sri ranga neethulu review: రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది?

Published : 12 Apr 2024 07:51 IST

Sriranga Neethulu Review; చిత్రం: శ్రీ రంగ‌నీతులు; న‌టీన‌టులు: సుహాస్‌, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, రాగ్ మ‌యూర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, దేవీ ప్ర‌సాద్, సంజ‌య్ స్వ‌రూప్‌,సీవిఎల్ న‌ర‌సింహారావు  త‌దిత‌రులు; సంగీతం: హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర్సాడ‌; ఛాయాగ్ర‌హ‌ణం: టిజో టామి; నిర్మాత‌: వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి,; క‌థ‌,మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్; నిర్మాణ సంస్థ‌: రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌; విడుద‌ల‌: 11-04-2024

ఈ వారం తెలుగు బాక్సాఫీస్ ముందుకు అగ్ర తార‌ల సినిమాలేవీ రాలేదు.  ప‌రిమిత వ్య‌యంతో రూపొందిన ప‌లు సినిమాలే అన్నీ. అందులో ‘శ్రీరంగ‌నీతులు’ ఒక‌టి.  మంచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటాడ‌నే పేరున్న సుహాస్‌... ‘బేబి’తో విజ‌యాన్ని అందుకున్న విరాజ్ అశ్విన్‌,  ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ మొద‌లుకొని ప‌లు చిత్రాల‌తో మంచి న‌టుడిగా గుర్తింపు పొందిన  కార్తీక్‌ర‌త్నం... క‌థ‌ల ఎంపిక‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిరుచి ఉంద‌ని చాటుతున్న రుహానీశ‌ర్మ క‌లిసి చేసిన సినిమా ఇది. (Sriranga Neethulu Review) మ‌రి చిత్రం ఎలా ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా?

క‌థేంటంటే: మూడు క‌థ‌ల స‌మాహారం సినిమా. టెక్నీషియ‌న్‌గా ప‌నిచేసుకుంటూ బ‌స్తీలో జీవితం కొన‌సాగిస్తున్న శ్యాంసంగ్ శివ (సుహాస్)కి ఫ్లెక్సీల పిచ్చి.  రాజ‌కీయ నాయ‌కుడితో క‌లిసి ఫొటో తీయించుకుని, దాన్ని అంద‌రూ చూసేలా ఫ్లెక్సీ వేయిస్తాడు.  త‌న గురించి బ‌స్తీలో మాట్లాడుకోవాల‌నేది ఆశ‌. కానీ ఆ ఫ్లెక్సీ తెల్లారేస‌రికి క‌నిపించ‌దు. త‌నంటే ప‌డ‌ని మ‌రో గ్యాంగ్ వ‌ల్లే ఫ్లెక్సీ మాయ‌మైంద‌ని వాళ్లతో గొడ‌వ‌కి దిగుతాడు. మ‌ళ్లీ శివ ఫ్లెక్సీ వేయించాడా అనేది కీల‌కం. కార్తీక్ (కార్తీక్ ర‌త్నం)ది మ‌రో గొడ‌వ. జీవితంలో అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయాన‌ని మ‌ద్యానికీ, గంజాయికీ బానిస అవుతాడు. త‌న కొడుకు మారితే చూడాల‌నుకున్న తండ్రి (దేవిప్ర‌సాద్‌)కి అంత‌లోనే మ‌రో త‌ల‌నొప్పి. ఇంట్లో సెల్ఫీ తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన చిన్న కొడుకు కోసం పోలీసులు ఇంటికొస్తారు. (Sriranga Neethulu Review) ప్రేమికులైన ఐశ్వ‌ర్య (రుహానీశ‌ర్మ‌), వ‌రుణ్ (విరాజ్ అశ్విన్‌)ల‌ది మ‌రో స‌మ‌స్య‌. ప్రేమించుకున్నా ఆ విష‌యాన్ని ఇంట్లో పెద్ద‌ల‌కి చెప్పే  ధైర్యం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. మ‌రి వీరి జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకున్నాయనేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: నాలుగు జీవితాల‌తో ముడిప‌డిన మూడు క‌థ‌ల స‌మాహార‌మే ఈ చిత్రం. అసంపూర్ణం అనిపించేలా క‌థ‌లు, ల‌క్ష్యమంటూ లేని పాత్ర‌ల‌తో రూపుదిద్దుకున్న ఆంథాల‌జీ చిత్ర‌మిది. నేటి త‌రానికి చెందిన న‌లుగురి జీవితాల్లో ఓ ద‌శ‌లో ఎదుర్కొన్న అనుభ‌వాలకి తెర‌రూపం అన్న‌ట్టుగా ఉంటుందీ చిత్రం. ఆంథాల‌జీ సినిమాల్లో క‌థ‌ల్ని ఎక్క‌డో ఓ చోట క‌లిపి వాట‌న్నింటినీ ఓ ముగింపునిస్తుంటారు. కానీ, ఈ సినిమా అలా ఉండ‌దు.  దేనిక‌దే అసంపూర్ణంగా ముగిసిపోతుంది. పేరులో ఉన్న నీతులు క‌థ‌ల్లో మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌వు. ఆయా పాత్ర‌ల్ని బ‌ట్టి ప్రేక్ష‌కుడే ఊహించుకుని ఈ పాత్రలోని నీతి ఇదీ అని వెతుక్కుని సంతృప్తి చెందాలి. ఏ క‌థ‌ని ఎందుకు చెబుతున్నారో స్ప‌ష్ట‌త క‌నిపించ‌దు. స‌న్నివేశాల్లో బ‌లం వ‌ల్ల ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కూ సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఒకొక్క‌టిగా ప‌రిచ‌య‌మ‌య్యే  ఆయా పాత్ర‌ల  ప్ర‌పంచాలు, వాటిలోని అమాయ‌క‌త్వం, మాట‌ల‌తో అక్క‌డ‌క్క‌డా పండే సున్నిత‌మైన హాస్యం మెప్పిస్తుంది. క‌థేమీ లేకుండా, నిదానంగా స‌న్నివేశాలు సాగినా పాత్ర‌లు  ఏ మ‌లుపు తీసుకుంటాయ‌నే ఉత్సుక‌తని రేకెత్తిస్తూ ప్ర‌థ‌మార్ధం ముగుస్తుంది. (Sriranga Neethulu Review) సెకండాఫ్‌ సినిమాలో కొత్త విష‌య‌మంటూ లేక‌పోవ‌డంతో సినిమా సాగ‌దీత వ్య‌వ‌హారంలా అనిపిస్తుంది. ఏ క‌థ‌కీ స‌రైన ముగింపుని ఇవ్వ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. ‘ఒక స‌మాజంగా మ‌నం ముందుకు వెళుతున్నామా వెన‌క్కి వెళుతున్నామా అనేది తెలియాలంటే  ఈ త‌రాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది’ అంటూ త‌నికెళ్ల భ‌ర‌ణితో చెప్పించి ఈ క‌థ‌ల్ని మొద‌లుపెట్టారు.  సినిమా చూశాక మ‌రీ నేటిత‌రం ఇలా ఉందా?వాళ్ల  క‌థ‌లేనా?ఇవీ అనిపిస్తుంది. కాలం చెల్లిపోయిన క‌థ‌లు ఇవ‌న్నీ. కానీ ర‌చ‌న‌లో మాత్రం అక్క‌డ‌క్క‌డా మెరుపులు క‌నిపించాయి.  ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమా ఉండ‌టం క‌లిసొచ్చే విష‌యం.

ఎవ‌రెలా చేశారంటే: సుహాస్‌, విరాజ్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానీ... న‌లుగురూ వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. బ‌స్తీ కుర్రాడిగా సుహాస్‌, చెడు వ్య‌స‌నాల‌కి బానిసైన యువ‌కుడిగా కార్తీక్ ర‌త్నం న‌ట‌న గుర్తుండిపోతుంది. (Sriranga Neethulu Review) విరాజ్‌, రుహానీ నేటిత‌రం ప్రేమికులుగా సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతూ క‌నిపిస్తారు. ఆయా పాత్ర‌ల‌కి త‌గిన ఎంపిక అనిపించారు. సుహాస్ స్నేహితుడిగా రాగ్‌మ‌యూర్ క‌నిపిస్తారు. కార్తీక్ తండ్రిగా  దేవీ ప్ర‌సాద్ న‌ట‌న కూడా మెప్పిస్తుంది.  సినిమాలో ప్ర‌తి పాత్ర స‌హ‌జంగా క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కొన్ని స‌న్నివేశాల‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. సంభాష‌ణ‌లు, పాత్ర‌ల  రూప‌క‌ల్ప‌న, వాటిని న‌డిపించిన తీరు మెప్పించినా క‌థ‌, క‌థ‌నాల్లోనే బ‌లం లేదు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.

  • బ‌లాలు
  • + న‌టీన‌టులు
  • + అక్క‌డ‌క్క‌డా హాస్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - ద్వితీయార్ధం
  • చివ‌రిగా: శ‌్రీరంగ‌నీతులు... కాలం చెల్లిన క‌థ‌ల‌తో..(Sriranga Neethulu Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని