Ghost Telugu Movie Review: రివ్యూ: ఘోస్ట్‌.. శివరాజ్‌కుమార్‌ యాక్షన్ థ్రిల్లర్‌ మెప్పించిందా?

శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలో ఎంజీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 04 Nov 2023 15:52 IST

Ghost Telugu Movie Review; చిత్రం: ఘోస్ట్‌; నటీనటులు: శివరాజ్‌కుమార్‌, జయరాం, అనుపమ్‌ఖేర్‌, ప్రశాంత్‌ నారాయణన్‌, అర్చనా జోయిస్‌, సత్య ప్రకాష్‌ తదితరులు; సంగీతం: అర్జున్‌ జన్య; ఛాయాగ్రహణం: మహేంద్ర సింహా; రచన, దర్శకత్వం: ఎం.జి.శ్రీనివాస్‌; నిర్మాత: సందేశ్‌ నాగరాజ్‌; విడుదల తేదీ: 04-11-2023

న్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్‌’లో సందడి చేసిన ఆయన.. ఇప్పుడు ‘ఘోస్ట్‌’తో (Ghost) వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఎం.జి.శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెలుగులో విడుదలైంది. మరి ఈ ‘ఘోస్ట్‌’ కథేంటి? సినీప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది?

కథేంటంటే: వామన్‌ శ్రీనివాసన్‌ (ప్రశాంత్‌ నారాయణన్‌) ఓ మాజీ సీబీఐ అధికారి. 10ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్‌ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వ అనుమతి సాధించుకుంటాడు. ఈ క్రమంలోనే భూమి పూజ చేయడానికి ఆ జైలులోకి అడుగు పెట్టిన వామన్‌ను.. అతని బృందాన్ని ఓ ముఠా కిడ్నాప్‌ చేస్తుంది. వాళ్లని అదే జైలులోని ఓ టవర్‌లో బందీ చేస్తారు. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా చరణ్‌ రాజ్‌ (జయరామ్‌)ను రంగంలోకి దించుతుంది. అతను తన పరిశోధనలో జైలుపై దాడి చేసి.. వామన్‌ను అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితమే చనిపోయిన బిగ్‌ డాడీ (శివ రాజ్‌కుమార్‌) అని తెలుసుకుంటాడు. మరి ఆ బిగ్‌ డాడీ ఎవరు? అతను వామన్‌ను జైలులో ఉన్నప్పుడే లక్ష్యం చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు?(Ghost Telugu Movie Review) ఆ జైలులో ఉన్న వెయ్యి కేజీల బంగారం కథేంటి? పితామహా ఏజెన్సీలోని ఘోస్ట్‌కు.. బిగ్‌ డాడీకి ఉన్న లింకేంటి? వీళ్లిద్దరూ ఒక్కరేనా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇదొక రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. పూర్తిగా మాస్‌ ఎలివేషన్లు, యాక్షన్‌ హంగామాని నమ్ముకొని చేసిన ప్రయత్నం. కాకపోతే ఆఖర్లో స్పై థ్రిల్లర్‌ టచ్‌ ఇచ్చి ఆసక్తిరేకెత్తించేలా చేశారు. కానీ, దానికి ముందు సినిమా అంతా ‘కేజీయఫ్‌’, ‘జైలర్‌’ సినిమాలను గుర్తు చేసే రెగ్యులర్‌ మాస్‌ యాక్షన్‌ హంగామాతోనే సాగుతుంది. కట్టుదిట్టమైన భద్రతతో ఉండే జైలులోనే ఓ మాజీ సీబీఐ అధికారిని హీరో కిడ్నాప్‌ చేయడం.. మొత్తం పోలీసు వ్యవస్థను ముప్పుతిప్పలు పెట్టి.. వాళ్లకు చిక్కకుండా తన లక్ష్యం నెరవేర్చుకొని బయటపడటం.. ఇదీ క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే చాలా కీలకం. ముఖ్యంగా హీరోకు.. పోలీసులకు మధ్య నడిచే మైండ్‌ గేమ్‌ ఎంత ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులకు అంత థ్రిల్‌ దొరుకుతుంది. (Ghost Telugu Movie Review) ఈ విషయంలో ‘ఘోస్ట్‌’ కొంత వరకే సఫలమైంది. వామన్‌ శ్రీనివాసన్‌ను బిగ్‌ డాడీ బృందం జైలులో ఎటాక్‌ చేసే ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే హీరో ఎలివేట్‌ సీన్స్‌ అన్నీ వావ్‌ అనిపిస్తాయి. ఈ కిడ్నాప్‌ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం చరణ్‌ రాజ్‌ను రంగంలోకి దించడంతో కథ వేగం పుంజుకుంటుంది. కానీ, ఆ తర్వాత కథనమంతా ఆ జైలు గోడల మధ్యే ఇరుక్కుని, అక్కడక్కడే తిరుగుతుంది. జైలులో ఉన్న బిగ్‌ డాడీ ముఠాను పట్టుకునేందుకు చరణ్‌ రాజ్‌ టీమ్‌ వేసే ఎత్తులు.. వాటిని ఎంతో తెలివిగా బిగ్‌ డాడీ చిత్తు చేసే తీరు ఆసక్తిరేకెత్తిస్తాయి. (Ghost Telugu Movie Review) ఈ మధ్యలో కథానాయికకు.. ఆమె తండ్రికీ మధ్య వచ్చే సెంటిమెంట్‌ ట్రాక్‌ సహనానికి పరీక్ష. వీటి మధ్యలో వామన్‌ శ్రీనివాసన్‌ గతాన్ని పరిచయం చేస్తూ.. అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బిగ్‌ డాడీ టీమ్‌పై కమాండోలతో చరణ్‌ రాజ్‌ చేయించే ఆపరేషన్‌.. డాడీ చెరలో బందీగా ఉన్న వామన్‌ను తప్పించేందుకు జైలులోని కరుడుగట్టిన నేరస్థులతో కలిసి సత్యరాజ్‌ చేసే ప్రయత్నం ఆసక్తిరేకెత్తిస్తాయి. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరింత ఉత్సుకత కలిగించేలా చేస్తాయి.

బిగ్‌ డాడీ గతమేంటి.. అతను వామన్‌ శ్రీనివాసన్‌ను ఎందుకు లక్ష్యం చేసుకున్నాడు.. జైలులోని వెయ్యి కేజీల బంగారం కథేంటి.. దాన్ని బిగ్‌ డాడీ ఎలా బయటకు తీసుకెళ్లగలిగాడు? అన్న అంశాల చుట్టూ ద్వితీయార్ధం సాగుతుంది. బిగ్‌ డాడీ గతం.. సీఏం కొడుకును అతని కళ్ల ముందే చంపే ఎపిసోడ్‌ ఆసక్తిరేకెత్తిస్తాయి. (Ghost Telugu Movie Review) అలాగే చరణ్‌ రాజ్‌కు.. బిగ్‌ డాడీకీ మధ్య వచ్చే గతానికి సంబంధించిన వార్నింగ్‌ ఎపిసోడ్‌ కూడా ఆకట్టుకుంటుంది. పోలీసుల్ని ఛాలెంజ్‌ చేసి జైలులోని బంగారాన్ని బిగ్‌ డాడీ బయటకు తీసుకెళ్లే తీరు ‘కిక్‌’ క్లైమాక్స్‌ను గుర్తు చేసేలా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో బిగ్‌ డాడీ అవతారం వెనకున్న మరో కోణం బయటకొస్తుంది. అది బలవంతంగా ఇరికించిన ట్రాక్‌లా అనిపిస్తుంది. ఈ కథలోని చాలా కీలక ప్రశ్నల్ని సీక్వెల్‌ కోసం అలాగే వదిలేశారు. ఫలితంగా సినిమాని ముగించిన తీరు సంతృప్తిగా అనిపించదు.

ఎవరెలా చేశారంటే: శివరాజ్‌ కుమార్‌ ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారు. సినిమా ఆద్యంతం కళ్లతోనే భావోద్వేగాలు పలికిస్తూ ముందుకు నడిపించారు. ఆయన స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు యాక్షన్‌ సీక్వెన్స్‌ను స్టైలిష్‌గా తీర్చిదిద్దిన విధానం బాగుంది. పతాక సన్నివేశాల్లో టెక్నాలజీ సాయంతో యంగ్‌ శివన్నను చూపించారు. ఆయా సీన్స్‌ ఆయన అభిమానులకు ఆనందాన్నిస్తాయి. పోలీస్‌ అధికారిగా చరణ్‌ రాజ్‌ పాత్రలో జయరామ్‌ చక్కటి నటన కనబరిచారు. (Ghost Telugu Movie Review) అర్చనా జోయిస్‌ పాత్ర కథకు స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డుతగులుతుంటుంది. సత్య ప్రకాశ్, ప్రశాంత్‌ నారాయణన్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మాత్రం స్టైలిష్‌గా డిజైన్‌ చేసుకున్నారు. యాక్షన్‌ సీన్లకు అర్జున్‌ జన్య అందించిన నేపథ్య సంగీతం హీరోయిజం ఎలివేట్‌ చేసేలా ఉంది. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + శివ రాజ్‌కుమార్‌ నటన
  • + యాక్షన్‌ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే కథనం..
  • - పతాక సన్నివేశాలు
  • చివరిగా: ‘ఘోస్ట్‌’.. శివన్న యాక్షన్‌ హంగామా! (Ghost Telugu Movie Review)
  • గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని