Slumdog Husband Review: రివ్యూ: స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌

సంజయ్‌రావు నటించిన ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ సినిమా ఎలా ఉందంటే

Published : 29 Jul 2023 13:51 IST

Slumdog Husband Review.. చిత్రం: స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌; నటీనటులు: సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, అలీ, యాదమరాజు, మురళీధర్‌ గౌడ్, రఘు కారుమంచి, ఫిష్‌ వెంకట్‌, తదితరులు; సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో; ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌ జె.రెడ్డి; రచన, దర్శకత్వం: ఏఆర్‌.శ్రీధర్‌; నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి; విడుదల తేదీ: 29-07-2023

‘ఓ పిట్టకథ’ చిత్రంతో హీరోగా తెరకు పరిచయమయ్యాడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు (Sanjay Rao). అతడు నటించిన మరో చిత్రమే ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ (Slumdog Husband Review). ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ చిత్రం కోసం ప్రచారం చేయడం.. టీజర్, ట్రైలర్లు వినోదాత్మకంగా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Slumdog Husband Review).

కథేంటంటే: లచ్చి అలియాస్‌ లక్ష్మణ్‌ (సంజయ్‌ రావు) ఓ బస్తీ కుర్రాడు. తల్లితో కలిసి పార్సీగుట్టలో జీవిస్తుంటాడు. రోడ్లపై కళ్లజోళ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తనకు చిన్నప్పటి నుంచి మౌనిక (ప్రణవి) అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకుంటారు. బలవంతంగా పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధపడతారు. అయితే, వివాహ ముహూర్తం ఖరారు చేసే సమయంలో లచ్చి జాతకంలో దోషం ఉందని చెబుతాడు పూజారి. దాన్ని తొలగించుకోవాలంటే తొలుత ఏ చెట్టునో.. కుక్కనో పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. దీనికి లచ్చి మొదట అంగీకరించకున్నా.. పెళ్లి తర్వాత ఏమైనా చెడు జరుగుతుందేమోనని భయంతో పూజారి సలహా మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే తన మిత్రుడు సంతు (యాదమ రాజు) ఇచ్చిన సలహాతో తొలుత బేబీ అనే కుక్క మెడలో తాళి కట్టి.. ఆ మరుసటి వారం ప్రేయసి మౌనికతో కలిసి పెళ్లి పీటలెక్కుతాడు. కానీ, సరిగ్గా తాళి కట్టే సమయానికి లచ్చిని పోలీసులు అరెస్టు చేస్తారు. మొదటి భార్య బేబీకి విడాకులివ్వకుండా లచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదంటూ కుక్క యజమాని కోర్టుకెక్కుతాడు. భరణంగా రూ.20లక్షలు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ కేసు వల్ల లచ్చి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? దీని నుంచి అతనెలా బయట పడ్డాడు? అన్నది మిగతా కథ (Slumdog Husband Review).

ఎలా సాగిందంటే: వివాహ సమయాల్లో జాతకంలోని దోషాలు తొలగించుకునేందుకు వధూవరులకు మొదట చెట్లతోనో.. జంతువులతోనో పెళ్లి జరిపించడాన్ని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఇప్పటికీ అక్కడక్కడా ఇలాంటి మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ పాయింట్‌నే ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ (Slumdog Husband Review) రూపంలో తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు శ్రీధర్‌. అయితే ఈ కథతో ఆయన సందేశమివ్వాలనుకున్నారో.. లేక కేవలం వినోదం పంచాలనుకున్నారో స్పష్టంగా తేల్చుకోలేకపోయారు. దీంతో ఈ కథ రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. నిజానికి దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని వినోదాత్మకంగా తెరపైకి తీసుకురావడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. నాయకానాయికల మధ్య జరిగే రొమాంటిక్‌ ఫోన్‌ సంభాషణతో సినిమాని ఆరంభించిన తీరు యువతరాన్ని మెప్పిస్తుంది. అయితే, పదే పదే వచ్చే ఈ తరహా ఎపిసోడ్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందికరంగా అనిపిస్తాయి.

లచ్చి, మౌనిక పెళ్లి విషయమై తమ ఇంట్లో వాళ్లను బలవంతంగా ఒప్పించే తీరు మరీ అతిగా అనిపిస్తుంది. ప్రేమ కోసం కాకుండా కేవలం కోరిక తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఇద్దరూ పెళ్లికి సిద్ధమైనట్లుగా చూపించారు దర్శకుడు. అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. లచ్చి కుక్కను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం.. ఈ క్రమంలో వచ్చే ఎపిసోడ్లు మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. విరామానికి ముందు మౌనికతో లచ్చి పెళ్లి పీటలెక్కడం... పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచైనా కథ కాస్త వినోదాత్మకంగా మారుతుందనుకుంటే ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే ఆ ఆశలు ఆవిరైపోతాయి. ముఖ్యంగా సుదీర్ఘంగా సాగే కోర్టు రూం డ్రామా సహనానికి పరీక్ష పెడుతుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్టు పర్వాలేదనిపిస్తుంది. నాయకానాయికలు తిరిగి ఒక్కటైన తీరు.. సినిమాని ముగించిన విధానం ఏమాత్రం మెప్పించదు.

ఎవరెలా చేశారంటే: బస్తీ కుర్రాడిగా సంజయ్‌ చక్కగా సరిపోయాడు. నటన పరంగా పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు చక్కగా పలికించాడు. ప్రణవి పాత్రను దర్శకుడు కాస్త బోల్డ్‌గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది. అయితే దాన్ని సంభాషణలకే పరిమితం చేశారు. నటన పరంగా ఆమె ఉన్నంతలో చక్కగానే చేసింది. యాదమ రాజు పాత్రతో దర్శకుడు క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. సప్తగిరి, బ్రహ్మాజీ కోర్టు సీన్లలో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు కానీ.. అవి వర్కవుట్‌ అవ్వలేదు. రఘు కారుమంచి, మురళీధర్‌ గౌడ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. భీమ్స్‌ సిసిరోలియో పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ‘‘లచ్చి గాని పెళ్లి’’, ‘‘మౌనికా ఓ మై డార్లింగ్‌’’, ‘‘మేరే చోటా దిల్‌’’ పాటలు హుషారెత్తించేలా ఉన్నాయి. సురేష్‌ గంగుల, కాసర్ల శ్యామ్‌ ఆ గీతాల్ని చాలా ట్రెండీగా రాశారు. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి.

  • బలాలు: 
  • + కథా నేపథ్యం
  • + యువతరం మెచ్చే కొన్ని సన్నివేశాలు
  • + పాటలు
  • బలహీనతలు:
  • - కథనం సాగిన తీరు
  • - సిల్లీ కామెడీ సీన్స్‌
  • - కోర్టు రూం డ్రామా
  • చివరిగా: నిరుత్సాహపరిచే ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని