Scam 2003 Volume 2 Review: ‘స్కామ్‌ 2003 పార్ట్‌ 2’.. రూ.30వేల కోట్ల స్కామ్‌ చేసిన వ్యక్తి ఏమయ్యాడు?

 2003లో జరిగిన స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఇతివృత్తంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003’. దానికి కొనసాగింపు అయిన ‘స్కామ్‌ 2003 వాల్యూమ్‌ 2’ తాజాగా ఓటీటీ ‘సోనీలివ్‌’లో విడుదలైంది. ఎలా ఉందంటే?

Updated : 03 Nov 2023 17:35 IST

వెబ్‌సిరీస్‌: స్కామ్‌ 2003 వాల్యూమ్‌ 2: ది తెల్గీ స్టోరీ; తారాగణం: గగన్‌ దేవ్‌ రియార్‌, సనా అమీన్‌ షేక్‌, ముకేశ్‌ తివారీ, భరత్‌ జాదవ్‌ తదితరులు; నిర్మాత: హన్సల్‌ మెహతా; దర్శకత్వం: తుషార్‌ హీరానందని; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: సోనీలివ్‌ (03-11-2023).

2003లో సంచలనం సృష్టించిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా దర్శకుడు తుషార్‌ హీరానందని (Tushar Hiranandani) తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ’ (Scam 2003). 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ (Abdul Karim Telgi) జీవితం ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్‌ తొలి భాగం ఓటీటీ (ott) ‘సోనీలివ్‌’ (Sony Liv)లో సెప్టెంబరు 1న విడుదలై ఆకట్టుకుంది. తాజాగా రెండో భాగం రిలీజ్‌ అయింది. మరి, ‘స్కామ్‌ 2003 వాల్యూమ్‌ 2’లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? ఈసారి ఏయే అంశాలు ప్రస్తావించారంటే? (Scam 2003 Volume 2 Review)..

ఇదీ కథ: పార్ట్‌ 2 స్టోరీ తెలుసుకునే ముందు పార్ట్‌ 1లో ఏం జరిగిందో ఓసారి రివైండ్‌ చేసుకుందాం. కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్‌ కరీం తెల్గీ (గగన్‌ దేవ్‌ రియార్‌) (Gagan Dev Riar) డిగ్రీ పట్టాదారుడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగం దొరకదు. ఏ దారీ లేక చివరకు రైళ్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వ్యాపారం చేసే ఇతడి తీరు ఓ ట్రైన్‌లో ప్రయాణించే షౌకత్‌ ఖాన్‌కు బాగా నచ్చుతుంది. దాంతో, ముంబయి వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని తెల్గీకి మాటిస్తాడు. అలా ఖానాపూర్‌ నుంచి చిరిగిన బట్టలు, మాసిన సంచి పట్టుకుని ముంబయి బయలుదేరిన అతడు వేల కోట్ల కుంభకోణానికి కారకుడవుతాడు. అసలు తెల్గీ స్టాంప్‌ పేపర్లపై మొగ్గు చూపడానికి కారణం, అతడు ఎదుర్కొన్న సవాళ్లను వాల్యూమ్‌ 1లో చూపించారు. బ్యాంకులకే అప్పు ఇచ్చేంత స్థాయిలో స్కామ్‌ చేసిన తెల్గీకు ఉన్న వీక్‌నెస్‌ ఏంటి? కట్టుకున్న భార్య, తోడబుట్టిన సోదరుడి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? అతడి పతనం ఎక్కడ మొదలైంది? ఎవరి మాట మేరకు చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించాడు? తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ పార్ట్‌ 2 (Scam 2003 Volume 2 Review).

ఎలా ఉందంటే: తెల్గీ కుటుంబ నేపథ్యం, అతడి ఆలోచనా ధోరణి, డబ్బును సంపాదించడం కాదు సృష్టించాలనే క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు, నాసిక్‌లో స్టాంప్‌ పేపర్ల ప్రింటింగ్‌, వాటి రవాణాపై తెల్గీ పూర్తి అవగాహన పెంచుకోవడం, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో స్నేహం ఏర్పరచుకోవడం.. ఇలా 2000 సంవత్సరం వరకు తెల్గీ జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఇతివృత్తంగా తొలి భాగాన్ని మలిచారు. తెల్గీ క్యారెక్టర్‌ విషయంలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేశారు. పార్ట్‌ 2 విషయానికొస్తే అతడి పతనాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. ఓ పార్టీలో ఎంజాయ్‌ చేసే తెల్గీకి ఫోన్‌కాల్‌ రావడం, ఆయన ఒత్తిడికి గురికావడంతో వాల్యూమ్‌ 1 ముగుస్తుంది. దానికి వివరణ ఇచ్చే సన్నివేశంతోనే వాల్యూమ్‌ 2ని ప్రారంభించారు. గతంలో ఏం జరిగిందో కొన్ని షాట్స్‌ ద్వారా చూపించినా పెద్ద ప్రభావం ఉండదు. తొలిభాగం చూసి ఉంటేనే ఈ రెండో భాగం అర్థమవుతుంది. రియల్‌ తెల్గీ గురించి తెలిసిన వారికైతే నో ప్రాబ్లమ్‌. పార్ట్‌ 1లానే పార్ట్‌ 2 కూడా 5 ఎపిసోడ్లలో సాగుతుంది (Scam 2003 Volume 2 Review).

రివ్యూ: ‘మా ఊరి పొలిమేర-2’.. భయపెట్టిందా.. లేదా?

తెల్గీ ఓ ప్రాణాంతక వ్యాధికి గురయ్యాడనే విషయం తొలి ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది. తర్వాత కుటుంబ సభ్యులూ ఆయన్ను దూరం పెడతారు. ఇక ఇతడి పని అయిపోయిందన్న అభిప్రాయానికి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. కానీ, కథలోకి వెళ్లే కొద్దీ తెల్గీ మైండ్‌ గేమ్‌ చూసి ‘జెర్సీ’ చిత్రంలోని ‘యూ ప్రూవ్‌ మీ రాంగ్‌’ డైలాగ్‌ గుర్తు చేసుకుంటాడు. తెల్గీ అనారోగ్యం బారిన పడడం, కుటుంబ సభ్యులతో మనస్పర్థలు, వ్యాపారం విషయంలో ఒకప్పుడు తనతో నమ్మకంగా ఉన్న వాళ్లు మోసం చేయడం.. తదితర అంశాలను రెండు ఎపిసోడ్‌లలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో అక్కడక్కడా సాగదీత కనిపిస్తుంది. ఎస్‌.ఐ.టి (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) అధికారులు సూర్య ప్రతాప్‌ గెహ్లోత్‌ (ముకేశ్‌ తివారీ), జైసింగ్‌ రంగంలోకి దిగడంతో కథలో వేగం పుంజుకుంటుంది. వేర్వేరుగా చేసే వీరిద్దరి ఇన్వెస్టిగేషన్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సూర్య ప్రతాప్‌ పాత్ర వావ్‌ అనిపిస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగానే తెల్గీకి ఎవరెవరితో (రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు) సంబంధాలున్నాయో బయటపడుతుంది. రూ. 30 వేల కోట్ల స్కామ్‌ చేసినట్లు తెలుస్తుంది. అయితే, ముంబయి, పుణె, బెంగళూరులో చోటుచేసుకునే పరిణామాలను ఒకేసారి చూపించడంతో ఏ సన్నివేశం ఎక్కడ జరుగుతుందనే తికమక ఏర్పడుతుంది. ఆ క్రమంలో వచ్చే పాత్రల విషయంలోనూ స్పష్టత ఉండదు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న సమయంలో తెల్గీకి ఏ పోలీసు అధికారి సాయం చేస్తున్నాడు? ఎవరు అతడికి వ్యతిరేకంగా ఉన్నారోనన్న కన్‌ఫ్యూజన్‌ నెలకొంటుంది. ఈ భారీ కుంభకోణం వల్ల అప్పటి ప్రభుత్వంలో ఎలాంటి ప్రకంపనలు చెలరేగాయన్న దాన్ని పూర్తిస్థాయిలో చూపించి ఉంటే బాగుండేది. కొంతమేరకే దాన్ని పరిమితం చేశారు. తెల్గీ జీవితాధారంగా ‘రిపోర్టర్ కీ డైరీ’ పేరుతో పుస్తకం రాసిన సంజయ్‌ సింగ్‌  పాత్రనూ ఈ పార్ట్‌ 2లో చూడొచ్చు. తాను ఏ ఉద్దేశంతో అదంతా చేశాడో తెల్గీ వివరించే ప్రీ క్లైమాక్స్ సీన్‌ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఓ వ్యక్తి మాట మేరకు చివరకు కోర్టులో నేరాన్ని అంగీకరించడం తెల్గీలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. రియల్‌ తెల్గీ తన నేరాన్ని అంగీకరించే సన్నివేశాలు ఇందులో చూపించడం విశేషం. నేరస్థులు తమకు తెలియకుండానే తొలుత తమ కుటుంబాలనే బాధపెడుతున్నారని తెల్గీ భార్య పాత్రతో క్లైమాక్స్‌ను ముగించిన తీరు సంతృప్తికరంగా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే: పార్ట్‌ 1లానే పార్ట్‌ 2 కూడా గగన్‌ దేవ్‌ రియార్‌ వన్‌మ్యాన్‌ షో. తెల్గీ పాత్రలో ఆయన జీవించారు. తెల్గీ భార్య పాత్ర పోషించిన సనా అమీన్‌ షేక్‌ ఇందులోనే నటనకు ఎక్కువ స్కోప్‌ ఉంది. సూర్య ప్రతాప్‌ గెహ్లోత్‌, జైసింగ్‌ తదితర పాత్రధారులు ఆకట్టుకుంటారు. సందర్భానుసారం వచ్చే ఇతర పాత్రలూ మెప్పిస్తాయి (Scam 2003 Volume 2 Review).

సాంకేతికంగా ఎలా ఉందంటే: ఇషాన్‌ ఛబ్రా అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. పార్ట్‌1తో పోలిస్తే ఇందులో అంతగా మ్యాజిక్‌ చేయలేకపోయారు. స్టాన్లీ ముద్దా సినిమాటోగ్రఫీ ఓకే. కునాల్‌ వాల్వే తొలి మూడు ఎపిసోడ్లను ఇంకా కట్‌ చేసి ఉండాల్సింది. బయోగ్రాఫికల్‌ చిత్రాలను బాగా తెరకెక్కింగలరని ‘సాండ్‌ కీ ఆంఖ్‌’తో నిరూపించిన తుషార్‌ ఈ సిరీస్‌ విషయంలోనూ మంచి మార్కులే కొట్టేశారు (Scam 2003 Volume 2 Review).

  • బ‌లాలు
  • + గగన్‌ దేవ్‌ రియార్‌ నటన
  • + సి.ఐ.టి. ఇన్వెస్టిగేషన్‌
  • + క్లైమాక్స్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - స్పష్టతలేని కొన్ని పాత్రలు
  • - అక్కడక్కడా సాగదీత
  • చివ‌రిగా: తెల్గీ ఈ రెండో భాగం.. ఓ ఎమోషనల్‌ జర్నీ! (Scam 2003 Volume 2 Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని