Paramporul: రివ్యూ: పరంపోరుల్‌: వెయ్యేళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని విక్రయించాలనుకున్న వారి పరిస్థితేంటి?

శరత్‌ కుమార్, అమితాష్‌ ప్రధాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పరంపోరుల్‌’. ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 01 Feb 2024 17:49 IST

చిత్రం: పరంపోరుల్‌; తారాగణం: శరత్‌ కుమార్‌, అమితాష్‌ ప్రధాన్‌, కశ్మీరా పరదేశి, బాలాజీ శక్తివేల్‌, టి. శివ, విన్సెంట్‌ అశోకన్‌ తదితరులు; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; ఛాయాగ్రహణం: ఎస్‌. పాండికుమార్‌; కూర్పు: నగూరన్‌ రామచంద్రన్‌; నిర్మాతలు: మనోజ్‌, గిరీశ్‌; రచన, దర్శకత్వం: సి. అరవింద్‌ రాజ్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ (ETV Win) వారానికో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. లాస్ట్‌ వీక్‌ ‘లిటిల్‌ మిస్‌ నైనా’ (Little Miss Naina)ను అందించగా ఈ వారం ‘పరంపోరుల్‌’ (Paramporul)ని రిలీజ్‌ చేసింది. శరత్‌ కుమార్‌, అమితాష్‌ ప్రధాన్‌ ప్రధాన పాత్రల్లో సి. అరవింద్‌ రాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుని ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చింది. మరి, ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందామా (Paramporul review in telugu)..

కథేంటంటే?: గౌరి (అమితాష్‌ ప్రధాన్‌) నచ్చింది చేయాలనుకునే వ్యక్తిత్వం ఉన్న యువకుడు. కుటుంబ సభ్యుల మాట పట్టించుకోడు. అతడి సోదరి జీర్ణ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటుంది. చికిత్సకు దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతారు. మరోవైపు, పోలీసు అధికారి అయిన మైత్రేయన్‌ (శరత్‌ కుమార్‌) కొన్ని కారణాలతో అవినీతికి పాల్పడతాడు. కష్టపడకుండా రూ. కోట్లు రావాలనుకుంటాడు. దాని కోసం గౌరిని పావుగా వినియోగించుకోవాలనుకుంటాడు. సిస్టర్‌ లైఫ్‌ బాగుండాలనే ఉద్దేశంతో గౌరి.. ఆ పోలీసుతో చేయి కలుపుతాడు. రూ. వేల కోట్ల విలువైన, సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురైన సవాళ్లేంటి? ఆ విగ్రహం ఎక్కడది? అసలు వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? వారి డబ్బు ఆశ తీరిందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (Paramporul review in telugu).

ఎలా ఉందంటే?: సిస్టర్- బ్రదర్‌ సెంటిమెంట్‌, మాఫియా అంశాలతో రూపొందిన సినిమా ఇది. ప్రతీకారం అంతర్లీనంగా ఉంటుంది. అటుఇటుగా ఇదే తరహాలో పలు చిత్రాలొచ్చాయి. రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ కూడా అలాంటిదే. కానీ, ఇందులోని కథనం పూర్తిగా వేరు. పొలంలో పనిచేస్తుండగా ఓ వృద్ధ రైతుకు విగ్రహం కంటపడడం, దాన్ని కొనేందుకు మాఫియా ముఠా నాయకుడు క్రూరత్వాన్ని ప్రదర్శించే సన్నివేశాలతో ఆరంభవుతుందీ చిత్రం. ప్రధాన పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్న ద‌ర్శ‌కుడు.. ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌ని మొద‌లుపెట్టారు. విగ్రహాన్ని అమ్మేందుకు గౌరి, మైత్రేయన్‌ స్కెచ్‌ వేసే సీన్‌ నుంచి ఎండ్‌ వరకు స్టోరీని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు. ప్రధాన పాత్రలు.. డీలర్లతో చర్చలు జరిపే ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిలో ఉత్కంఠ నెలకొనేలా తీర్చిదిద్దారు. మలుపులతో థ్రిల్‌ పంచారు. మైత్రేయన్ పాత్ర ముందు నుంచీ ఒకే టెంపోని కొనసాగించడంతో దానిపై ఆడియన్స్‌కు అవగాహన వస్తుంది. కానీ, గౌరి క్యారెక్టర్‌ ఊహించని విధంగా మారుతుంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుంటుంది. ఆయా సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో నేపథ్య సంగీతం కీలకంగా నిలిచింది. సెంటిమెంట్‌ ప్రధానం కాబట్టి గౌరి కుటుంబ నేపథ్యాన్ని వివరంగా చెప్పి ఉంటే బాగుండేది. హీరో పేరెంట్స్‌ పాత్రలు అసంపూర్ణంగా ఉంటాయి (Paramporul review in telugu).

డీలర్‌ను మోసం చేసేందుకు గౌరి, మైత్రేయన్‌ ప్రణాళికలు రచించే ట్రాక్స్‌తోనే సెకండాఫ్‌ సాగుతుంది. ఆడియన్స్‌ను తన కథలో లీనమయ్యేలా చెయ్యాలనే ఇంటెన్షన్‌తో దర్శకుడు లాజిక్స్‌ను వదిలేశారు. విలన్‌ పాత్రలు పెద్దగా ప్రభావం చూపవు. ‘హీరోయిన్‌ రోల్‌ అనవసరం’ అని ఫస్టాఫ్‌లో అనిపించినా ఆ పాత్రకు ఉన్న స్కోప్‌ ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. ఓ ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌ విషయంలోనూ అంతే. ఈ రెండు క్యారెక్టర్లను ప్రధాన పాత్రలకు లింక్‌ చేసిన తీరు బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. అది రివీల్‌ అయిన తర్వాత స్టోరీ మరో కోణంలో కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే?: గతంలో పోలీసు అధికారి పాత్రల్లో మెప్పించిన శరత్‌ కుమార్‌ ఇందులో నెగెటివ్ ఛాయలున్న ఇన్‌స్పెక్టర్‌గా నటించడం గమనార్హం. మనీ మైండెడ్‌ మైత్రేయన్‌గా వైవిధ్యం ప్రదర్శించారు. సోదరిని బతికించుకునేందుకు దేనికైనా సిద్ధపడే అన్నయ్యగా గౌరి పాత్రలో అమితాష్‌ ఒదిగిపోయారు. ఈ ఇద్దరే తెరపై ఎక్కువగా కనిపిస్తారు. అమితాష్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. రామ్‌ చరణ్‌ ‘బ్రూస్‌ లీ’, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌ కశ్మీరా పరదేశి క్యారెక్టర్‌ నిడివి తక్కువే అయినా అభినయంతో ఆకట్టుకుంది. బాలాజీ శక్తివేల్, టి. శివ, విన్సెంట్‌ అశోకన్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగానికొస్తే.. యువన్‌ శంకర్‌ రాజా అందించిన నేపథ్య సంగీతం కీలకం. పాండికుమర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రామచంద్రన్‌ ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఇందులో మూడు పాటలున్నాయి. అవి తీసేసినా వచ్చే సమస్యేంలేదు. రేసీగా సాగే స్టోరీకి స్పీడ్‌ బ్రేకర్లుగా మారాయి. దర్శకుడు సి. అరవింద్‌ రాజ్‌ తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్రవేశారు. ఇంతకీ ‘పరంపోరుల్‌’ అంటే ఏంటో తెలుసా?.. పవర్స్‌ కలిగిన వాడు.

  • బ‌లాలు
  • + కథనం
  • + సెకండాఫ్‌లో ట్విస్ట్‌
  • + శరత్‌ కుమార్‌, అమితాష్‌ ప్రధాన్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • స్పష్టతలేని పలు పాత్రలు
  • - పాటలు
  • చివ‌రిగా: ఈ ‘పరంపోరుల్‌’ పవర్‌ఫుల్‌ (Paramporul review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని