Run Baby Run Review: రివ్యూ: రన్‌ బేబీ రన్‌

ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు ప్రతివారం పలు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ క్రమంలో ఈవారం ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో రిలీజ్‌ అయిన చిత్రం ‘రన్‌ బేబీ రన్‌’. ఎలా ఉందంటే?

Published : 10 Mar 2023 17:11 IST

Run Baby Run Review చిత్రం: రన్‌ బేబీ రన్‌; నటీనటులు: ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేశ్‌, ఇషా తల్వార్‌, రాధికా శరత్‌కుమార్‌, నాగినీడు తదితరులు; సంగీతం: సామ్‌ సీఎస్‌; ఎడిటింగ్: జి. మదన్‌; సినిమాటోగ్రఫి: ఎస్‌. యువ; నిర్మాణ సంస్థ: ప్రిన్స్‌ పిక్చర్స్‌; దర్శకత్వం: జియేన్‌ కృష్ణకుమార్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ఆర్జే బాలాజీ (RJ Balaji), ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో దర్శకుడు జియేన్‌ కృష్ణకుమార్‌ (Jiyen Krishnakumar) తెరకెక్కించిన చిత్రం ‘రన్‌ బేబీ రన్‌’ (Run Baby Run). ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ తమిళ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో పలు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బాక్సాఫీసు వద్ద హిట్‌టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా కథేంటి? ఎలా సాగిందో చూద్దాం (Run Baby Run Review)..

ఇదీ కథ: సత్య (ఆర్జే బాలాజీ) ఓ బ్యాంకు ఉద్యోగి. కాబోయే భార్య ప్రియాంక (ఇషా తల్వార్‌)కు గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుంటాడు. కారులో ప్రయాణిస్తూ ఆ కానుక ఇవ్వబోతుండగా.. అదే కారులో దాక్కున్న పరిచయంలేని వ్యక్తి తారా (ఐశ్వర్య రాజేశ్‌)ను చూసి షాక్‌ అవుతాడు. ప్రియాంకను మేనేజ్‌ చేసి ఇంటికి దగ్గర్లో డ్రాప్‌ చేస్తాడు. ఆ తర్వాత, తాను ప్రమాదంలో ఉన్నానని, కొన్ని గంటలు ఆశ్రయం కావాలని తారా బతిమిలాడగా సత్య అంగీకరిస్తాడు. కట్‌చేస్తే, మరుసటి రోజు ఉదయం తారా విగతజీవిగా కనిపిస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో సత్య ఓ సూట్‌కేసులో తారా శవాన్ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తాడు. మార్గమధ్యంలో తన కారు చెడిపోవడంతో షేర్‌ ఆటోలో ప్రయాణిస్తాడు. ఆ శవం ఏమైంది? ఆమెను చంపింది ఎవరు? హంతకులను సత్య పట్టుకోగలిగాడా? తన పెళ్లి జరిగిందా? అసలు తారా.. సత్య కారు ఎందుకు ఎక్కింది? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Run Baby Run Review).

ఎలా ఉందంటే: పరిచయంలేని అమ్మాయికి సాయం చేయాలనుకున్న ఓ సాధారణ వ్యక్తి జీవితం ఎలా తలకిందులైందనేదే ఈ సినిమా ప్రధాన అంశం. మదర్‌ సెంటిమెంట్‌ అంతర్లీనంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ప్రారంభ సన్నివేశంతోనే సినిమాపై ఉత్కంఠ రేకెత్తేలా చేశారు దర్శకుడు జియేన్‌. ఓ మెడికో మరణం సీన్‌తో కథను చెప్పే ప్రయత్నం చేసిన డైరెక్టర్‌ ఆమెది హత్యా, ఆత్మహత్యా? అనే సస్పెన్స్‌ను హోల్డ్‌లో ఉంచి, వెంటనే హీరో సూసైడ్‌ సీన్‌ను చూపించి ఏం జరిగింది? ఏం జరగబోతోందన్న ఉత్సుకతను కలిగించారు. అక్కడా లేట్‌ చేయకుండా హీరో ఎందుకు ఆత్మహత్యకు తెగించాడో ‘ఫ్లాష్‌బ్యాక్‌’ ద్వారా వివరించారు. కథ ఎక్కువగా ఆ ‘రివైండ్‌’లోనే సాగుతుంది. అందులోనే తారా పాత్ర ప్రత్యక్షమవుతుంది. ఆమెను వెంబడించేది ఎవరు? ప్రాణాల మీదకు తెచ్చుకునేంతగా ఆమె ఏం చేసింది? తదితర అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ప్రేక్షకుణ్ని కథలో లీనమయ్యేలా చేశారు. అయితే, అక్కడక్కడా లాజిక్‌ మిస్‌ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. హీరో ఇంట్లో శవం ఉండగానే పోలీసులు వేరే పనిలో భాగంగా అక్కడకు వెళ్లడం.. ఇల్లంతా వెతికి ఏం లేదని చెప్పడం తదితర సీన్స్ చూస్తే ‘హీరో కదా.. అలాంటి మాయ ఉంటుంది’ అని అనిపించకమానదు. ప్రథమార్ధమంతా ఇలా వేగంగా సాగుతూ థ్రిల్‌ పంచుతున్నా ఫస్ట్‌ షాట్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకిందెవరనే ప్రశ్నకు సమాధానం ఇంకెప్పుడా? అనే ఆలోచనా మెదులుతూనే ఉంటుంది. దానికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది.

తల్లి చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకుని తారా హత్యకు కారకులెవరో తెలుసుకునే సత్య ప్లానింగ్‌తో ద్వితీయార్ధం మొదలవుతుంది. ఒక్కో చిక్కుముడి విప్పుతూ.. తారేకాదు ఆమెకంటే ముందు భవనంపై నుంచి పడిపోయిన మెడికోసహా మరికొందరు స్టూడెంట్స్‌ మరణాలకు కారణాలు అన్వేషించే హీరో తీరు ఆకట్టుకుంటుంది. తారా చదివిన కాలేజీకి వెళ్లడం, ఆమె వివరాలు సేకరించేటప్పుడు కొందరిపై అనుమానం వ్యక్తం చేయడం, తనపై తారా పడుకున్నట్టు ఎవరో ఫొటో తీసి పంపగా వాటి ద్వారా అసలు నిజాన్ని రాబట్టడం.. ఇలా సత్య క్యారెక్టర్‌ చేసే తనదైన దర్యాప్తు చూపు తిప్పుకోనివ్వదు. హీరో కోణంలో ఓకే గానీ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్‌ మాత్రం పేలవంగా ఉంటుంది. మధ్యలో కనిపించే తారా సంరక్షకుడు ఫాదర్‌ విన్సెంట్‌, ఆయన అనుచరుడు, తారా ఉండే హాస్టల్‌ వార్డెన్‌ పాత్రల్లో ఏదో ఒకటి ఆమె చావుకి కారణమని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ, ప్రేక్షకులు ఊహించలేని విధంగా విలన్‌ ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది. సామాజిక కోణంలో ఆలోచించి, కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారనే విషయం అర్థమవుతుంది. అయితే, క్లైమాక్స్‌ను మాత్రం సాదాగా ముగించారు (Run Baby Run Review).

ఎవరెలా చేశారంటే: ‘స్పైడర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలాజీ ఈ చిత్రంలో సత్యగా తన పాత్రలో అదరగొట్టారు. ఐశ్వర్య రాజేశ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా తన హావభావాలతో అలరిస్తుంది. ఇషా తల్వార్‌, రాధికా శరత్‌కుమార్‌, నాగినీడు తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. సామ్‌ సీఎస్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. మదన్‌ ఎడిటింగ్‌, యువ సినిమాటోగ్రఫి బాగున్నాయి. మలయాళంలో ‘కాలేజ్‌ డేస్‌’, ‘కాంచి’, ‘తియాన్‌’ చిత్రాలను తెరకెక్కించిన జియేన్‌ కృష్ణకుమార్‌ చాలాకాలం తర్వాత ‘రన్‌ బేబీ రన్‌’ కోసం మెగాఫోన్‌ పట్టారు. గ్యాప్‌ వచ్చినా ఫామ్‌లోనే ఉన్నట్టు తన టేకింగ్‌తో నిరూపించారు (Run Baby Run Review).

బలాలు: + కథ, + ఆర్జే బాలాజీ నటన, + నేపథ్య సంగీతం

బలహీనతలు: - లాజిక్‌లేని కొన్ని సన్నివేశాలు, - పతాక సన్నివేశాన్ని ముగించిన తీరు 

చివరిగా: టైటిల్‌కు తగ్గట్టు కథ పరిగెడుతుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని