనల్‌ సీన్స్‌ను తనదైన అనుభవంతో తేలికగా చేసుకెళ్లిపోయాడు. భూమి పాత్రలో వర్షను చూపించిన తీరు.. ఆమె కనబరిచిన నటన ఆకట్టుకుంటాయి. కావ్య పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. రాజప్ప పాత్రలో రవిశంకర్‌ కనిపించిన తీరు.. ఆయన నటన ఆకట్టుకుంటాయి. కానీ, దీంట్లో ఆ పాత్ర బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కనిపించిన ప్రతిసారీ నవ్వులు పంచే ప్రయత్నం చేశాయి. (ooru peru bhairavakona review in telugu) పెద్దమ్మగా వడివుక్కరసు పాత్రను భారీ బిల్డప్‌తో పరిచయం చేశారు కానీ, అదే టెంపోను ఆద్యంతం కొనసాగించలేకపోయారు. దర్శకుడు ఆనంద్‌ ఎంచుకున్న కథలో సరైన బలం లేదు. అలాగే భైరవకోన ప్రపంచం.. దాంట్లోని పాత్రలు.. దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఇక నాయకానాయికల ప్రేమకథలోనూ పెద్దగా ఫీల్‌ కనిపించలేదు. శేఖర్‌ చంద్ర సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ‘నిజమే నే చెబుతున్నా’, ‘హమ్మ హమ్మ’ పాటలు తెరపైనా అలరిస్తాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇప్పుడున్న ప్రమాణాలతో పోల్చితే కాస్త తక్కువే. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + సందీప్‌ నటన
  • + కథలోని కొన్ని ట్విస్ట్‌లు
  • + విరామ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - బలహీనమైన కథ
  • - బలమైన సంఘర్షణ లేకపోవడం
  • చివరిగా: ‘భైరవకోన’.. అక్కడక్కడా థ్రిల్‌ పంచే ప్రయాణం (ooru peru bhairavakona review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని