Mahaveerudu Review: రివ్యూ: మహావీరుడు.. శివ కార్తికేయన్‌ కొత్త మూవీ ఎలా ఉందంటే..?

శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan), ఆదితి శంకర్‌ (Aditi Shankar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహావీరుడు’ (Mahaveerudu Review).

Updated : 14 Jul 2023 16:55 IST

Mahaveerudu Review.. చిత్రం: మహావీరుడు; నటీనటులు: శివకార్తికేయన్‌, ఆదితి శంకర్‌, సునీల్‌, యోగిబాబు, తదితరులు; సంగీతం: భరత్‌ శంకర్‌; సినిమాటోగ్రాఫర్‌: విధు అయ్యన్నా; ఎడిటర్‌: ఫిలోమిన్‌ రాజ్‌; కళ: కుమార్‌ గంగప్పన్‌; నిర్మాత: అరుణ్‌ విశ్వ; రచన, దర్శకత్వం: మడోన్‌ అశ్విన్‌; విడుదల తేదీ: 14-07-2023

‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్‌’లాంటి చిత్రాలు శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఆయన నటించిన తాజా తమిళ చిత్రం ‘మహావీరన్’. తెలుగులో ‘మహావీరుడు’ (Mahaveerudu) పేరుతో విడుదల చేశారు. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం, రవితేజ తన గాత్రాన్ని అందించటం, దర్శకుడు శంకర్‌ కుమార్తె హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (Mahaveerudu Movie Review) మరి ఈ ‘మహావీరుడు’ కథేంటి? దర్శకుడు మడోనా అశ్విన్‌ ఏ ఎలిమెంట్‌ను తీసుకుని మూవీని తీర్చిదిద్దారు?

కథేంటంటే: సత్య (శివకార్తికేయన్) తన తల్లి (సరిత), చెల్లితో కలిసి ఓ బస్తీలో జీవిస్తుంటాడు. అతనొక కామిక్ ఆర్టిస్ట్. సత్య వేసిన మహావీరుడి బొమ్మల కథలు మా భూమి పత్రికలో సుబ్బారావు పేరుతో ప్రచురితం అవుతుంటాయి. సమాజంలో ఏం జరిగినా సర్దుకుపోయే తత్వం అతనిది. ఓ రోజు బస్తీవాసులందరికీ ప్రజాభవనం పేరుతో అధికార పార్టీ అపార్ట్‌మెంట్లు కట్టి ఫ్లాట్‌లను అలాట్ చేస్తుంది. బస్తీ వాసులంతా వాటిల్లో చేరిపోతారు. రోడ్లు భవనాలశాఖ మంత్రి జయసూర్య ఆ ప్రజాభవనాన్ని నాసిరకంగా కట్టడంతో తలుపులు, కిటికీలు ఊడిపోతుంటాయి. పైకప్పు పెచ్చులు మీదపడి చిన్నారులకు గాయాలవుతుంటాయి. ప్రజాభవనం నిర్మించిన నాయకులు, కాంట్రాక్టర్లపై సత్య తల్లి ఎదురు తిరగాలనుకుంటుంది. కానీ, తల్లిని కూడా సత్య సర్దుకుపొమ్మని చెబుతుంటాడు. చెల్లితో అసభ్యకరంగా ప్రవర్తించినా ఏం చేయలేని పిరికివాడిగా ఉండిపోతాడు. ప్రజా సమస్యలను తన మహావీరుడి కథలో బొమ్మలు వేస్తుంటాడు. ప్రజాభవనం లోపాలపై జర్నలిస్ట్ చంద్రమతి (అదితి శంకర్) తన మా భూమి పత్రికలో రాయాలనుకుంటుంది. (Mahaveerudu Movie Review in telugu) అయితే, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మహావీరుడి కామిక్ కథను మా భూమి పత్రిక అర్ధాంతరంగా ముగిస్తుంది. ప్రజాభవనంలో జరిగే ఘోరాన్ని ఆపే ధైర్యం లేకపోవడంతో తల్లి మాటలతో కలత చెందిన సత్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే సత్య రాసిన మహావీరుడి కథలోని మాటలుపై నుంచి వినిపిస్తుంటాయి. ఆ మాటలు విన్న సత్య ఏం చేశాడు? పిరికివాడైన సత్య కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ భవనంలోని ప్రజలను ఎలా కాపాడాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక పిరికివాడు ప్రజల కోసం ధైర్యవంతుడిగా ఎలా మారాడనేదే మహావీరుడి కథ. ధైర్యమే విజయం నినాదంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహావీరుడు’ చిత్రం నిలువనీడ లేకుండా ఉన్న పేదప్రజల సమస్యలను తెరపై ప్రతిబింబించింది. ప్రతి పేదవాడు సొంతిల్లు ఉండాలి, బాగా బతకాలని కలలు కంటుంటాడు. బస్తీల్లో బతుకుతూ ఓ పూట తింటూ మరోపూట పస్తులుంటూ రేపటి కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి పేదలను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు ఆడే ఆటలో వారి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనేది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. (Mahaveerudu Movie Review in telugu) ప్రథమార్ధం బస్తీ ప్రజలకు ఆశచూపి వారు ఉన్నచోటును ఖాళీ చేయించడం, ప్రభుత్వం నిర్మించిన అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంట్లలోకి వెళ్లడం, అందులోని ప్లాట్లలో తలెత్తే సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించారు. కథానాయకుడు తను గీసిన మహావీరుడి బొమ్మల్లోని కథ రవితేజ మాటలతో వినిపించినప్పటి నుంచే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

రవితేజ మాటలను అనుసరిస్తూ మంత్రి అనుచర గణాన్ని ఎదిరించే తీరు మొదట్లో ఆకట్టుకున్నా ఆ తర్వాత సాగదీతగా అనిపిస్తుంది. ప్రథమార్ధం కథానాయకుడి అమాయకత్వం, పిరికితనం, ప్యాచ్ పనులు చేస్తూ నవ్వించే యోగిబాబు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రవితేజ మాటలతో విరామ సమయానికి ధైర్యవంతుడైన కథానాయకుడు ద్వితీయార్ధానికి వచ్చేసరికి మళ్లీ పిరికివాడిగా మారిపోతాడు. మంత్రి, అతని పీఏతో చేసే హంగామా మరీ నాటకీయంగా అనిపిస్తుంటుంది. (Mahaveerudu Movie Review in telugu) పోరాట సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉంటాయి. పతాక సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది. కథానాయకుడు పదేపదే పైకి చూడటం ప్రేక్షకులకు మెడనొప్పి తెప్పించేలా ఉంటుంది. రవితేజ గాత్రం అందించడం ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ.

ఎవరెలా చేశారంటే: అమాయకత్వం, పిరికితనంతో కూడిన సత్య పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. తనదైన శైలిలో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. సత్య తల్లి పాత్రలో సీనియర్ నటి సరిత తన అనుభవాన్ని చూపించారు. కథానాయిక అదితి శంకర్ తన పాత్ర పరిధిలో చక్కగా చేసుకుంటూ వెళ్లిపోయింది. మంత్రి పీఏగా సునీల్ కొత్తగా కనిపిస్తారు. యోగిబాబు ఎప్పటిలాగే నవ్వులు పండించారు. అపార్ట్‌మెంట్ ప్లాట్లలో ప్యాచ్‌వర్క్‌లు చేస్తూ తను చేసే సందడి మహావీరుడిలో ఊరటనిస్తుంది. (Mahaveerudu Movie Review in telugu) మండేలా లాంటి మంచి సామాజిక సందేశాన్ని ఇచ్చిన దర్శకుడు మడోనా అశ్విన్ తన రెండో సినిమా కోసం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలు ఎలా కల్లలవుతున్నాయో చూపించడానికి ప్రయత్నించాడు. మరింత లోతుగా అధ్యయనం చేసి చూపించాల్సింది. అదితి శంకర్ ఆలపించిన బంగారుపేటలో ఒక ఏకాకి కాకి ఉందంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు.

  • బలాలు
  • + దర్శకుడు ఎంచుకున్న కథ
  • + శివ కార్తికేయన్ నటన
  • + యోగిబాబు హాస్యం
  • బలహీనత
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • - కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం
  • చివరిగా: ఎంటర్‌టైన్‌ చేస్తూ అక్కడక్కడా మెప్పించే ‘మహావీరుడు’ (Mahaveerudu Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని