The Archies Review: రివ్యూ: ది ఆర్చిస్‌.. బాలీవుడ్‌ వారసుల మూవీ ఎలా ఉంది?

The Archies Review in telugu: జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన వింటేజ్‌ టీన్‌ మ్యూజికల్‌కామెడీ ఫిల్మ్‌ ‘ది ఆర్చిస్‌’ ఎలా ఉంది?

Updated : 08 Dec 2023 16:45 IST

The Archies Review in telugu; చిత్రం: ది ఆర్చిస్‌; నటీనటులు: అగస్త్య నంద, ఖుషీ కపూర్‌, సుహానా ఖాన్‌, వేదంగ్‌ రైనా, మిహర్‌ అహుజా, అదితి సైగల్‌, యువరాజ్‌ మెండా, సుహాజ్‌ అహుజా, తానా శర్మ తదితరులు; సంగీతం: శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌; సినిమాటోగ్రఫీ: నికోస్‌ ఆండ్రిట్‌సకిస్‌; ఎడిటింగ్‌: నితిన్‌ బైద్‌; కథ, స్క్రీన్‌ప్లే: ఆయేషా దేవిత్రి థిల్లాన్‌, రీమా కంగ్టి, జోయా అక్తర్‌, ఫరాన్‌ అక్తర్‌; దర్శకత్వం: జోయా అక్తర్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

యువతను ఆకట్టుకునేందుకు లభించిన సరికొత్త వేదిక ఓటీటీని దర్శక-నిర్మాతలకు చక్కగా వినియోగించుకుంటున్నారు. థియేటర్‌లో విడుదల సాధ్యం కాకపోతే నేరుగా ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. అలా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన చిత్రమే ‘ది ఆర్చిస్‌’ (The Archies). సినీతారల వారసులు అగస్త్య నంద (అమితాబ్‌ మనవడు) సుహానా ఖాన్‌ (షారుక్‌ కుమార్తె), ఖుషీ కపూర్‌ (శ్రీదేవి తనయ), అది సైగల్‌ (మ్యూజీషియన్‌ అమిత్‌ సైగల్‌ కుమార్తె), తారా శర్మ (నటుడు ప్రతాప్‌ శర్మ కుమార్తె)లు నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

కథేంటంటే: బ్రిటిష్‌ పాలనలో కొందరు ఆంగ్లేయులు ఇక్కడి వారిని కూడా వివాహం చేసుకున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాయి. అలా ఆంగ్లో-ఇండియన్‌లు అందరూ కలిసి రివర్‌డేల్‌ అనే హిల్‌ టౌన్‌లో నివసిస్తూ ఉంటారు. రివర్‌డేల్‌లో పుట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారితోనూ కుటుంబ సభ్యులు అక్కడి ‘గ్రీన్‌ పార్క్‌’లో ఒక చెట్టును నాటించడం ఆనవాయితీగా వస్తుంది. (The Archies Review in telugu) కట్‌ చేస్తే అది 1964. రివర్‌డేల్‌ మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశమవుతుంది. దీంతో గ్రీన్‌పార్క్‌లో చెట్లను కొట్టి అక్కడ ఓ మంచి హోటల్‌ కడితే వ్యాపారపరంగా లాభం పొందవచ్చని కొందరు అనుకుంటారు. అయితే, అందుకు రివర్‌డేల్‌ కౌన్సిల్‌ సభ్యుల అనుమతి తప్పనిసరి. అక్కడే పుట్టిన మొదటితరం పిల్లలు ఆర్చిస్‌ (అగస్త్య నంద), బెట్టీ కూపర్‌ (ఖుషీకపూర్‌), వెరోనికా లోడ్జ్‌ (సుహానా ఖాన్‌). అందరూ యుక్త వయసుకి రావడంతో పాటు, వారి లక్ష్యాలవైపు సాగుతుంటారు. ఆర్చిస్‌ సంగీతం నేర్చుకునేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ‘గ్రీన్‌ పార్క్‌’ను నాశనం చేసి, హోటల్‌ కడతారన్న విషయం స్నేహితుల ద్వారా తెలుస్తుంది. దీంతో తాను ఇంగ్లాండ్‌ వెళ్లే నిర్ణయాన్ని మార్చుకుని, ఆ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా స్నేహితులతో పోరాటం చేస్తాడు. మరి ఆర్చిస్‌ అనుకున్నది సాధించాడా? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? బెట్టీ, వెరోనికా, ఆర్చిస్‌ల ముక్కోణపు ప్రేమకథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కథ చదివారు కదా! విశ్లేషణలోకి వెళ్లే ముందు మనం రెండు కథలు చెప్పుకోవాలి. స్టోరీ నం.1: కథానాయకుడిగా ప్రకృతి, చెట్లు అంటే ఎంతో ప్రేమ. వాటిని కాపాడేందుకు ఎంత దూరమైన వెళ్తాడు. ఎంత పెద్ద వారినైనా ఎదిరిస్తాడు. అవసరమైతే ఆయుధం పడతాడు. అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరుకుతాడు. సిటీ మధ్యలో ఓ పచ్చని చెట్లతో నిండిన ప్రదేశంపై విలన్‌ కన్ను పడుతుంది. ఆ పార్క్‌ను ఖాళీ చేయించి, ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టాలనుకుంటాడు. ఈ విషయం మన హీరోకు తెలుస్తుంది. అక్కడి నుంచి హీరో, విలన్‌కూ మధ్య వార్‌. అంతిమంగా విలన్‌ను చితక్కొట్టి, హీరో పార్క్‌ను కాపాడతాడు. స్టోరీ నం.2: హీరో ప్రకృతి ప్రేమికుడు. విలన్‌కు బిల్డింగ్‌ కోసం సిటీ మధ్యలో ఉన్న పార్కు కావాలి. విలన్‌ ప్రయత్నాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అడ్డుపడుతూ ఉంటాడు. అది మన కథానాయకుడని విలన్‌కు తెలీదు. కట్‌ చేస్తే ఒకరోజు మన హీరోనే నేరుగా విలన్‌ గ్యాంగ్‌లో చేరి, ప్రతి దశలోనూ విలన్‌ పనులకు అడ్డు తగులుతూ ఉంటాడు. ఆర్నాల్డ్‌లాగా కండలున్నా.. బుర్రలో కాస్త గుజ్జు కూడా లేని విలన్‌కు అతడెవరో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. క్లైమాక్స్‌ వరకూ ఇలా టామ్‌ అండ్‌ జెర్రీ ఆట సాగుతుంది. చివర్లో ‘చెట్లు వాటి ప్రాముఖ్యత’ అనే అంశంపై హీరో ఐదో క్లాస్‌లో రాసిన వ్యాసాన్ని భావోద్వేగభరితంగా డైలాగ్‌ల రూపంలో చెప్పడంతో విలన్‌ మనసు కరిగి మారిపోతాడు. (The Archies Review in telugu) మన తెలుగు హీరోలు కొత్త హీరో దగ్గరి నుంచి అగ్ర హీరోల వరకూ ‘ఆర్చిస్‌’ కథను తీయాల్సి వస్తే.. ఈ రెండు ఫార్ములాల్లో ఏదో ఒకదాన్ని తీస్తారు. కానీ, జోయా అక్తర్‌ ‘ది ఆర్చిస్‌’ను కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేశారు. అందుకు 1964 నేపథ్యాన్ని ఎంచుకున్నారామె. అదే ‘ఆర్చిస్‌’ను రొటీన్‌ ఫార్ములా మూవీస్‌ను కాస్త భిన్నంగా ఉండేలా చేసింది. అలాగని సినిమా అద్భుతంగా ఉందా? అంటే, కథ, కథనాలను నడిపిన తీరులో మాత్రం జోయా కొంతవరకే సఫలమయ్యారు.

అసలు రివర్‌డేల్‌, అక్కడి గ్రీన్‌ పార్క్‌కు ఎలా పునాదులు పడ్డాయో కామిక్‌రూపంలో సింపుల్‌గా చెప్పేశారు. ఆ తర్వాత ‘గ్రీన్‌ పార్క్‌’ హోటల్‌ ఏర్పాటుకు అక్కడి వ్యాపారవేత్త, వెరోనికా తండ్రి హిరమ్‌ లోడ్జ్‌ (అల్యా ఖాన్‌) ప్రయత్నాలు మొదలు పెట్టడంతో కథేంటో ప్రేక్షకుడికి అర్థమవుతుంది. మరోవైపు ఆర్చిస్‌, బెట్టీ, వెరోనికా వాళ్ల స్నేహితుల పాత్రలను పరిచయం చేస్తూ కథను ముందుకు నడిపారు. ఒకవైపు చదువు వారి లక్ష్యాలను ప్రస్తావిస్తూనే మరోవైపు ప్రధాన పాత్రల మధ్య ముక్కోణపు కథను చూపించారు. (The Archies Review in telugu) ఆయా సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి. మధ్యలో ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేయడానికి పార్క్‌ విషయాన్ని తీసుకొచ్చినా, మళ్లీ పాటలు, ప్రేమ సన్నివేశాలతో కథ ముందుకు కదలదు. పార్క్‌ గురించి ఆర్చిస్‌, అతడి స్నేహితులకు తెలిసిన తర్వాతే కథపై కాస్త ఆసక్తి పెరుగుతుంది. ఆర్చిస్‌ తన ఇంగ్లాండ్‌ ప్రయాణం వాయిదా వేసుకోవడం, పార్క్‌ కోసం పోరాటం చేయడం తదితర సన్నివేశాలతో సినిమా చకచకా సాగిపోతుంది. (The Archies Review in telugu) సామాజిక మాధ్యమాలు లేని ఆ రోజుల్లో పార్క్‌ను కాపాడేందుకు, రివర్‌డేల్‌లో నివసిస్తున్న వారి నుంచి ఓట్లను సేకరించేందుకు ఆర్చిస్‌ అతడి స్నేహితులు ఏం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలను రాసుకున్న విధానం, తెరపై ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంది. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి.

ఎవరెలా చేశారంటే: వారసుల పిల్లలు నటిస్తున్న చిత్రం కావడంతో బాలీవుడ్‌ దృష్టి ‘ది ఆర్చిస్‌’పై ఉంది. అమితాబ్‌ మనవడు అగస్త్య నంద కూల్‌గా కనిపించాడు. ఖుషీకపూర్‌, సుహానాఖాన్‌ చబ్బీగా ఉన్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. ఇందులో ప్రత్యేకించి ప్రతినాయకులు ఎవరూ ఉండరు. దీంతో పాత్రల మధ్య గానీ, పరిస్థితులతోనూ గానీ సంఘర్షణ పెద్దగా ఉండదు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌  పాటలు పెద్దగా గుర్తు ఉండవు. కానీ, 1964 నాటి సంగీతాన్ని ప్రతిబింబించేలా వాటిని రాసుకున్న తీరు, ప్రజెంట్‌ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాకు ప్రధానబలం సినిమాటోగ్రఫీ. నికోస్‌ ఆండ్రిసైకిస్‌కు హ్యాట్రాఫ్‌ చెప్పాల్సిందే. కథ వర్తమానంలో నడుస్తున్నా, చాలా మంది తెరపై లాజిక్స్‌ మిస్సవుతారు. కానీ, జోయా అక్తర్‌ విజన్‌ను 100 శాతం తెరపై చూపించారు. (The Archies Review in telugu) 1964 పరిస్థితులను రీక్రియేట్‌ చేశారనడం కన్నా, కాల యంత్రంలో ఆ సమయానికి ప్రయాణించి తీశారేమో అనిపిస్తుంది. పాత్రల దుస్తులు, పరిసరాలు ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ప్రతి సన్నివేశానికీ ప్రాణం పోశారు.

నితిన్‌ బైద్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. రెండున్నర గంటల సినిమా, అదీ ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ఒక సాదాసీదా స్క్రీన్‌ప్లేతో నడపటం బాగోలేదు. రెండు గంటలకు ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. ‘ఆర్చిస్‌’ను ఒక విభిన్న నేపథ్యంతో చూపించడంలో దర్శకురాలు జోయా అక్తర్‌ విజయం సాధించినా.. భావోద్వేగాలతో కూడిన కథను ఒక సాదాసీదాగా చుట్టేయడం ఏమాత్రం బాగోలేదు. పాత్రల మధ్య ఎమోషన్స్‌ పెద్దగా క్యారీ చేయలేకపోయారు. అలాగే ప్రధాన పాత్రలకూ గ్రీన్‌ పార్క్‌కు ఉన్న అనుబంధం కేవలం ఐదేళ్ల వయసులో వాళ్లు ఒక మొక్కను నాటడమే. అది అది తప్ప పార్క్‌తో పెద్ద ఎమోషన్స్‌ ఏమీ చూపించలేదు. ముక్కోణపు ప్రేమకథతో కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా పార్కుతో నాటి యువత చిన్నప్పుడు అల్లు అనుబంధాన్ని చూపించి ఉంటే కథ మరింత బాగుండేది. అలాగే నిడివి విషయాన్ని కూడా జోయా అక్తర్ దృష్టి సారించలేదు. బహుశా అందుకేనేమో థియేటర్‌లో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీకి ఇచ్చేశారు.

కుటుంబంతో చూడొచ్చా: నిడివితో సంబంధం లేకుండా ఒక వింటేజ్‌ మూవీ చూడాలనుకుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడొచ్చు. ఒకట్రెండు కిస్‌ సీన్స్‌ ఉన్నా అవి కొన్ని సెకన్లే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + సినిమాటోగ్రఫీ
  • + ద్వితీయార్ధం
  • + నటీనటులు
  • బలహీనతలు
  • - కథ, కథనాలు
  • - నిడివి
  • - బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం
  • చివరిగా:  ‘ది ఆర్చిస్‌’.. జస్ట్‌ టైమ్‌ పాస్‌.. అండ్‌ ఓన్లీ ఓటీటీ మూవీ
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని