Telugu Actresses: సీనియర్‌ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే?

Updated : 16 Apr 2024 10:57 IST

యువ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. కొన్ని సార్లు సీనియర్‌ హీరోకు జోడీగా ఆ వయసుకు తగ్గ వారినే ఎంపిక చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తారు. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ కథల్లోనూ అనుభవం ఉన్న నటీమణులవైపే మొగ్గుచూపుతారు. దీంతో సీనియర్‌ హీరోయిన్లకు మంచి డిమాండ్‌ ఉంటోంది. కెరీర్‌ ప్రారంభమై రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ ఇలా అవకాశాల్లో దూసుకెళ్తూ ‘తగ్గేదే లే’ అంటున్న వారెవరో చూసేద్దాం..

సీనియర్‌ హీరోలకు పర్‌ఫెక్ట్‌ జోడీ..

కథానాయికగా త్రిష (Trisha) కెరీర్‌ మొదలై ఇరవయ్యేళ్లు పైనే అయ్యింది. ఇప్పటికీ ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. సీనియర్‌ హీరోలకు జోడీ అంటే ముందుగా త్రిష పేరే వినిపిస్తుంటుంది. గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అజిత్‌ సరసన ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi), మోహన్‌లాల్‌తో ‘రామ్‌’ (Ram), కమల్‌ హాసన్‌తో ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life), టొవినో థామస్‌తో ‘ఐడెంటిటీ’ (Identity) చిత్రాల్లో నటిస్తున్నారు.


పెళ్లి తర్వాతా అదే స్పీడు..

నయనతార (Nayanthara) కెరీర్‌ మొదలై కూడా ఇరవయ్యేళ్లు దాటింది. పెళ్లి తర్వాతా ఆమె వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది షారుఖ్‌ ఖాన్‌ సరసన ఆమె నటించిన ‘జవాన్‌’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఇరైవన్‌’, ‘అన్నపూరణి’ (నయన్‌ 75వ సినిమా)లతో ప్రేక్షకులను పలకరించారు. నయనతార, మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘టెస్ట్‌’ (Test) త్వరలో విడుదల కానుంది. క్రికెట్ ఇతివృత్తంగా దర్శకుడు ఎస్‌.శశికాంత్‌ దీనిని తెరకెక్కించారు. మరోవైపు, ‘మన్నంగట్టి సిన్స్‌ 1960’ (Mannangatti Since 1960) నాయికా ప్రాధాన్య చిత్రాన్ని ఆమె ఖరారు చేశారు. డ్యూడ్‌ విక్కీ డైరెక్టర్‌. బాలకృష్ణ- దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న #NBK109 (వర్కింగ్‌ టైటిల్‌)లో నయన్‌ నటించే అవకాశాలున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.


తమన్నా.. అక్కడా.. ఇక్కడా..

2005లో తెరంగేట్రం చేసిన తమన్నా (Tamannaah) సినిమాలతోనే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. గతేడాది.. ‘భోళా శంకర్‌’, ‘బాంద్రా’ తదితర చిత్రాలు, ‘జీ కర్దా’, ‘ఆఖిరీ సచ్‌’ సిరీస్‌ల్లో మెరిశారు. ఆమె నటించిన ‘బాక్‌’ (Baak) ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. దర్శకుడు సుందర్‌.సి రూపొందించిన హారర్‌ కామెడీ ‘అరణ్మనై’ (Aranmanai 4) ఫ్రాంచైజీలో నాలుగో చిత్రమిది. రాశీఖన్నా మరో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ‘ఓదెల 2’ (Odela 2), హిందీలో ‘వేద’ (జాన్‌ అబ్రహం హీరో), ‘డేరింగ్‌ పార్టనర్స్‌’ (సిరీస్‌)తో తమన్నా బిజీగా ఉన్నారు.


కాజల్‌ ఇలా..

నటిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వారిలో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ఒకరు. పెళ్లి తర్వాత ఆమె ‘భగవంత్‌ కేసరి’లో బాలకృష్ణకు జోడీగా మెప్పించారు. కమల్‌ హాసన్‌ సరసన ఆమె నటించిన ‘భారతీయుడు 2’ (Indian 2) జూన్‌లో రిలీజ్‌ కానుంది. మరోవైపు ‘సత్యభామ’ (Satyabhama)గాను సందడి చేయనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసు పాత్రలో కనిపించనున్న కాజల్‌ ఈ సినిమా కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు.


అనుష్క.. మళ్లీ అదే బాట

టాలీవుడ్‌లో ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీస్‌కు కేరాఫ్‌గా నిలిచిన అనుష్క శెట్టి (Anushka Shetty) మరోసారి అదే బాటలో నడుస్తున్నారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె.. గతేడాది నవీన్‌ పొలిశెట్టితో కలిసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ‘ఘాఠి’ (Ghaati), మలయాళంలో రోజిన్‌ థామస్‌ డైరెక్షన్‌లో ‘కథనార్‌’ (Kathanar: The Wild Sorcerer) సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ నాయికా ప్రాధాన్య చిత్రాలే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని