Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?

Updated : 15 Mar 2024 16:27 IST

Sharathulu Varthisthai Review; చిత్రం: షరతులు వర్తిస్తాయి; నటీనటులు: చైతన్యరావు, భూమిశెట్టి, నందకిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు; సంగీతం: అరుణ్ చిలువేరు; నేపథ్య సంగీతం: ప్రిన్స్ హెన్రీ; ఛాయాగ్ర‌హ‌ణం: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి; క‌ళ‌: గాంధీ; కూర్పు: సీహెచ్ వంశీకృష్ణ; మాటలు: పెద్దింటి అశోక్‌కుమార్‌; రచన-దర్శకత్వం: కుమారస్వామి(అక్షర); నిర్మాణ సంస్థ : స్టార్ లైట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్; విడుదల తేదీ: 15-03-2024

కథా బలం ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకుంటాయని తెలుగు సినీ పరిశ్రమలో పలు మార్లు రుజువైంది. ఆయా ప్రాంతాల యాస, భాష‌లతో  ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీసు వద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి. అలా క‌రీంనగ‌ర్ నేప‌థ్యంలో రూపొందిన మ‌రో చిత్ర‌మే... ‘షరతులు వర్తిస్తాయి’. సామాన్య మధ్యతరగతి కుటుంబాల కథగా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది? చైతన్యరావు, కొత్తమ్మాయి భూమిశెట్టి ఎలా చేశారు? నూతన దర్శకుడు అక్షర తన కథలో ఎలాంటి షరతులు పెట్టారు?

కథేంటంటే: నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేస్తుంటాడు చిరంజీవి (చైతన్యరావ్ ). తండ్రి లేకపోవడంతో ఇంటి బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకుని... తల్లి (పద్మావతి), చెల్లి, తమ్ముడి బాగోగుల్ని చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. పెద్దలను ఒప్పించి తన చిన్ననాటి స్నేహితురాలైన విజయశాంతి (భూమిశెట్టి)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయ్యాక విజయశాంతి స్టేషనరీ దుకాణంలో పని మానేసి భర్త, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో చిరంజీవి ఉంటున్న సావిత్రిబాయి బస్తీలో గోల్డెన్ ప్లేట్ పేరుతో గొలుసుకట్టు చిట్టీల వ్యాపారం మొదలవుతుంది. కమిషన్లు, బహుమతుల పేరుతో గోల్డెన్ ప్లేట్ సంస్థ స్థానికులను ఆకర్షిస్తుంటుంది. కష్టపడకుండా సులభంగా డబ్బు ఇచ్చే సంస్థలను నమ్మి మోసపోవద్దని చిరంజీవి తన కుటుంబసభ్యులను, స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని హెచ్చరిస్తుంటాడు. ఈ క్రమంలో ఫీల్డ్ వర్క్‌పై 10 రోజులు బయటకు వెళ్తాడు చిరంజీవి. తను పొదుపు చేసిన డబ్బులతో భార్యకు స్టేషనరీ దుకాణం పెట్టిద్దామని బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి భార్యకు ఇస్తాడు. చిరంజీవి స్నేహితులు, అతని తల్లి, విజయ్‌శాంతికి మాయమాటలు చెప్పి గోల్డెన్ ప్లేట్ సంస్థలో పెట్టుబడి పెట్టిస్తారు. స్థానిక నాయకుడు శంకరన్న(సంతోష్ యాదవ్) కూడా అందులో డబ్బుపెట్టి బస్తీ వాళ్లలో నమ్మకాన్ని కుదురుస్తాడు. రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేస్తుంది. ఆ విషయం తెలిసిన చిరంజీవి తల్లి కుప్పకూలిపోతుంది. నమ్మి డబ్బులిస్తే నాశనం చేశానంటూ భార్య కుంగిపోతుంది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఏం చేశాడు? శంకరన్నకు గోల్డెన్ ప్లేట్ సంస్థతో ఉన్న సంబంధం ఏంటి? మధ్య తరగతి కుటుంబాలను నమ్మించి మోసం చేస్తున్న గోల్డెన్ ప్లేట్ సంస్థకు చిరంజీవి ఎలా అడ్డుకట్ట వేశాడనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్ని అత్యంత స‌హ‌జంగా తెర‌పై ఆవిష్క‌రించిన మ‌రో చిత్ర‌మిది. అవ‌స‌రాలు, ఆశ‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌తో ఆటుపోట్ల‌కి గుర‌వుతున్న స‌గ‌టు కుటుంబాల క‌థ.   సులభంగా డబ్బు వస్తుందని నమ్మి గొలుసుకట్టు వ్యాపారంలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. చాలా చోట్ల ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కరీంనగర్‌లో జరిగిన సంఘటనలను కథాంశంగా మలిచి తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు అక్షర. చిరంజీవి, విజయశాంతి ప్రేమ, పెళ్లి... రెండు కుటుంబాల్లో స్థితిగ‌తుల‌తో  ఆరంభ స‌న్నివేశాలు స‌ర‌దా సరదాగా సాగుతాయి. పెళ్లి త‌ర్వాత స‌న్నివేశాలు మ‌రింత వినోదాన్ని పంచుతాయి.  అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య వైరం, వాట్సాప్ స్టేట‌స్‌ల వ్య‌వ‌హారం న‌వ్వులు పంచుతాయి.  పాత్ర‌ల్లోని  అమాయ‌క‌త్వం, మాట్లాడే యాస మ‌న ఇంటి క‌థే, మ‌న చుట్టూ జ‌రిగే క‌థే అనే భావ‌న క‌లిగిస్తాయి.  విరామ సన్నివేశంతో అసలు కథ మొదలవుతుంది.

ద్వితీయార్ధంలో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సంఘర్షణ, భావోద్వేగాలు కథను చక్కగా ముందుకు తీసుకెళ్లాయి. గొలుసుకట్టు వ్యాపారానికి స్థానిక ఎన్నికలకు ముడిపెట్టిన మలుపు... కథలో ఆసక్తికరంగా సాగుతుంది. వాస్తవికతకు దగ్గరగా  ఉండే సన్నివేశాలు, కథానుగుణంగా వచ్చే పాటలు, హాస్యం ప్రేక్షకులను అలరిస్తాయి. మధ్య తరగతి కుటుంబాల్లో నిత్యం జరిగే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి. టీవీ కోసం అత్తా కోడళ్లు వాదులాటలు, కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే సందర్భాలు, తెలిసిన వాళ్లు ఇల్లు కట్టుకోవడం, ఉద్యోగాలు రావడం, బస్తీ రాజకీయాలు ఇలా... నిత్యం సామాన్య ప్రజలకు కనిపించే ఎన్నో సంగతులు సినిమాలో కనిపిస్తాయి. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్న కుటుంబాలు అనుభవించే బాధను కూడా దర్శకుడు సున్నితంగా చెప్పి ప్రేక్షకులను ఆలోచనలో పడేలా చేశాడు. అన్నింటికంటే మించి మంచి ఆలోచనలే మన భవిష్యత్తు అనీ,  ఆశయం ఎంత గొప్పగా ఉన్న ఆలోచన మంచిది కావాలనే విషయాన్ని ఈ చిత్రం వివరిస్తుంది

ఎవరెలా చేశారంటే: చిరంజీవి పాత్రలో చైతన్యరావు ఒదిగిపోయారు. మధ్య తరగతి కుటుంబ బాధ్యతలను భుజానెత్తుకున్న వ్యక్తిగా తెలంగాణ మాండలికంలో తన సహజ నటనను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ప్రేమికురాలిగా, గృహిణిగా కన్నడ భామ భూమిశెట్టి మెప్పించింది. సహాయ పాత్రల్లో నందకిషోర్, తల్లిగా నటించిన పద్మావతి, శంకరన్నగా సంతోష్ యాదవ్, పెద్దింటి అశోక్ పాత్రల పరిధి మేరకు నటించారు. అరుణ్ చిలువేరు అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలోని నీటి వనరులతోపాటు తెలంగాణ నేపథ్యం ఉట్టిపడేలా ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి అందించిన విజువల్స్ బాగున్నాయి. పెద్దింటి అశోక్ రాసిన మాటలు చప్పట్లు కొట్టిస్తాయి. దర్శకుడు కుమారస్వామికి కథ, కథనాలను తీర్చిదిద్దడంలో తనవంతు ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ సాగతీతగా అనిపించినా....తను చెప్పాలనుకున్న కథను చక్కగా వివరించడంలో సఫలమయ్యాడు. కథ చిన్నదే అయినా నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపించాయి.

  • బలాలు
  • + చైతన్యరావు, భూమిశెట్టిల నటన
  • + మాట‌లు, పాటలు
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ
  • - నెమ్మ‌దిగా సాగే స‌న్నివేశాలు
  • చివరిగా: షరతులు ఏమీ లేకుండానే ఇంటిల్లిపాది హాయిగా సినిమా చూడొచ్చు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని