Pindam movie review: ‘పిండం’ రివ్యూ.. హారర్‌ మూవీ ఎలా ఉందంటే!

శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన ‘పిండం’ ఎలా ఉందంటే..

Updated : 15 Dec 2023 17:53 IST

Pindam movie review telugu: తారాగణం: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు, కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి, నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి, ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ దైదా, విడుద‌ల‌: 15 డిసెంబ‌ర్ 2023, సంస్థ: క‌ళాహి మీడియా.

ఒక‌ప్పుడు హార‌ర్ చిత్రాల‌కి కేరాఫ్‌లా క‌నిపించేది టాలీవుడ్‌. ఇటీవల వాటి ప్ర‌భావం త‌గ్గింది. అయినా స‌రే... అప్పుడ‌ప్పుడూ ఈ జాన‌ర్‌ని స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. ‘మ‌సూద‌’ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది ‘పిండం’ (Pindam). ది స్కేరియ‌స్ట్ ఫిలిం ఎవ‌ర్.. అనే ఉప‌శీర్షిక‌తో ఈ సినిమా రూపుదిద్దుకోవ‌డం.. ప్ర‌చార చిత్రాలు కూడా ఆస‌క్తిని పెంచ‌డంతో సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురు చూశారు హార‌ర్ అభిమానులు. మ‌రి ఈ చిత్రం ఏమాత్రం భ‌య‌పెడుతోందో తెలుసుకుందాం ప‌దండి..(Pindam movie review).

క‌థేంటంటే?
అన్న‌మ్మ (ఈశ్వ‌రీరావు) త‌న తండ్రి ద్వారా అబ్బిన తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మ‌లు ఆవ‌హించిన‌ప్పుడు త‌న‌దైన శైలిలో ప‌సిగ‌ట్టి, వాటి నుంచి విముక్తి క‌ల్పిస్తూ స్వాంత‌న చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శ‌క్తుల‌పై ప‌రిశోధ‌న చేస్తున్న లోక్‌నాథ్ (శ్రీనివాస్ అవ‌స‌రాల‌) అన్న‌మ్మ వద్దకు వ‌స్తాడు. ఆ క్ర‌మంలో 1990ల నాటి ఓ సంఘ‌ట‌న గురించి చెబుతుంది అన్న‌మ్మ‌. త‌నలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే స‌వాల్ విసిరిన ఆంథోనీ కుటుంబం క‌థ అది. సుక్లాపేట్‌లోని ఓ  రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా ప‌నిచేసే ఆంథోనీ (శ్రీరామ్) త‌న భార్య మేరీ (ఖుషి ర‌వి), పిల్ల‌లు సోఫీ, తారాల‌తో క‌లిసి ఊరి చివ‌ర‌ ఉండే ఓ ఇంటిని కొని అందులో చేర‌తాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన నాటి నుంచి గ‌ర్భంతో ఉన్న  మేరీ మిన‌హా అందరూ కూడా ఆత్మ‌ల బారిన ప‌డి ఇబ్బందుల‌కి గుర‌వుతారు. ఆ ఇంటిని వ‌దిలిపెట్టి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా ఆ ఆత్మ‌లు వ‌దిలిపెట్ట‌వు. (Pindam movie review) ఇంత‌కీ ఆ ఆత్మ‌లు ఎవ‌రివి? వాటి నుంచి ఆంథోనీ కుటుంబానికి ఎలా విముక్తి లభించింది? ఆత్మ‌ల గ‌తం ఏమిట‌నేది తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: హార‌ర్ చిత్రాలు ఎక్కువ‌గా కామెడీ మేళ‌వింపుగానే సాగుతూ ఉంటాయి. న‌వ్విస్తూ, అంత‌లోనే భ‌య‌పెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఆ మేళ‌వింపు ప‌క్కాగా కుదిరిన చిత్రాల‌కే విజ‌యాలు ద‌క్కుతుంటాయి. అలా కామెడీ ఇత‌ర‌త్రా అంశాలతో సంబంధం లేకుండా కేవ‌లం భ‌యం ప్ర‌ధానంగా సాగ‌డ‌మే ‘పిండం’ ప్ర‌త్యేక‌త‌. చివరిలో ఫ్లాష్‌బ్యాక్ స‌న్నివేశాలు క‌థ‌కి కీల‌కం. అయితే ఈ క‌థ, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. ఊరి చివ‌ర‌న పాడుబ‌డిన ఓ ఇల్లు. వాడుక‌లో లేని ఓ గ‌ది. అందులో  ఆత్మ‌లు అంటూ స‌గ‌టు హార‌ర్ చిత్రాల త‌ర‌హాలోనే ఇదీ సాగుతుంది. ఇలాంటి క‌థ‌ల్లో ఆ ఆత్మలు ఎవ‌రివి?వాటి ల‌క్ష్యం ఏమిట‌నేదే కీల‌కం. ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వ‌చ్చాక ఒకొక్క‌రికీ ఆత్మ‌లు క‌నిపించ‌డం, అంద‌రూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం  ఆ స‌న్నివేశాల్ని భ‌యం క‌లిగించేలా తీయ‌డంలో ద‌ర్శకుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే అవే స‌న్నివేశాలు సినిమా మొత్తం పున‌రావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ స‌న్నివేశాల్లో క‌లిగినంత భ‌యం ఆ త‌ర్వాత క‌ల‌గ‌దు. గ‌దిలో శ‌బ్ధాలు, కుర్చీ ఊగ‌డం, మూల‌న ఉన్న కొన్ని వ‌స్తువులు క‌ద‌ల‌డం వంటి స‌న్నివేశాలు ప‌దే ప‌దే చూపించ‌డంతో  క‌థ ఎంత‌కీ  ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించదు. విరామంలో మ‌లుపు ద్వితీయార్ధంపై ఆస‌క్తి పెంచుతుంది. తాంత్రిక శ‌క్తుల‌పై అవ‌గాహ‌న ఉన్న అన్న‌మ్మ కూడా ఆ ఇంట్లో ఆత్మ‌ల్ని పసిగ‌ట్ట‌డం, వాటి నుంచి విముక్తి కోసం రంగంలోకి దిగ‌డంతో ఏం జ‌రుగుతుందో అనే ఉత్సుక‌త పెరుగుతుంది. కానీ, ద్వితీయార్ధం స‌న్నివేశాల్లోనూ  కొత్త‌ద‌నం ఏమీ కనిపించ‌దు. అంత‌కుముందు లాగే అన్న‌మ్మ‌తో స‌హా అంద‌రినీ  ఆత్మ‌లు భ‌య‌పెడుతూనే ఉంటాయి. త‌న తాంత్రిక ప‌రిజ్ఞానంతో ఆ ఇంట్లో ఆత్మ‌లుగా ఉన్న‌వాళ్ల‌తో మాట్లాడుతూ, అంత‌కుముందు ఆ కుటుంబం గురించి,  అప్ప‌ట్లో జ‌రిగిన దారుణం గురించి అన్న‌మ్మ చెబుతూ పోయే స‌న్నివేశాల‌తో డ్రామా ఆక‌ట్టుకోదు. క‌డుపులో పిండానికీ, బ‌య‌టి ఆత్మ‌కీ ముడిపెట్ట‌డంలో పెద్ద‌గా లాజిక్ క‌నిపించ‌దు. తాంత్రిక పూజ‌లు, మంత్రాల పేరుతో తెర‌పై క‌నిపించే హంగామా కూడా ఏమాత్రం మెప్పించ‌దు. ఇలాంటి చిత్రాల‌కి మ‌న‌సుల్ని క‌దిలించే భావోద్వేగాలు కీల‌కం. కానీ, ప‌తాక సన్నివేశాల్లో  వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్‌లో  భావోద్వేగాలు లేక‌పోగా మితిమీరిన హింస‌ని చూపించారు. ఆ స‌న్నివేశాల్ని సున్నిత మ‌న‌స్కులు చూడ‌లేని విధంగా ఉంటాయి.

ఎవ‌రెలా చేశారంటే: శ్రీరామ్‌, ఖుషి ర‌వి  మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన జంట‌గా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు.  హార‌ర్  ప్ర‌ధానంగా సాగే  స‌న్నివేశాల్లో శ్రీరామ్ న‌ట‌న మెప్పిస్తుంది. ఖుషి ర‌వి గ‌ర్భ‌వ‌తిగా, ఇద్ద‌రు చిన్నారుల‌కి త‌ల్లిగా ఆ పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ప‌క్కాగా న‌టించారు. అన్న‌మ్మ‌గా ఈశ్వ‌రీరావు పాత్ర సినిమాకి కీల‌కం. సింహ‌భాగం స‌న్నివేశాలు ఈ ముగ్గురి నేప‌థ్యంలోనే సాగుతుంటాయి. తాంత్రిక శ‌క్తులున్న మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు క‌నిపించిన తీరు, అందులో న‌ట‌న మెప్పిస్తుంది.  సోఫి, తార పాత్ర‌ల్ని పోషించిన చిన్నారులు చైత్ర‌, లీషా న‌ట‌న చాలా బాగుంది.  అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌కి పెద్ద‌గా  ప్రాధాన్యం లేదు. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్రల ప్రాధాన్యం మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించాయి. శబ్దాల‌తోనే భ‌య‌పెట్టాడు సంగీత ద‌ర్శ‌కుడు.విష్ణు నాయ‌ర్ క‌ళా ప్ర‌తిభ తెర‌పై క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్టే స‌న్నివేశాల్ని బాగా డిజైన్ చేసుకున్నాడు కానీ, క‌థ‌నంపైన‌,  క‌థ‌లోని భావోద్వేగాల‌పైన ఇంకొంచెం  దృష్టిపెట్టాల్సింది. నిర్మాణం ప‌రంగా లోపాలేమీ లేవు.

  • + బ‌లాలు
  • భ‌య‌పెట్టే స‌న్నివేశాలు
  • న‌టీన‌టులు
  • సంగీతం
  • - బ‌ల‌హీన‌త‌లు
  • కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌ర‌గా:  ‘పిండం’.. అక్క‌డ‌క్క‌డా భ‌య‌పెడుతుంది. 
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని