Por Thozhil telugu review: రివ్యూ: పోర్‌ తొళిల్‌.. తమిళ్‌ సెన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Por Thozhil telugu review: శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌ కీలక పాత్రల్లో నటించిన మర్డర్‌మిస్టరీ థ్రిల్లర్‌ ‘పోర్‌ తొళిల్‌’ ఎలా ఉంది?

Updated : 11 Aug 2023 10:11 IST

Por Thozhil telugu review; చిత్రం: పోర్‌ తొళిల్‌; నటీనటులు: శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌, పి.ఎల్‌. తెన్నప్పన్‌, నిళల్‌ రవి, శరత్‌బాబు, తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సరంగ్‌; సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్‌ శివాజీ; నిర్మాత: సమీర్‌ నాయర్‌, దీపక్‌ సెగల్‌, ముఖేశ్‌ ఆర్‌.మెహతా, సీవీ శరత్‌, పూనమ్‌ మెహ్రా, సందీప్‌ మెహ్రా; రచన: విఘ్నేష్‌ రాజా, ఆల్ఫ్రైడ్‌ ప్రకాశ్‌; దర్శకత్వం: విఘ్నేష్ రాజా; స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌

ద్యంతం ఉత్కంఠతో అలరించే క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ఇటీవల విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కథతోనే ఇటీవల తమిళంలో వచ్చిన చిత్రం ‘పోర్‌ తొళిల్‌’ (por thozhil). శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఏ మిస్టరీని పోలీసులు ఛేదించారు?

కథేంటంటే: అడిషనల్‌ డీజీపీ మహేంద్రన్‌ ఆదేశాల మేరకు ఎస్పీ లోకనాథన్‌ వద్ద డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు ప్రకాశ్‌ (అశోక్ సెల్వన్‌). అతడితో పాటు  టెక్నికల్‌ అసిస్టెంట్‌ వీణ (నిఖిలా విమల్‌) కూడా వస్తుంది. తిరుచ్చిలో జరిగిన యువతి హత్య కేసు విచారణ చేసే బాధ్యత ఈ ముగ్గురిపై పడుతుంది. ఈ కేసు విచారణ చేస్తుండగానే వరుసగా మరికొన్ని హత్యలు జరుగుతుంటాయి. మొదట మృతి చెందిన యువతితో పాటు, ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు?అందుకు కారణాలు ఏంటి? (Por Thozhil telugu review) ఈ క్రమంలో లోకనాథన్‌, ప్రకాశ్‌, వీణలకు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సాధారణంగా క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ అంటే ప్రేక్షకుడు ఊహించని మలుపులతో కథ, కథనాలు సాగుతాయి. నేరానికి కారకుడైన వ్యక్తి ఎవరో చివరి వరకూ తెలియకుండా సాగే కథలు ప్రేక్షకుడిని అలరిస్తాయి. అలాంటి కోవలోకి చెందిందే ‘పోర్‌ తొళిల్‌’. (Por Thozhil telugu review) కానీ, దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఎంచుకున్న ప్లాట్‌ పాయింట్‌ను కాస్త కొత్తగా ప్రజెంట్‌ చేసి,  చివరి వరకూ ఆ టెంపోను కొనసాగించి ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు ఉత్కంఠతో కూర్చోబెట్టడంలో విజయం సాధించాడు. పాత్రల పరిచయం, యువతి హత్య, ఎస్పీ లోకనాథన్‌ వద్ద  ట్రైనీ డీఎస్పీగా ప్రకాశ్‌ చేరడం తదితర సన్నివేశాలతో కథను ప్రారంభించిన దర్శకుడు నేరుగా ప్లాట్‌ పాయింట్‌కు వచ్చేశాడు. ఒకవైపు లోకనాథన్‌, ప్రకాశ్‌ల ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుండగానే మరోవైపు ఒక హత్య.. తర్వాత మరొకటి ఒకే రకంగా జరుగుతుంటాయి. ఇక్కడే దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకుడికి అరటిపండు ఒలిచి పెడుతున్నట్లు సులభంగా అర్థమవుతాయి. ఎందుకంటే ప్రకాశ్‌కు ఎస్పీ లోకనాథన్‌ ఫీల్డ్‌ ట్రైనింగ్‌, హత్య ఎలా జరిగిందో వివరించడం తదితర సన్నివేశాలు ప్రేక్షకుడే క్రైమ్‌ సీన్‌లో ఉండి వాటిని నేరుగా చూస్తున్న భావన కలిగించారు. అదే సమయంలో ప్రకాశ్‌ అమాయకత్వాన్ని బాగా ఎలివేట్‌  చేశారు. ఆయా సన్నివేశాలు హాస్యాన్ని పంచుతాయి. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెట్టిన దగ్గరి నుంచి ప్రతి సన్నివేశాన్ని క్లైమాక్స్‌కు ఇంటర్‌ లింక్‌ చేశాడు దర్శకుడు. మూడు హత్యల తర్వాత హంతకుడు పట్టుబడిపోయాడన్న వార్తలు రావడంతో ఎవరా వ్యక్తి? అన్న ఆసక్తి ప్రేక్షకుడుకి కలుగుతుంది. కానీ, అక్కడే ఊహించని ట్విస్ట్‌ ఇస్తాడు.

అసలు హంతకుడు వేరే ఉన్నాడని ఒక్కో లింక్‌ను వెతుక్కుంటూ అటు లోకనాథన్‌, ఇటు ప్రకాశ్‌ చేసే ప్రయత్నాలు ఆద్యంతం అలరిస్తాయి. కెన్నడీ (శరత్‌బాబు) పాత్ర రాకతో మరో ట్విస్ట్‌ ఇచ్చి, ఇంకా ఏం జరుగుతుందా? అన్న ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో కెన్నడీ, లోకనాథన్‌, ప్రకాశ్‌ల మధ్య వచ్చే హైడ్‌ అండ్‌ సీక్‌ సీన్స్‌ మెప్పిస్తాయి.  కెన్నడీ చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అతడే హంతకుడు అని ఇట్టే అర్థమైపోతుంది. (Por Thozhil telugu review) ఈ క్రమంలో ఒకవైపు లోకనాథన్‌, మరోవైపు ప్రకాశ్‌ సాగించే ఇన్వెస్టిగేషన్‌ కూడా సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి మరో ఆలోచన వచ్చే ఛాన్స్‌ ఏమాత్రం ఇవ్వదు. ప్రీక్లైమాక్స్‌ ముందు కెన్నడీ ఇచ్చే ట్విస్ట్‌, బయట పడే నిజాలు చూస్తుంటే ‘బాబోయ్‌ ఇవేం ట్విస్ట్‌లు రా నాయనా’ అంటూ ప్రేక్షకుడు అనుకోక తప్పదు. పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు. అదేంటో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.  ‘ఒక ఆర్టిస్ట్‌ ఎలాంటి వాడో తెలుసుకోవడానికి అతడు వేసిన పెయింటింగ్‌ చూడాలి. అదే విధంగా ఓ కిల్లర్‌ను చదవడానికి వాడు చేసిన హత్య గురించి తెలుసుకోవాలి’, ‘ఒక్క బుల్లెట్‌ కూడా ఫైర్‌ చేయకుండా రిటైర్‌ అయిన పోలీసు వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసా?’,  ‘నేనూ మీతో ఉంటాను సర్‌. నా జాబ్‌ పోయిన పర్వాలేదు.. ఇంకో ప్రాణం పోకూడదు’ వంటి సంభాషణలు మెప్పిస్తాయి. దర్శకుడు ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌గానే కాకుండా, అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చాడు. (Por Thozhil telugu review) పిల్లలపై తల్లిదండ్రుల ఆధిపత్యం, భార్య భర్తల మధ్య గొడవలు, ఒక కుటుంబ సభ్యుడిని హీనంగా చూడటం వల్లే కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఈ సినిమాతో చూపించారు. అయితే, నిజ జీవితంలో హత్యలు చేసే స్థాయికి మానసిక స్థితి వెళ్తుందా? అన్నది చెప్పలేం. కానీ, రెండున్నర గంటల పాటు ‘పోర్‌ తొళిల్‌’ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్‌ ఛాయిస్‌. సోనీలివ్‌ వేదికగా తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: ‘పోర్‌ తొళిల్‌’లో కనిపించే పాత్రలు చాలా తక్కువే అయినా, వాటి ప్రభావం సినిమా ఆసాంతం ఉంటుంది. ఎస్పీ లోకనాథన్‌గా శరత్‌ కుమార్‌ సెటిల్డ్‌గా నటించారు. ఒక సీనియర్‌ అధికారిగా, యువ పోలీస్‌ ఆఫీసర్‌కు శిక్షణ ఇచ్చే వ్యక్తిగా ఆయన నటన బాగుంది. ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌ పాత్రలో అశోక్‌ సెల్వన్‌ చక్కగా సరిపోయారు. సీరియస్‌గా సాగే కథలో కాస్త హాస్యాన్ని పంచేది ఆయన పాత్రే. మొదట భయస్తుడిగా కనిపించి, ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్‌లో చూపించే దూకుడు ఆకట్టుకుంటుంది. వీణగా నిఖిలా విమల్‌ బాగానే నటించింది. కెన్నడీగా శరత్‌బాబు పాత్రను ఎవరూ ఊహించరు.(Por Thozhil telugu review)  ఆయన గతం, తనలా తన కొడుక్కి జరగకూడదని ఆశపడే సగటు తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు. ఆయన చనిపోయే ముందు నటించిన చివరి చిత్రాల్లో ఇదీ ఒకటి కావడం గమనార్హం. సాంకేతికంగా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సంగీతం ఇలా ప్రతి విభాగం ప్రభావవంతంగా పనిచేసింది. రచయిత ఆల్ఫ్రైడ్‌ ప్రకాశ్‌, దర్శకుడు విఘ్నేష్‌ రాజా కథను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. హీరో, హీరోయిన్‌పాత్రలు ఉన్నా, వాళ్ల మధ్య లవ్‌ట్రాక్‌ జోలికిపోకుండా కేవలం కేసు ఇన్వెస్టిగేషన్‌పైనే సినిమా నడిపించిన తీరు మెప్పిస్తుంది. మరో కేసుతో ఎస్పీ లోకనాథన్‌, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌ వస్తారని చివరిలో చూపించారు. అంటే ‘పోర్‌ తొళిల్‌’ కొనసాగుతుంది.

  • బలాలు
  • + కథ, కథనాలు
  • + నటీనటులు
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు
  • చివరిగా: ఊహించని ట్విస్ట్‌లతో.. పోర్‌ తొళిల్‌! (Por Thozhil telugu review)
  • గమనిక:  ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని