Telugu Movies: అన్నారు.. ఆసక్తి రేపారు.. అటకెక్కించ లేదు కదా!

కొన్ని రోజుల కిందట ఎంతో ఆసక్తి రేపిన క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు ఆ మాటే వినిపించడం లేదు. అసలు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియదు. ఆ సినిమాలేంటో చూసేయండి.

Published : 06 Dec 2022 09:47 IST

సినీ పరిశ్రమ (Tollywood)లో కొన్ని కాంబినేషన్స్‌ భలే ఆసక్తిగా అనిపిస్తాయి.  అగ్ర కథానాయకుల సినిమాలైతే వాటికి వచ్చే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అనుకున్నవన్నీ జరగవు.. అనుకోలేదని ఆగవు.. కొన్ని రోజుల కిందట చేసిన ప్రకటనలతో ఎంతో ఆసక్తి రేపిన క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు ఆ మాటే వినిపించడం లేదు. అసలు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియదు. ‘అటకెక్కించలేదు కదా’ అంటూ అభిమానుల్లో అనుమానం పెరుగుతోంది. మరి ఆ సినిమాలేంటో చూసేయండి.

ప్రకటనతో క్లారిటీ ఇచ్చేశారు!

సూర్య (suriya) కథానాయకుడిగా బాల దర్శకత్వంలో తెరకెక్కాల్సిన క్రేజీ మూవీ ‘అచలుడు’. ‘శివపుత్రుడు’, ‘నంద’ సినిమాలతో సూర్యకు మంచి హిట్స్‌ ఇచ్చారు బాల. అదే ‘అచలుడు’పై ఆసక్తికిని పెంచింది. అయితే, ఇటీవల ఈ సినిమా నుంచి వైదొలగుతున్నట్లు సూర్య ప్రకటించారు. తాను అనుకున్న పాత్రకు సూర్య సరిపోవడం లేదన్నది బాల మాట. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూసివారికి నిరాశే మిగిలింది.


‘ఉ’ అనరు.. ఊసెత్తరు..!

తెలుగులోనూ ఇలాంటి ఆసక్తికర కాంబినేషన్స్‌ ప్రకటించి, ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి ఉంచారు. అలాంటి వాటిలో, ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఒకటి. పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రమిది. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి హిట్‌ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్‌ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే, ఇటీవల ప్రకటించిన సుజీత్‌ చిత్రం ముందుగా పట్టాలెక్కనుందట. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌, చాలా తక్కువ కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కొద్ది సమయంలోనే సుజీత్‌ ఈ మూవీని స్టైలిష్‌గా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు. అలాగే సముద్రఖని దర్శకత్వంలో పవన్‌- సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో ‘వినోదయసిత్తం’ రీమేక్‌ చేస్తారని టాక్‌ వినిపించింది. దాని ఊసు కూడా వినిపించడం లేదు.  పవన్‌కల్యాణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకూ దీనిపై అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి అఖిల్‌తో ‘ఏజెంట్‌’ చేస్తున్నారు.


‘ఐకాన్‌’ మాటేంటో?

‘పుష్ప’ విజయంతో అల్లు అర్జున్‌ (Allu arjun) స్టార్‌డమ్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో దూసుకుపోయింది. ఈ సినిమా కన్నా ముందు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు బన్నీ దృష్టి అంతా ‘పుష్ప2’పైనే. ఈ సినిమా పూర్తయితే తప్ప, తర్వాతి సినిమాపై ఓ స్పష్టత రాదు. బోయపాటితో చేయాల్సిన సినిమా కూడా రామ్‌కు వెళ్లిందని టాక్‌. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ అడుగులు ఎటువైపో చూడాలి. అలాగే కొరటాల శివతో చేయాల్సిన సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది.


యువ దర్శకుడితో ఉన్నటా..? లేనట్టా?

కమ్‌ బ్యాక్‌ తర్వాత వరుసలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chianjeevi). ఇటీవల ఆయన నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ విడుదలై పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ చేస్తున్నారు. దీని తర్వాత వెంకీ కుడుములతో సినిమా చేయాల్సి ఉండగా, ప్రకటన మినహా ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఓ మలయాళ సూపర్‌హిట్‌ మూవీ హక్కులను చిరు కోసం కొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టే పవన్‌ సినిమా అయ్యిందనే టాక్‌ కూడా ఉంది.


ఎన్టీఆర్‌తో అనుకున్నారు.. అటు వెళ్లారు!

మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (NTR). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన చేసే సినిమా ఏంటా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది దర్శకులు కథలు వినిపించారు. ఈ జాబితాలో త్రివిక్రమ్‌ ముందున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా ఉంటుందని బాగా టాక్ వినిపించింది. ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ వైరల్‌ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌. మహేశ్‌తో సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్‌ ప్రకటించారు. ఇక ‘ఉప్పెన’ విజయం తర్వాత ఎన్టీఆర్‌ కోసమే ప్రత్యేకంగా కథ సిద్ధం చేసుకున్నారు బుచ్చిబాబు. ఇటీవల రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడంతో అది కాస్తా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించేందుకు సిద్ధమవుతున్నారు.


జనగణమన పాడారు..!

బాక్సాఫీస్‌ వద్ద ‘లైగర్‌’ చేదు అనుభవాన్ని మిగల్చడంతో ఇటు విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda), అటు పూరి జగన్నాథ్‌ల ‘జేజేఎం’ ఆగిపోయింది. ఆర్మీ నేపథ్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. విజయ్‌ ‘ఖుషి’చేస్తుండగా, పూరి జగన్నాథ్‌ పలువురికి కథలు వినిపించే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో చిరంజీవి, రవితేజలు ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మరోవైపు సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సినిమా చేయాల్సి ఉంది. ప్రకటన కూడా వచ్చింది. అయితే, సుక్కు, ‘పుష్ప2’పై బిజీగా ఉండటంతో ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు.


రామ్‌చరణ్‌తో తీద్దామనుకుని..

‘జెర్సీ’లో నానిని క్రికెటర్‌గా చూపించి, మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఆ విజయోత్సాహంతో రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా ఓ మూవీ చేసేందుకు కథను రెడీ చేసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్‌ మూవీ ప్రకటన ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు చెర్రీ శంకర్‌ మూవీ చేయడం, ఆ తర్వాత బుచ్చిబాబుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గౌతమ్‌ ప్రాజెక్టు లేనట్టేనని అర్థమవుతోంది. ఇదే కథను చిన్న చిన్న మార్పులు చేసి, విజయ్‌ దేవరకొండకు వినిపించినట్లు టాలీవుడ్‌ టాక్‌.

ఇవే కాదు, ఇలాంటి కాంబినేషన్స్‌ చాలానే ఉన్నాయి. తేజ-రానా కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే గోపిచంద్‌ హీరోగా తేజ మరొక సినిమా చేస్తానని ప్రకటించారు. వాటిపై ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్స్‌లో ఎప్పటికైనా సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు