siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్‌.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?

siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్‌’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?

Published : 23 Feb 2024 17:50 IST

Siddharth Roy movie review; చిత్రం: సిద్ధార్థ్ రాయ్‌; న‌టీన‌టులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ త‌దిత‌రులు; ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: రధన్, కూర్పు: ప్రవీణ్ పూడి, క‌ళ‌: చిన్నా; ప్రొడక్షన్ డిజైనర్: బాల సౌమిత్రి, పోరాటాలు: పృథ్వీ, నృత్యాలు: శంకర్, ఈశ్వర్ పెంటి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, బాలాజీ, పూర్ణా చారి, వి యశస్వీ,  నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యశస్వీ; బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్, విహిన్ క్రియేషన్స్; విడుద‌ల‌: 23-02-2024

ఈ వారం అర‌డ‌జ‌నుకుపైగా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. అందులో అనువాదాలు, ప‌రిమిత వ్య‌యంతో రూపొందిన చిత్రాలు ఉన్నాయి. ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమ‌ల్’ చిత్రాల్ని గుర్తు చేసే క‌థానాయ‌కుడి పాత్ర‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించాయి ‘సిద్ధార్థ్ రాయ్‌’ ప్ర‌చార చిత్రాలు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో మంచి ప్ర‌చారాన్ని సొంతం చేసుకుందీ చిత్రం. ప‌లు చిత్రాల్లో బాల‌న‌టుడిగా మెరిసిన దీప‌క్‌ స‌రోజ్ ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. (Siddharth roy review) మరి ఈ సినిమా ఎలా ఉంది?దీపక్‌ మెప్పించాడా?

క‌థేంటంటే: సిద్ధార్థ్ రాయ్ (దీప‌క్ స‌రోజ్‌) తెలివైన‌వాడు. చిన్న‌ప్ప‌ట్నుంచే పుస్త‌కాల పురుగై... ప‌న్నెండేళ్ల‌కే ప్ర‌పంచంలోని ఫిలాస‌ఫీనంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్‌ లైన్‌గా భావిస్తూ, ఎమోష‌న్స్‌ని అస్స‌లు ప‌ట్టించుకోడు. ఇంట్లో మ‌నిషి చ‌నిపోయి అంద‌రూ ఏడుస్తుంటే ‘ఎందుకు ఏడ‌వడం చ‌నిపోతార‌ని ముందే తెలుసు క‌దా, ఆ మాత్రం మాన‌సికంగా సిద్ధం కాలేరా’ అని ప్ర‌శ్నిస్తాడు. తిండి, నిద్ర‌, కోరిక... బ‌త‌క‌డానికి అవ‌స‌ర‌మైన ఇవి ఎక్క‌డ దొరికితే అక్క‌డ పొందుతూ ఎలాంటి స్పంద‌నలు లేకుండా బ‌తుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సంద‌ర్భంలో ఎమోష‌న్స్ కూడా కీల‌క‌మే అని న‌మ్ముతాడు. అందుకు కార‌ణం ఇందు (త‌న్వి నేగి). ఇంత‌కీ  ఇందు ఎవ‌రు? ఆమె  ప్రేమ‌లో ప‌డిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి?  వాళ్లిద్ద‌రి ప్రేమ నిల‌బ‌డిందా?  లాజిక్‌, ఎమోష‌న్‌... ఈ రెండూ సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్ర‌భావం చూపించాయి?(Siddharth roy review) త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: లాజిక్‌... ఎమోష‌న్ ఈ రెండు విష‌యాల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఏ విష‌యంలోనైనా ప‌తాక స్థాయికి వెళితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో క‌థానాయ‌కుడి పాత్ర‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. రెండింటి మ‌ధ్య స‌మ‌తుల్య‌మే బ‌తుకు కిటుకు అని చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటుంది. వ్య‌క్తిత్వ వికాసానికి ఉప‌యోగ‌ప‌డే ఓ పాఠాన్ని తీసుకుని ద‌ర్శ‌కుడు ఈ  చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇందులోని క‌థానాయ‌కుడి పాత్ర‌, చిత్ర‌ణ  ఇదివ‌ర‌కు వ‌చ్చిన  అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల్ని గుర్తు చేస్తుంది.  అయితే  ఆ క‌థా ప్ర‌పంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్ర‌పంచం వేరు. ప్ర‌థ‌మార్ధం అంతా కూడా లాజిక్స్ ప్ర‌కారం న‌డుచుకునే క‌థానాయ‌కుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పంద‌న‌లు లేకుండా త‌నదైన ప్ర‌పంచంలో బ‌తికే క‌థానాయ‌కుడి పాత్ర  ఆలోచింప‌జేస్తుంది. త‌న జీవితంలోకి  ఇందు వ‌చ్చాక ఏర్ప‌డే ప‌రిణామాలతో క‌థ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం.

లాజిక్‌ని న‌మ్మే క‌థానాయ‌కుడు, ఎమోష‌న్స్‌ని విశ్వ‌సించే క‌థానాయిక మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాని ఆస‌క్తికంగా మార్చాయి. వారిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డాక  ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని సృష్టిస్తూ  ద్వితీయార్ధం మొద‌ల‌వుతుంది.  క‌థానాయిక దారిలోకి వ‌చ్చి  ఎమోష‌న్స్‌లోనూ ప‌తాక స్థాయికి వెళ్లాక ఏర్ప‌డే ప‌రిణామాలు క‌థ‌ని మ‌లుపు తిప్పుతాయి.  పాత్ర ప్ర‌ధానంగాసాగే చిత్ర‌మిది.  తాను చెప్పాల‌నుకున్న‌ది క‌థానాయ‌కుడి పాత్ర‌తో  బ‌లంగా చెప్ప‌డంలో దర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. (Siddharth roy review) అయితే  గ్రంథాల‌యం మొత్తాన్ని చ‌దివేసిన హీరోకి  పుస్త‌కాల్లో ఉన్న కోట్స్‌నే చెబుతూ చివ‌రిలో కౌన్సిలింగ్ ఇవ్వ‌డం క‌నిపిస్తుంది. మ‌రి అలాంటి పుస్త‌కాలు హీరోకి దొర‌క‌లేదా? లేక చ‌ద‌వ‌లేదా? అన్ని పుస్త‌కాలు చ‌దివిన హీరో ఎమోష‌న‌ల్ బ్యాలెన్స్ ఎందుకు త‌ప్పాడ‌నే త‌ర్కాలు  బ‌య‌టికొస్తే అది త‌ప్పేమీ కాదు. ప‌తాక స‌న్నివేశాలు శ్రుతిమించిన‌ట్టుగా అనిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: దీప‌క్ స‌రోజ్  న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ప్ర‌థ‌మార్ధంలో స్పంద‌న‌లు లేని కుర్రాడిగా ఎంత బాగా న‌టించాడో, ద్వితీయార్ధంలో ప‌తాక స్థాయిలో ఎమోష‌న్స్ ఉన్న కుర్రాడిగా అంత‌కుమించి న‌టించాడు. లుక్స్ ప‌రంగానూ  వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. త‌న్వి నేగి పాత్ర కూడా సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఆమె అందంగా క‌నిపిస్తూనే, న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న స‌న్నివేశాల్లోనూ ప్ర‌తిభ చూపించింది. నందిని, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, ఆనంద్ త‌దిత‌రుల పాత్ర‌లూ  ఆక‌ట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. శ్యామ్ కె.నాయుడు కెమెరా, ర‌థ‌న్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.  నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.  ఇలాంటి క‌థ‌, పాత్ర‌ల్ని తీర్చిదిద్దాలంటే ఫిలాస‌ఫీ, జీవితంపైన ఎంతో లోతైన అవ‌గాహ‌న ఉండాలి. ద‌ర్శ‌కుడు అంతే అవ‌గాహ‌న‌తో  క‌థ‌పై ప‌ట్టు కోల్పోకుండా చిత్రాన్ని మ‌లిచాడు. (Siddharth roy review) కాక‌పోతే క‌థానాయ‌కుడి పాత్ర, త‌న స‌మ‌స్య‌ని అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చెప్ప‌డంలో విఫ‌లం అయ్యారు. ఆంగ్లంలో సంభాష‌ణ‌లు మ‌రింత‌గా గంద‌ర‌గోళానికి గురిచేస్తాయి.

  • బ‌లాలు
  • + క‌థాలోచ‌న‌, భావోద్వేగాలు
  • + దీప‌క్ స‌రోజ్‌, త‌న్వి న‌ట‌న
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కుటుంబ ప్రేక్ష‌కుల్ని దూరం చేసే కొన్ని గాఢ‌మైన స‌న్నివేశాలు
  • - క్లైమాక్స్  
  • చివ‌రిగా: కొత్త ఫిలాసఫీ.. బతుకు కిటుకు చెప్పే ‘సిద్ధార్థ్ రాయ్‌’  (Siddharth roy review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని