Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Published : 15 Mar 2024 17:28 IST

Save The Tigers 2 Review: వెబ్‌సిరీస్‌: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్‌ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, సీరత్‌ కపూర్‌, దర్శనా బానిక్‌, గంగవ్వ, వేణు యెల్దండి, సత్య కృష్ణ, రోహిణి తదితరులు; మ్యూజిక్‌: అజయ్‌; ఎడిటింగ్‌: శ్రవణ్‌ కటికనేని; సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్‌; క్రియేటర్స్‌: మహి వి. రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతమ్‌; డైరెక్షన్‌: అరుణ్‌ కొత్తపల్లి; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

గతేడాది వేసవి కానుకగా విడుదలై, నవ్వుల జల్లు కురిపించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save The Tigers 2). దర్శకుడు మహి వి. రాఘవ్‌ (ఆనందో బ్రహ్మ, యాత్ర ఫేమ్‌) క్రియేట్‌ చేసిన ఈ సిరీస్‌లో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), అభినవ్‌ గోమఠం (Abhinav Gomatam), చైతన్య కృష్ణ (Chaitanya Krishna) ప్రధాన పాత్రలు పోషించారు. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’ తాజాగా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Save The Tigers 2 OTT Platform)లో రిలీజైంది. మరి, సీజన్‌ 2 ఎలా ఉంది? ఎన్ని ఎపిసోడ్లతో రూపొందింది? తెలుసుకుందాం (Save The Tigers 2 Review)..

కథేంటంటే?: తొలి సీజన్‌ ఎక్కడైతే ముగిసిందో సీజన్‌ 2 అక్కడ నుంచే మొదలైంది. హీరోయిన్‌ హంసలేఖ (సీరత్‌ కపూర్‌)ను కిడ్నాప్‌ చేసే ఆరోపణలతో పాల వ్యాపారి ఘంటా రవి (ప్రియదర్శి), రచయిత రాహుల్‌ (అభినవ్‌ గోమఠం), యాడ్‌ ఏజెన్సీలో పనిచేసే విక్రమ్‌ (చైతన్య కృష్ణ)ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. విచారణలో భాగంగా పోలీసు అధికారి లాఠీ ఝుళిపించగా ఆమె కనిపించకపోవడానికి తాము కారణం కాదని వాపోతారు. మరోవైపు, హీరోయిన్‌ను రేప్‌ చేసి, హత్య చేశారంటూ ఈ ముగ్గురు స్నేహితులపై న్యూస్ ఛానళ్లు రూమర్స్‌ సృష్టించి, ప్రసారం చేస్తాయి. అది కాస్తా వైరల్‌ కావడంతో హంసలేఖ పోలీసు స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆమె అసలు విషయం చెప్పడంతో పోలీసులు ఆ ముగ్గురిని వదిలేస్తారు. తమ భర్తలు మద్యం సేవించి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారనే విషయాన్ని జీర్ణించుకోలేని హైమా/రవి భార్య (జోర్దార్‌ సుజాత), మాధురి/రాహుల్‌ భార్య (పావని), రేఖ/ విక్రమ్‌ భార్య (దేవయాని) సైకాలజిస్టు స్పందన (సత్యకృష్ణ)ను సంప్రదిస్తారు. ఆమె ఇచ్చిన టిప్స్‌ వల్ల ఈ మూడు కుటుంబాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వారందరి కలలు నెరవేరాయా? విక్రమ్‌ లైఫ్‌లోకి వచ్చిన హారిక (దర్శనా బానిక్‌) ఎవరు? రవి, రాహుల్‌, విక్రమ్‌లతో హంసలేఖ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? తదితర అంశాలు సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే (Save The Tigers 2 Web Series Review).

ఎలా ఉందంటే?: హిట్‌ సినిమా/సిరీస్‌కు కొనసాగింపుగా మరొకటి వస్తుందంటే అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’ ఆ జాబితాలోదే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సీజన్‌ 2ను తీర్చిదిద్దారు. సీజన్‌ 1తో పోలిస్తే 2లో కామెడీ కాస్త తగ్గింది. ఎమోషన్‌ను హైలైట్‌ చేశారు. హారిక తదితర కొత్త పాత్రలు ఇందులో కనిపిస్తాయి. పార్ట్‌ 1 చూడకపోయినా ప్రేక్షకుడికి పార్ట్‌ 2 అర్థమవుతుంది. అంతగా ఆయా క్యారెక్టర్లు కనెక్ట్‌ అవుతాయి. కానీ, ముందు స్టోరీ చూసి ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ‘నాదీ ఇదే కథ’ అని వీటిలోని ఒక్క పాత్రైనా ఆడియన్స్‌తో అనిపించకమానదు. ఏడు ఎపిసోడ్లలో సాగుతుందీ కథ. ఒక్కో ఎపిసోడ్‌ నిడివి సుమారు 30 నిమిషాలు (Save The Tigers 2 Review).

భార్యభర్తల మధ్య గిల్లికజ్జాలు, కోపాలు, అలకలు ఉంటే ఓకేగానీ అనుమానం అనే పెనుభూతం ఉంటే జీవితాలు మారిపోతాయి. నేరం నిరూపితం కాకుండానే దోషి అనే ముద్ర పడిన వ్యక్తులే కాకుండా, వారి కుటుంబ సభ్యులూ సమాజంలో అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు అంశాల్ని ప్రస్తావిస్తూ మెసేజ్‌ ఇచ్చే సిరీస్‌ ఇది. అయితే దాన్ని పూర్తిస్థాయిలో సీరియస్‌గా చెప్పకుండా వినోదం పంచుతూ వెళ్లారు దర్శక, రచయితలు. పోలీసు స్టేషన్‌ నుంచి ముగ్గురు స్నేహితులు బయటకురావడం, సైకాలజిస్టు స్పందన సలహాలు తీసుకుని ముగ్గురు లేడీస్‌ ఫాలో అవడం, ఆడవాళ్లదే పైచేయిగా ఉండాలనుకోవడం, వీరి ఎత్తులకు భర్తలు పైఎత్తులు వేయడం.. ఇలా తొలి మూడు ఎపిసోడ్లు సరదాగా సాగిపోతాయి. పార్ట్‌ 1లో ప్రధాన పాత్రల కలలేంటో పరిచయం చేయగా ఇందులో వాటిని నెరవేర్చుకునే క్రమాన్ని చూపించారు. గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాట్‌ కొనాలనుకునే హైమా, రచయితగా నిరూపించుకోవాలనే రాహుల్‌, కార్పొరేటర్‌గా ఎదగాలనుకునే రవి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మనకు నవ్వులు పంచుతారు. పెళ్లి కాన్సెప్ట్‌ ఎలా మొదలైందనే విషయాన్ని ఫన్నీగా వివరించేందుకు పూర్వంలోకి (నాలుగో ఎపిసోడ్‌) తీసుకెళ్లే ప్రయత్నం చేశారుగానీ అంతగా వర్కౌట్‌ కాలేదు. స్టోరీ ప్రస్తుతంలోకి వచ్చాక మళ్లీ జోష్‌ మొదలవుతుంది.

అపార్ట్‌మెంట్స్‌లో పెట్స్‌ పెంచుకునే వారి వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగితే, సదరు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఓ ఎపిసోడ్‌లో రాహుల్‌ క్యారెక్టర్‌తో తెలియజేశారు. అక్కడక్కడా తెరపైకి వచ్చే రేఖ, మాధురి పేరెంట్స్‌ క్యారెక్టర్లు ఇబ్బంది పెడతాయి. ఆయా పాత్రల వల్ల సాగదీత అనిపించింది తప్ప ఫన్‌ జనరేట్‌ కాలేదు. ‘ఫ్యామిలీ సెలబ్రేషన్‌’ ఎపిసోడ్‌ మధ్యతరగతి వారికి బాగా కనెక్ట్‌ అవుతుంది. వేడుక పూర్తయిన తర్వాత తన కుమార్తెతో రవి మాట్లాడిన తీరు కట్టిపడేస్తుంది. హారిక రాకతో విక్రమ్‌ లైఫ్‌ ఏ విధంగా టర్న్‌ అయింది? ఎంతో స్నేహంగా ఉండే ఎమ్మెల్యే.. రవిని ఎందుకు మోసం చేశాడు? హంసలేఖ కోసం లేడీ ఓరియెంటెడ్‌ స్క్రిప్టు రెడీ చేసిన రాహుల్‌ రైటింగ్‌కు ఎందుకు దూరమవ్వాలనుకున్నాడు?అనే అంశాలతో చివరి ఎపిసోడ్‌ను రూపొందించారు. క్లైమాక్స్‌ ఊహించిన స్థాయిలో లేదు. సీజన్‌ 3 వచ్చే అవకాశం ఉంది (Save The Tigers 2 Review).

ఎవరెలా చేశారంటే?: సీజన్‌ 1లోలాగే సీజన్‌ 2లోనూ ప్రియదర్శి- జోర్దార్‌ సుజాత, చైతన్య కృష్ణ- దేవయాని, అభివన్‌- పావని జోడీలు ఆకట్టుకున్నాయి. రాహుల్‌ ఇంటి పని మనిషిగా రోహిణి మరోసారి నవ్వుల మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు. వేణు యెల్దండి, సత్య కృష్ణ, దర్శనా బానిక్‌, ముక్కు అవినాష్‌, గంగవ్వ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి, మెప్పించారు. టెక్నికల్‌గానూ సిరీస్‌ బాగుంది. సంగీతం, కూర్పు, ఛాయాగ్రహణం చక్కగా కుదిరాయి. మహి వి. రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతమ్‌ క్రియేట్‌ చేసిన రెండు సీజన్లు నవ్వులు పంచుతూ హృదయాన్ని హత్తుకున్నాయి. ఫస్ట్‌ పార్ట్‌కు తేజ కాకుమాను దర్శకత్వం వహించగా సెకండ్‌ పార్ట్‌ను అరుణ్‌ కొత్తపల్లి డైరెక్ట్‌ చేశారు.

  • బలాలు:
  • + నటీనటులు
  • + కామెడీ 
  • + రచన, దర్శకత్వం
  • బలహీనతలు:
  • -  అక్కడక్కడా సాగదీత
  • -  4వ ఎపిసోడ్‌
  • చివరిగా: నవ్వులు రిపీట్‌.. విత్‌ ఎమోషన్స్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని